ఇందిరాగాంధీ. ఈ పేరు వినగానే … తెగింపు , ధైర్యం, ఆత్మ విశ్వాసం, సాధికారికత, పట్టుదల అన్నీ గుర్తుకు వస్తాయి. ఒక మహిళ అయి ఉండి ప్రఖ్యాతి గాంచిన మహానేతలతో పోటీ పడి భారత దేశాన్ని ఏకచక్రాధిపత్యంగా పాలించ గలిగిన రాజనీతిజ్ఞులు. ఎన్ని సంక్షోబాలు ఎదురైనా, బెణుకు అనేది లేకుండా , ధైర్యసాహసాలతో ప్రధాని హోదాలో ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకోని పరిపాలనలో చెరగని ముద్ర వేసుకున్న సాటిలేని మేటి. ఇందిరా ప్రియదర్శిని గాంధీ (19 నవంబర్ 1917 – 31 అక్టోబర్1984) భారత దేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రూ మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేశారు. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నికైనారు. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేశారు. 19 నవంబర్ 1917న జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూల ఏకైక సంతానంగా జన్మించారు ఇందిరాగాంధీ. తాను ఆడుకునే ప్రతీ ఆటలో బ్రిటిష్ వారిని ఎదిరింది పోరాడే ఒక దేశభక్తురాలి గానే తనను ఊహించుకుంటూ ఆడుకొనివారు. 18 సంవత్సరాల వయస్సులోనే ఆమె వానర సేనను నడిపి ఉద్యమాలలో అనుభవం సంపాదించారు.
ఇంగ్లండ్ లో ఉద్యమ కార్యాచారణ
ఇందిర పూణే విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణురాలైనారు. విశ్వభారతి విశ్వ విద్యాలయంలో చదివారు. ఇంగ్లండులోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని సోమర్ విల్ కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో 1930 లో చేరారు. 1936లో తల్లి కమలా నెహ్రూను కోల్పోయింది. 1938 లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరింది. జర్నలిస్ట్ ఫిరోజ్ తో పరిచయం క్రమంగా పరిణయానికి దారి తీసింది. నెహ్రు కాశ్మీరీ బ్రాహ్మణులు కావటం, ఫిరోజ్ పూర్వీకులు పర్షియా నుండి భారతదేశానికి వలస వచ్చి స్థిరపడిన పార్సీలు కావటంతో పెళ్లి చేయటానికి ఆ సమయంలో నెహ్రూ ఒప్పుకోలేదు, ఆ తర్వాత నెహ్రు ని మహాత్మా గాంధీ ఒప్పించడంతో, 26 మార్చి1942న ఇందిర (25), ఫిరోజ్ (29)ల పెళ్లి చేశారు.1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్ళి 1943 మే 13 న విడుదలైనారు. జైలులో ఉండగానే ఆమె ఒక మగ పిల్లవాడికి తల్లి కాగా ఆ బాలునికి రాజీవ్ అని పేరు పెట్టారు. రాజీవ్ గాంధీకి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, వారు లక్నో వెళ్లారు. అక్కడ నేషనల్ హెరాల్డు పత్రికా సంపాదకునిగా ఫిరోజ్ గాంధీ పనిచేసిన సమయంలో సంజయ్ గాంధీ జన్మించాడు.
భర్తతో విభేదాలు
భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి ఆమె తండ్రి నివాసంలో జీవించారు. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడూ ఇందిర తండ్రి తరఫున ప్రచారం చేసి గెలిపించింది. ఖంగుమని మోగే కంఠస్వరం, సామాన్యులలో కలసిపోయే ఆమె స్వభావం ప్రజలను ఆకర్షించేవి. 2 ఫిబ్రవరి 1959న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమెను ఎన్నుకున్నారు. 8 సెప్టెంబర్ 1960న ఫిరోజ్ గాంధీ మరణించారు. 1964 మే 27న జవహర్ లాల్ నెహ్రూ మరణించడం ఇందిర జీవితంలో పెనువిషాదం.
తొలి మహిళా ప్రధాని
24 జనవరి 1966న ఇందిర మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా సంచలనం సృష్టించారు. నేటివరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్నిచేపట్టలేని రికార్డు అది. 25 జూన్ 1975న అర్ధరాత్రి భారత ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
22 మార్చి 1977న ఇందిరా గాంధీ భారత ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 1977లో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించి ఎన్నికలను ప్రకటించారు. అత్యవసర పరిస్థితి పరిణామం 1977 ఎన్నికలలో ఓటమి రూపంలో బయట పడింది. ఇందిర సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో కూడా జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది. 03 అక్టోబర్ 1977న ఇందిరా గాంధీని అరెస్టు చేశారు.
ఇది జాతీయ అసంతృప్తి, దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. 1978లో ఇందిరా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి చిక్కమగళూరు ఉప ఎన్నికలలో విజయం సాధించి లోక సభలో మళ్ళీ అడుగుపెట్టారు.
06 జనవరి 1980న మధ్యంతర ఎన్నికలలో ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ భారీ విజయం సాధించి మరో సారి ఆమె ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు. ఈసారి విశేషం ఆమె స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యతతో గెలుపొందారు.
అనేక మౌలిక విధానాలు
రాజభరణాల రద్దు, 1966లో రూపాయి విలువ తగ్గింపు, 1969లో బ్యాంకుల జాతీయీకరణ, బంగ్లా శరణాగతుల పునరావాసం లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలనకై గరీబీ హటావో నినాదం, 20 సూత్రాల పథకం లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టారు. 05 జూన్ 1984న ఇందిరా గాంధీ సిక్కు పవిత్ర స్థలమైన అమృత్సర్‌లోని స్వర్ణ దేవాలయం పై ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో దాడి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే 31 అక్టోబర్ 1984న భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లు న్యూ ధిల్లీలోని ప్రధాని అధికార నివాసంలో కాల్చి హత్య చేశారు. 03 నవంబర్ 1984న ఇందిరా గాంధీ మృతదేహానికి దహన సంస్కారం జరిగింది.
(నవంబర్ 19 ఇందిరా గాంధీ జయంతి)