- కాంస్య గెలుచుకున్న బజరంగ్ పునియా
- 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో వ్యక్తిగత స్వర్ణం గెలుచుకున్న బింద్రా తర్వాత చోప్డాదే చరిత్ర
టోక్యో: ఎట్టకేలకు భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం లభించింది. నీరజ్ చోప్డా జువెలిన్ త్రోలో జకోస్లావేకియా రిపబ్లిక్ కు చెందిన జాకూబ్ వద్లెజజ్చ్, వితెజస్లావ్ వెస్సెలీలను అదిగమించి స్వర్ణ పతకం అందుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో భారత దేశం తరఫున స్వర్ణపతకం అందుకున్న రెండో వ్యక్తిగత ఆటగాడు చోప్డా. హాకీకి 1928నుంచి ఆరు సార్లు వరుసగా ఒలింపిక్ స్వర్ణపతకం భారత్ కు వచ్చింది. కానీ వ్యక్తిగత అథ్లెట్స్ ఎవరు కూడా స్వర్ణపతకం సాధించలేదు – ఒక్క అభినవ్ బింద్రే 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో సాధించిన స్వర్ణ పతకం మినహా. బింద్రే తర్వాత చోప్డానే. మొత్తం ఇద్దరే ఇద్దరు.
శనివారం జరిగిన ఫైనల్ లో నీరజ్ చోప్డా మొదట 87.03 మీటర్ల దూరం జావినిల్ ని విసిరాడు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లు విసరడంతో అది అతిపెద్ద స్కోరు అయింది. మూడో ప్రయత్నంలో 76.79 మిటర్లకే పడిపోయింది. నాలుగు, అయిదు అవకాశాలను బుద్ధిపూర్వకంగానే జారవిడుచుకున్నాడు. ఆరో ప్రయత్నం లాంఛనం మాత్రమే. 84.24 మీటర్లు విసిరాడు. రెండో ప్రయత్నంలో చోప్డా సాధించిన ఘనతను జెక్ యోధులు ఎవ్వరూ అధిగమించలేకపోయారు. అసలు జర్మనీకి చెందిన జొహన్నస్ వెటెర్ ఈ సారి స్వర్ణం తన్నుకుపోతాడని అందరూ ఊహించారు. కానీ అతడు చివరి ఎనిమిదిమంది క్రీడాకారులలో లేకుండా ముందే అనర్హతపాలైనాడు ఆశ్చర్యకరంగా . అందుకని స్వర్ణలక్ష్మి నీరజ్ చోప్డాను వరించింది. ఈ స్వర్ణంతో కలిపి భారత్ టోక్యో ఒలింపిక్స్ లో ఇంతవరకూ ఏడు పతకాలు గెలుచుకున్నది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు.
బజరంగ్ పునియా కాంస్య విజయం
శనివారం ఉదయం జరిగిన రెజిలింగ్ మ్యాచ్ లో భారత్ కు చెందిన వస్తాదు బజరంగ్ పునియా గెలుపొంది కాంస్య పతకం సాధించాడు. కాంస్యం కోసం అతడు తజకిస్తాన్ కు చెందిన దౌలత్ నియాబ్బెకోవ్ తో తలపడి అవలీలగా గెలిచాడు. మొదటి టైమ్ పూర్తయ్యే సరికి రెండు పాయింట్లు గెలుచుకున్నాడు. ముగింపు ఇంకా మూడు నిమిషాలు ఉన్నదనగా మరి ఆరు పాయింట్లు గబగబా సంపాదించాడు. భారత వస్తాదు ఆధిక్యం ఆద్యంత్యం కొట్టవచ్చినట్టు కనిపించింది.
భారత ప్రధాని నరేంద్రమోదీ, క్రికెట్ దిగ్గజం సచీన్ టెండూల్కర్ లు చోప్డాను అభినందించారు. ప్రధాని ఈ రోజు మధ్యాహ్నమే పునియాకు అభినందనలు ట్వీట్ ద్వారా తెలియజేశారు.