- క్లిష్టంగా మారిన టెస్ట్ లీగ్ ఫైనల్స్ బెర్త్
- లీగ్ టేబుల్ అగ్రస్థానంలో ఇంగ్లండ్
- నాలుగో స్థానానికి పడిపోయిన భారత్
క్రికెట్ బహుచిత్రమైన క్రీడ. ఒక్కోసారి వైకుంఠపాళీని మించిపోయేలా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇంగ్లండ్ తో ప్రస్తుత నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ముందు వరకూ ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ టేబుల్ టాపర్ గా ఉన్న భారతజట్టు…చెన్నైటెస్టు ఓటమితో ఒక్కసారిగా నాలుగోస్థానానికి పడిపోయింది. టెస్టు లీగ్
ఫైనల్స్ లో చోటు సాధించే అవకాశాన్ని సంక్లిష్టంగా మార్చుకొంది.మరో వైపు…సిరీస్ ఆరంభానికి ముందు వరకూ లీగ్ టేబుల్ నాలుగోస్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టు భారత్ పై సాధించిన 227 పరుగుల విజయంతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.
నాలుగు స్తంభాలాట….!
భారత్-ఇంగ్లండ్ జట్ల సిరీస్ లోని తొలిమ్యాచ్ ముగిసిన తర్వాత ఐసీసీ విడుదల చేసిన లీగ్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా, భారత్ మొదటి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఐసీసీ టెస్ట్ లీగ్ లో భాగంగా ఆరవ సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్.. 11 విజయాలు, 4 పరాజయాలు, 3 డ్రాలతో మొత్తం 70.2 శాతం పర్సెంటేజీ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.మరోవైపు గతవారం వరకూ లీగ్ టేబుల్ టాపర్ గా ఉన్న భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆరో సిరీస్ ఆడుతున్న భారతజట్టు 9 నెగ్గి, 4 ఓడి, ఒక టెస్టును డ్రాతో సరిపెట్టుకొంది. మొత్తం 68.3 శాతం సగటు పాయింట్లతో నాలుగోస్థానంలో ఉంది. ఇప్పటికే ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొన్న న్యూజిలాండ్ రెండు, సౌతాఫ్రికాతో సిరీస్ రద్దు చేసుకున్న ఆస్ట్ర్రేలియా మూడు స్థానాల్లో ఉన్నాయి.
Also Read: చెపాక్ లో భారత్ కు షాక్
భారత్ అవకాశాలు క్లిష్టం…
ఇంగ్లండ్‌తో సిరీస్ ప్రారంబానికి ముందు వరకూ భారత్ ఫైనల్స్ చేరడం నల్లేరుమీద నడకేనని అందరూ భావించారు. అయితే…ఇంగ్లండ్ చేతిలో పరాజయంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారయ్యింది. అసలు భారతజట్టు టెస్ లీగ్ ఫైనల్స్ చేరగలదా అన్న సందేహం ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. విరాట్ సేన ఫైనల్స్ చేరాలంటే సిరీస్ లోని మిగిలిన మూడుటెస్టుల్లో ఓటమి లేకుండా ఉండటంతో పాటు…ఇంగ్లండ్ పై రెండు టెస్టులు ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది. ఇంగ్లండ్ తో సిరీస్‌లో భారత్ 2-1 లేదా 3-1తో గెలవాలి. అదే ఇంగ్లండ్ జట్టు మాత్రం..భారత్ ను మరో రెండుటెస్టుల్లో ఓడించి తీరాల్సి ఉంది.
ఒకవేళ ఇంగ్లండ్ 3-1 అంతకన్నా తక్కువ తేడాతో సిరీస్ నెగ్గినా, సిరీస్ డ్రా గా ముగించినా.. ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగుపెడుతుంది.ఫిబ్రవరి 13 నుంచి చెన్నై చెపాక్ స్టేడియం వేదికగానే ఇంగ్లండ్ తో జరిగే రెండోటెస్టు ఇంగ్లండ్ కు చెలగాటం, భారత్ కు ఫైనల్స్ బెర్త్ సంకటంగా మారింది. మరో ఓటమి ఎదురైతే మాత్రం…ఫైనల్స్ బెర్ రేస్ నుంచి భారత్ నిష్క్ర్రమించక తప్పదు.
Also Read: సిరీస్ నెగ్గితేనే భారత్ కు ఫైనల్స్ బెర్త్