Sunday, December 22, 2024

అఫ్ఘాన్ లో భారత్ చొరవ

అఫ్ఘాన్ పరిణామాలపై తాజాగా దిల్లీ వేదికగా సమావేశం జరిగింది. దీనిని భారతదేశమే నిర్వహించింది. ఎనిమిది దేశాలు ఇందులో పాల్గొన్నాయి. ప్రస్తుతం ఆ దేశం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ ప్రభావంతో, భవిష్యత్తులో, చుట్టూ వున్న దేశాలకు కూడా ప్రమాదాలు పొంచి వున్నాయనే అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఆ దేశం తాలిబాన్ ఆక్రమణలోకి వెళ్లిన తర్వాత జరిగిన మొట్టమొదటి సమావేశం ఇదే. కనుక, ప్రపంచ దేశాలన్నీ ఈ సమావేశాల వైపు చాలా ఆసక్తిగా చూశాయి. దీనిపై, తాలిబాన్ ప్రభుత్వ పెద్దల స్పందన కూడా చాలా ఆసక్తికరంగా సాగుతోంది.

అఫ్ఘాన్ విదేశాంగశాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ మాట్లాడుతూ ‘భారత్ తో సహా ఏ ఇతర దేశంతోనూ తాము విరోధాన్ని కోరుకోవడంలేదని’ తాజాగా స్పష్టం చేశారు. అన్ని దేశాలతో సామరస్య వాతావరణం కోసమే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. బీబీసీ -ఉర్దూకు చెందిన మహిళా జర్నలిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానాలు చెప్పారు. చాలా సాత్వికంగా స్పందిస్తూ వచ్చారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని.. ఆ తీరుపై కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆ దేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచీ ఇవే నీతి పాఠాలను తాలిబాన్ మూక వల్లెవేస్తోంది.

తమ పాలనలో, మహిళలకు పెద్దపీట వేస్తామని, గత ప్రభుత్వంలో పనిచేసిన ఎవరిపైన కూడా ఎటువంటి ప్రతిచర్యలు, కక్ష సాధింపులు ఉండవని, తమ పాలనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రి అంటున్నారు. భారత్ పై ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు. అఫ్ఘాన్ సంక్షోభ నివారణకు భారత్ చొరవచూపడంపై అమీర్ ఖాన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది ప్రాంతీయ దేశాలతో సమావేశం జరగడాన్ని ఆయన స్వాగతించారు. సమావేశంలో ప్రస్తావనలోకి వచ్చిన అంశాలను ఇప్పటికే నెరవేర్చామని అంటున్నారు.

భారత్ తో సన్నిహిత సంబంధాలను కలిగిఉండడానికి తాము సిద్ధమేనని చెబుతున్నారు. అఫ్ఘాన్ ప్రభుత్వ ప్రతినిధిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు పైకి చూడడానికి బాగానే ఉన్నాయి కానీ, విశ్వాసంలోకి తీసుకోలేము. ఈ విషయాన్ని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ కూడా వ్యక్తం చేశారు. ఆ దేశంలోని తాజా పరిణామాలు కేవలం ఆ దేశానికే కాక, సరిహద్దు దేశాలన్నింటికీ చిక్కులు, చికాకులు కలుగజేసేవేనని ఆయన అనుమానిస్తున్నారు. పరస్పర సహకారం, సమన్వయం, సంప్రదింపులతో సరిహద్దు దేశాలన్నీ ముందుకు వెళ్లాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆ సమయం వచ్చేసింది. ఉగ్రవాదం, డ్రగ్స్ రవాణా, ట్రాఫికింగ్ మొదలైనవన్నీ పెను దుష్ప్రభావాన్ని చూపించేవే. వీటన్నింటినీ అరికట్టాలంటే? దేశాలన్నీ సామూహిక వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది.

కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, తుర్క్ మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, రష్యా, ఐరాన్, భారత్ జాతీయ భద్రతా సలహాదారులంతా తాజా సమావేశం మూలంగా, ఒకతాటిపై రావడం మంచి పరిణామం. ఆహ్వానించినా.. చైనా, పాకిస్తాన్ పాల్గొనలేదంటే ఆ రెండు దేశాల హృదయం అర్ధమైపోతోంది. చైనాతో రష్యా అంటకాగుతున్నా, ఈ సమావేశంలో పాల్గొన్నందుకు రష్యాను అభినందించి తీరాలి. అఫ్ఘానిస్థాన్ లో ఆమెరికా వదిలేసిన ఆయుధాలతో తాలిబాన్ మూక ప్రదర్శనలు చేస్తోంది, ఈ అధునాతన ఆయుధాలను ఏదో విధంగా కొట్టేయ్యాలని పాకిస్తాన్ చూస్తోంది. తాలిబాన్ ను అడ్డం పెట్టుకొని అక్కడ డబ్బులు సంపాయించాలని, శతృదేశాలను మట్టుపెట్టాలని చైనా, పాకిస్తాన్ ఉమ్మడిగా దురాలోచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో, ఈ దేశాలను నమ్ముకుంటే, రష్యాకు  ప్రపంచ దేశాలు గుణపాఠాలు చెబుతాయి. తాలిబాన్ పరిణామ దశ నుంచీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటే, ప్రతిదశలో పాకిస్తాన్ పాత్ర ఉంది. అప్పుడు అమెరికాతో అంటకాగింది, ఇప్పుడు చైనాను భజన చేస్తోంది. అంతే తేడా.

దుర్మార్గమైన మత ఛాందసవాదంతో ఊగిపోయిన చరిత్ర తాలిబాన్ సొంతం, ఈ ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ జరుగుతున్న పరిణామాలు కూడా వాటినే గుర్తుచేస్తున్నాయి. రక్షణ, స్వేచ్చ కరవై అఫ్ఘాన్ మహిళలు భయం గోడల మధ్య మగ్గిపోతున్నారు. గత ప్రభుత్వానికి భారత్ వంటి దేశాలు సహాయసహకారాలు అందించినా, ఆ దేశం అందిపుచ్చుకోలేక పోయింది. అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. తాలిబాన్ రాకతో ఇతర దేశాల సహాయం కూడా ఆగిపోయింది. అక్కడ కరువు తాండవిస్తోంది. సామాన్య ప్రజలకు భవిష్యత్ అంధకారంగా మారింది. ఉగ్రవాద తాండవం ఆగడం లేదు. సందిట్లో సడేమియా లాగా, గత ప్రభుత్వ పాలనా సమయంలో తాలిబాన్ మూక సంపదలను బాగా పోగేసుకుంది. ఇప్పుడూ అదే పనిమీద ఉంది. దేశాన్ని సుభిక్షంగా ఉంచాలి, శాంతి సామరస్యాలు వెల్లివిరియాలనే ఆలోచనలు తాలిబాన్ కు లేనేలేవు.

అటు ఆ దేశ ప్రజలతో -ఇటు సరిహద్దు దేశాలతో శాంతి వచనాలు పలుకుతూ, సాత్వికంగా నటించే తాలిబాన్ ను ఎవరు నమ్ముతారు? అయినప్పటికీ, వారితో దౌత్యం నెరపడానికి, సంక్షోభం తగ్గించడానికి భారత్ దేశం చిత్తశుద్ధితోనే ఉంది. అదే రాజనీతి, అదే యుద్ధనీతి. తాలిబాన్ వైఖరి మారినా, మారకపోయినా, వారి విషయంలో అప్రమత్తంగా ఉంటూ, సరిహద్దు దేశాలను సైతం అప్రమత్తం చేస్తూ ఉండడమే భారత్ చేయగలిగింది, చేయాల్సింది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles