- కష్టకాలంలో హీరోలుగా నిలిచిన యువ ఆల్ రౌండర్లు
పెద్దమనుషుల క్రీడ క్రికెట్లో వేలమంది ఆటగాళ్లున్నా వీరోచిత ఆటతీరుతో హీరోలుగా నిలిచేవారు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి హీరోల కోవలోకి భారత యువఆల్ రౌండర్లు శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ వచ్చి చేరారు. కంగారూ విజయాలఅడ్డా బ్రిస్బేన్ గబ్బా వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరిటెస్టు మూడోరోజుఆటపై సుందర్- శార్దూల్ రికార్డు భాగస్వామ్యంతో తమదైన ముద్రను వేసి భారత టెస్టు చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్నారు.
ఇద్దరూ ఇద్దరే
ప్రస్తుత ఆస్ట్ర్రేలియా పర్యటనలోని ఆఖరి అంచె నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతూ భారత ప్రధాన ఆటగాళ్లలో సగం మంది గాయాలబారిన పడ్డారు. వారు జట్టుకు అందుబాటులో లేకుండాపోడంతో టీమ్ మేనేజ్ మెంట్ అయోమయంలో చిక్కుకొంది. బ్రిస్బేన్ వేదికగా జరిగే ఆఖరిటెస్టు తుదిజట్టు కోసం 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేయడం, తుదిజట్టులో సమతూకం సాధించడం కెప్టెన్ రహానే, చీఫ్ కోచ్ రవిశాస్త్ర్రిలకు సవాలుగా, అతిపెద్ద పరీక్షగా నిలిచింది.
అయితే…ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా తమిళనాడు యువఆటగాడు వాషింగ్టన్ సుందర్ లకు తుదిజట్టులో చోటు కల్పించడం ద్వారా టీమ్ మేనేజ్ మెంట్ గొప్పసాహసమే చేసింది.
ఇప్పటి వరకూ భారత వన్డే, టీ-20 జట్లకు మాత్రమే పరిమితమైన శార్దూల్ ఠాకూర్ కు టెస్టు అరంగేట్రం ఓ పీడకలగామిగిలింది. తన తొలిటెస్టుమ్యాచ్ లో కేవలం మూడు బంతులు వేసిన వెంటనేగాయంతో ఆట నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాతనుంచి మరో అవకాశం కోసం ఓపికగా ఎదురుచూస్తూ వచ్చిన శార్దూల్ కు…బ్రిస్బేన్ టెస్టు రూపంలో కలసి వచ్చింది. తొలిఇన్నింగ్స్ లో బౌలర్ గా 3 వికెట్లుపడగొట్టడం ద్వారా ఆస్ట్ర్లేలియాను 369 పరుగుల స్కోరుకు పరిమితం చేయడంలో శార్దూల్ తనవంతు పాత్ర నిర్వర్తించాడు.
Also Read : బ్రిస్బేన్ టెస్టులో భారత్ భళా
మేడిన్ ముంబై క్రికెటర్
భారత క్రికెట్లో ముంబై స్కూల్ ఆఫ్ క్రికెట్ కు ప్రత్యేక స్థానం ఉంది. విజయ్ మర్చెంట్, విజయ్ మంజ్రేకర్, సునీల్ గావస్కర్, అజిత్ వడేకర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, సచిన్ టెండుల్కర్ లాంటి ఎందరో ప్రపంచ మేటి క్రికెటర్లను అందించిన రికార్డు ముంబై క్రికెట్ కు ఉంది. అంతేకాదు…బ్యాటింగ్ ఆఖరి అంచె ఆటగాళ్లు సైతం తమ వికెట్ కు విలువనిచ్చి తుది వరకూ పోరాడటం, ప్రత్యర్థి బౌలర్లను ముప్పతిప్పలు పెట్టడం ముంబై క్రికెట్ ప్రత్యేకతగా ఉంటూ వస్తోంది.
అలాంటి ముంబై క్రికెట్ నుంచి వచ్చిన శార్దూల్ కేవలం బౌలింగ్ కు మాత్రమే పరిమితం కాకుండా…బ్యాటింగ్ లోనూ తాను ఆడిన జట్లకు కీలక పరుగులు అందించడంలో తనకుతానే సాటిగా నిలుస్తూ వస్తున్నాడు. అదేజోరును బ్రిస్బేన్ టెస్టు ఇన్నింగ్స్ లో సైతం కొనసాగించాడు.
Also Read : బ్రిస్బేన్ టెస్ట్ రెండోరోజుఆటకు వానదెబ్బ
రికార్డు భాగస్వామ్యం
ఆస్ట్ర్రేలియా తొలిఇన్నింగ్స్ స్కోరు 369 పరుగులకు సమాధానంగా తొలిఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో భారత్ 186 పరుగులకే ఆరు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన సమయంలో…జట్టు భారాన్ని శార్దూల్, సుందర్ తమ భుజాలపైన వేసుకొన్నారు. సంయమనంతో ఆడుతూ,కంగారూ ఫాస్ట్ బౌలర్ల త్రయాన్ని ఆత్మవిశ్వాసంతో,దీటుగా ఎదుర్కొంటూ 7వ వికెట్ కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా మ్యాచ్ ను మలుపు తిప్పారు.
శార్దూల్ 115 బాల్స్ ఎదుర్కొని 2 సిక్సర్లు, 9బౌండ్రీలతో 67 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సిక్సర్ షాట్ తో టెస్ట్ క్రికెట్లోతన తొలి పరుగులు సాధించిన శార్దూల్…హాఫ్ సెంచరీని సైతం సిక్సర్ తోనే పూర్తిచేయడం విశేషం. బ్రిస్బేన్ గబ్బా వేదికగా 1991 సిరీస్ లో 7వ వికెట్ కు కపిల్ దేవ్- మనోజ్ ప్రభాకర్ సాధించిన 58 పరుగుల అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డును…123 పరుగులభాగస్వామ్యంతో శార్దూల్- సుందర్ తెరమరుగు చేశారు.
Also Read : భారత 300వ టెస్ట్ క్రికెటర్ నటరాజన్
సుందర్ సూపర్ షో
భారత తురుపుముక్క, స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ గాయపడడంతో…అతని స్థానంలో అనూహ్యంగా చోటు దక్కించుకొన్న 21 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ కు జూనియర్ ప్రపంచకప్ తోపాటు ఐపీఎల్ టీ-20, భారత్ తరపున వన్డే, టీ-20 సిరీస్ లు మాత్రమే ఆడిన అనుభవం ఉంది. తమిళనాడుజట్టులో సభ్యుడిగా అడపాదడపా రంజీమ్యాచ్ లు ఆడినా పెద్దగా రాణించిన రికార్డు లేకపోయినా…అందివచ్చిన టెస్టు అవకాశాన్ని సుందర్ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడు. అపారఅనుభవం ఉన్న ఆటగాడిలా బ్యాటింగ్ చేసి 144 బాల్స్ లో 1 సిక్సర్ , 7 బౌండ్రీలతో 62 పరుగుల స్కోరు సాధించాడు. బౌలర్ గా తొలి ఇన్నింగ్స్ లో మూడు కీలక వికెట్లు సైతం సుందర్ పడగొట్టి…అశ్విన్ లేని లోటును పూడ్చగలిగాడు.
మొత్తం మీద…ఇటు శార్దూల్…అటు సుందర్ చెరో మూడు వికెట్లు, చెరో హాఫ్ సెంచరీతో బ్రిస్బేన్ టెస్టును చిరస్మరణీయంగా మిగుల్చుకొన్నారు. అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొన్న సుందరశార్దూలాలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.
good article