- ఆస్ట్రేలియాను ఓడించి ఒలింపిక్ సెమీస్ లో ప్రవేశం
- భారత మహిళల జట్టు సెమీఫైనల్ లో ప్రవేశించడం చరిత్రంలో ఇదే ప్రథమం
టోక్యో: భారత పురుషుల జట్టుతో పోటీ పడి మహిళల జట్టు ఒలింపిక్స్ లో ఆడుతోంది. ఆదివారం సాయంత్రం పురుషుల జట్టు గ్రేట్ బ్రిటన్ జట్టును క్వార్టర్ ఫైనల్ లో ఓడించి 49 సంవత్సరాల తర్వాత ప్రప్రథమంగా సెమీ ఫైనల్ లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. కాగా, భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా జట్టును ఓడించి ఒంప్రథమంగా ఒలింపిక్ సెమీ ఫైనల్ లోకి చేరుకొని చరిత్రలో తన పేరు నమోదు చేసుకున్నది. పురుషుల జట్టు లోగడ బాగా వెలిగింది. 1920ల నుంచి 1960ల వరకూ ఒలింపిక్ స్వర్ణ పతకం ఖాయంగా గెలుచుకునేది. వరుసగా ఆరు ఒలింపిక్స్ లో హాకీ స్వర్ణ పతకాన్ని ఇండియా పురుషులు గెలుచుకున్నారు. చివరి సారి 1980 మాస్కో ఒలింపిక్స్ లో స్వర్ణం గెలుచుకున్న భారత జట్టు తర్వాత ఒలింపిక్స్ లో ఐదో స్థానానికి మించి ఎదగలేకపోయింది. ఆదివారం సెమీస్ లో ప్రవేశించి నాలుగు దశాబ్దాల దుస్థితిని భారత పురుషుల జట్టు అధిగమించింది.
మహిళల జట్లు ఇంతవరకూ ఒలింపిక్స్ లో రాణించలేదు. సెమీ ఫెనల్ కు రావడం ఇదే ప్రథమం. ఆస్ట్రేలియా జట్టుతో ఆడుతూ మొత్తం మ్యాచ్ లో ఒకే ఒక గోలు భారత్ జట్టు చేసింది. ఆస్ట్రేలియా ఒక్క గోలు కూడా చేయలేదు. అప్పటి వరకూ ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉండిన భారత మహిళల జట్టు సెమీస్ కి చేరుకోవడమే చరిత్ర. ఆస్ట్రేలియా జట్టు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నది. అటువంటి జట్టును తొమ్మిదో స్థానంలో ఉన్న భారత జట్టు ఓడించడం నిజంగా విశేషం. గుర్జిత్ సింగ్ ఆట మొదలైన తర్వాత 22వ నిమిషంలో గోలు చేసి భారత్ కు విజయం అందించింది. లోగడ 1980 మాస్కో ఒలింపిక్స్ లోనే మొత్తం ఆరు మహిళల జట్లు పాల్గొంటే భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అంతా పరాజయ పరంపరే. దానికి సోమవారం ఉదయం అడ్డుకట్ట వేసి శభాష్ అనిపించుకున్నారు.
నవీన్ పట్నాయక్ కు అభినందనల వెల్లువ
భారత మహిళల జట్టు విజయం సాధించిన తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కి అభినందనల వెల్లువ వచ్చింది. ఎందుకు? భారత పురుషుల, మహిళల జట్టుల శిక్షణ ఖర్చు, ప్రయాణం ఖర్చు, బస ఖర్చు 2018 నుంచి ఒడిశా ప్రభుత్వమే భరిస్తోంది. నవీన్ పట్నాయక్ డెహ్రాడూన్ స్కూల్ లో చదివినప్పుడు హాకీ ఆడేవాడు. దేశం అంతా క్రికెట్ వెంట పడుతుంటే హాకీని పట్టించుకునే నాథుడు కరువైనప్పుడ నవీన్ హాకీకి అండగా నిలిచారు. ఆయన ప్రభుత్వం ఇంతవరకూ భారత హాకీ పైన రూ. 180 కోట్లు ఖర్చు చేసింది. హాకీలో అనేక పోటీలను భువనేశ్వర్ లో నిర్వహించడం పరిపాటి. రాణి రాంపాల్ నాయకత్వంలో ఆడుతున్న భారత మహిళల జట్టు సెమీ ఫైనల్ లో బుధవారంనాడు అర్జెంటీనా జట్టుతో తలబడుతుంది.