- బ్రిటన్ 4-3 స్కోరుతో విజయః
- గుర్జిత్ కౌర్ డబుల్ థమాకా వ్యర్థం
టోక్యో: కాంస్య పతకం కోసం శుక్రవారం ఉదయం గ్రేట్ బ్రిటన్ తో జరిగిన హామీ మ్యాచ్ లో భారత మహిళల జట్టు పరాజయం చెందింది. మ్యాచ్ సగం పూర్తయ్యే సరికి 3-2 ఆధిక్యం ఉండిన భారత్ మ్యాచ్ ముగిసే సమయానికి 3-4 స్కోరుతో ఓఢిపోయింది. ఆట మొదలు కాగానే బ్రిటన్ రెండు గోల్స్ సాధించింది. రెండో క్వార్టర్ లో భారత్ తరఫున గుర్జిత్ కౌర్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మార్చి స్కోరును సమం చేసింది. వందన కటారియా మూడో గోల్ సాధించడంతో ఆధిక్యంలోకి ఇండియా వెళ్ళింది.
కానీ మూడో క్వార్టర్ లో బ్రిటన్ ఆధిక్యం సంపాదించింది. మూడో గోలు చేసి స్కోర్ ను సమం చేయడమే కాకుండా నాలుగో గోలు కూడా సాధించి ఆధిక్యంలోకి వెళ్ళింది. మళ్ళీ ఇండియాకు గోలు చేసే వెసులుబాటు ఇవ్వకుండా బ్రిటీష్ మహిళలు పకడ్బందీగా ఆడారు. బ్రిటిష్ జట్టు కెప్టెన్ హోలీ పీయర్న్ వెబ్ , సారా రాబర్టసన్ లు బాగా రాణించారు. బ్రిటిష్ జట్టు 2016 రియోలో జరిగిన ఒలింపిక్స్ లో స్వర్ణపతకం గెలుచుకున్నది. కాంస్యం సాధించడంలో విఫలమైనప్పటికీ భారత జట్టు శక్తివంచన లేకుండా ఆడింది. రాణి రాంపాల్ నాయకత్వంలో ఇంతదూరం విజయాలు సాధించుకుంటూ వచ్చి భారత మహిళల జట్టును ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలబెట్టినందుకు హాకీ అభిమానులందరూ ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటారు.