‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు’ పాట చాలు ఆయన గాత్రమాధుర్యాన్ని, గంభీరతను చెప్పడానికి. అన్నం ఉడికిందో లేదో చెప్పడనికి అంతా పట్టిచూడనక్కర్లేదంటారు కదా? అలానే `భోజనం` గీతం చాలదూ!
మాధవపెద్ది సత్యనారాయణ అనే సత్యం రంగస్థల అనుభవంతో సినిమా నటుడుకాబోయి నేపథ్య గాయకుడయ్యారు. అయినా నటించారు. నటనపై ఆసక్తితో బొంబాయి చేరుకుని నిర్మాత వై.వి.రావు సంస్థలో నెలజీతంపై పనిచేస్తూ,`రామదాసు` తదితర చిత్రాలలో నటించారు. కొంతకాలనాకి మనసు మారింది. సొంతూరు గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు వచ్చి నాటక ప్రదర్శనలు ఇవ్వాలనుకున్నారు. పన్నెండో ఏట నుంచే రంగస్థలంతో పరిచయం ఉన్న ఆయన చిన్నికృష్ణుడు,వికర్ణుడు లాంటి వేషాలతో ఆరంభించి ప్రధాన పాత్రలూ పోషించారు. మంచి రూపం, నటన, వాచకం తన సొంతం కనుక రంగస్థలమే ఉత్తమమనుకున్నారు.అయితే `వేషాల మాట ఎలా ఉన్నానీ గొంతు బాగుంటుంది..బాగాపాడతావు…మద్రాసు వచ్చేయ్.. సినిమాల్లో పాడుకోవచ్చు` అని అప్పుడే పరిచయమైన సంగీత దర్శకుడు సీఆర్ సుబ్బరామన్ సలహా చెప్పారు.తాను సంగీత దర్శకత్వం వహించిన ’లైలామజ్ను‘ (1949)లో అవకాశం కూడా ఇచ్చారు. `మనుచుగాతా ఖుదా తోడై‘ అనే పాటను ఘంటసాల, ఫిఠాపురం నాగేశ్వరరావులతో కలసి పాడారు. విజయ ప్రొడక్షన్స్ వారు ఆ మరుసటి ఏడాది తీసిన `షావుకారు` చిత్రంలోలో పిచ్చన్నతాత వేషం వేయించడంతో పాటు ఆ పాత్రకు తత్వాలు పాడించారు. గాయకనట రెండు పాత్రలలో పేరు సంపాదించారు.
ధ్వన్యనుకరణ
సత్యంగారికి చిన్నప్పడే ధ్వన్యనుకరణను సాధనం చేశారు. ఎస్వీ రంగారావులా పాడడానికి అదే ఉపకరించిందని చెప్పేవారు.అలనాటి అగ్రనటులు నందమూరి, అ అక్కినేనిలకు ఘంటసాలలా,ఎస్వీఆర్ కు మాధవపెద్ది స్థిరపడిపోయారు. `మాయాబజార్`లో ఘటోత్కచుడి పాత్ర పద్యానికి ముందు వచ్చే `ఎంతమద మెంతకావరమెంత పొగరు` మాటలు మాధవపెద్దివే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. `సత్యం!నా పలుకులు నేను కూడా అలా పలకలేనయ్యా`అని ఎస్వీఆర్ అనడంలోనే ఆ గాత్రం గొప్పదనం తెలుస్తుంది.1957నాటి `వివాహ భోజనం` పాటను వయస్సు మళ్లిన తరువతా అదే గాంభీర్యంతో ఆలపించడం ఆయన ప్రత్యేకత.ఎస్వీ రంగారావుకు పాటలు, పద్యాలు పాడినట్లే, రేలంగి, రమణా రెడ్డిలకూ నప్పించారు. నాలుగు దక్షిణాది భాషల్లో, హిందీలోనూ పాడారు.
`వేలాది పాటలు పాడిన ఎంతటి గాయనీ గాయకులకైనా ఎక్కడో దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఏ చిన్న అపస్వరమైనా వినిపించడానికి అవకాశం ఉంది కానీ,సత్యం గారికి మాత్రం ఎక్కడా ఎప్పడూ అలాంటిది జరగలేదు`అని గానగంధర్వ బిరుదాంకితుడు (దివంగత) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పేవారు.
తప్పిపోయిన `దర్శకత్వం
నేపథ్యగాయకుడిగా స్థిరపడిన తరువాత సంగీత దర్శకత్వంపై ఆయనకు ఆసక్తి కలిగింది. అవకాశం వచ్చినట్లే వచ్చి జారిపోయింది. `నిజం చెబితే నమ్మరు`అన చిత్రానికి నాలుగు పాటలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సాగలేదు.దాంతో ఇక ఆ ప్రయత్నంచేయలేదన్నారనిరావి కొండలరావు చెప్పేవారు. అయితే తన కోరికను అన్నగారి అబ్బాయి సురేష్ లో చూసుకున్నారు. ’నేనెలాగూ సంగీత దర్శకుడిని కాలేకపోయాను.నువ్వు తప్పక మంచి సంగీత దర్శకుడివి కావాలి` అనే వారట.`బాబాయ్ ప్రోత్సాహమే నన్ను సంగీత దర్శకుడిని చేసింది‘ అంటారు మాధవపెద్ది సురేష్. ప్రసిధ్ద గాయని ఎస్.జానకీ ఆయన అభిమానిగా చెబుతారు. రాజమహేంద్రవరంలో సత్యం గారి వివాహ వేడుకలో ఆమె పాడినప్పుడు అభినందించి ప్రోత్సహించారట.ఆమె గాయని అయిన తరువాత ’కోడెకారు చిన్నవాడా` లాంటి పాటలు కలసి పాడారు.
గాయకత్రయం
తెలుగు సినిమా పరిశ్రమలో ఘంటసాల, మాధవపెద్ది, ఫిఠాపురం గాయకత్రయంగా ప్రఖ్యాతులు. ప్రత్యేకించి పౌరాణిక చిత్రాలలో ఘంటసాల, మాధవపెద్ది గాత్రాల నుంచి వెలువడిన పద్యాలు అజరామరం.ముగ్గురు కలసి అనేక పాటలు పాడారు. ఘంటసాలతో కలిసి పాడిన `మా ఊళ్లో ఒక పడుచుంది`లాంటి పాటలను సంగీత విభావరుల్లో పాడేవారు. ఘంటసాల కన్నుమూతతో ఆ పాటలను పిఠాపురంతో కలసి కచేరీలలో పాడేవారు. మాధవపెద్ది ఘంటసాల అంటే అమిత గౌరవాభిమానాలు. ఆయన సంగీత దర్శకత్వంలో అనేక పాటలు పాడారు. `మహానుభావుడు. అంత గొప్పగాయకుడైనా మా కోసమే కొన్ని పాటలు కేటాయించేవారు`అని మాధవపెద్ది గుర్తుచేసుకునేవారు. వాస్తవానికి ఘంటసాల కంటే మాధవపెద్ది ఎనిమిది నెలలు పెద్దయినా ఆయనకు ఇచ్చిన గౌరవం అది. సినీ నేపథ్య గానంలో తనకంటూ ఒక శైలి సృష్టించుకున్న ఆయన 2000 డిసెంబర్ 18న సెలవంటూ వెళ్లిపోయారు.
(ఈ నెల 18న మాధవపెద్ది వర్ధంతి)