Tuesday, January 21, 2025

టోక్యో ఒలింపిక్స్ అనుభవాలతో భవిష్యత్ బాటలు

విశ్వక్రీడలకు వేదికగా సాగిన టోక్యో ఒలింపిక్స్ వేడుకలు ముగిసాయి. ఈసారి భారతదేశం పతకాల బాటలో ప్రగతి సాధించి, విజయపతాకం ఎగురవేసింది. భావి ప్రయాణం పట్ల గొప్ప విశ్వాసాన్ని ప్రకటించింది. గత ఘన చరితను గుర్తుచేసింది. కొత్త చరితను సృష్టించింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తంగా ఏడు పతకాలు సాధించి సమరోత్సాహం నింపింది. 2012లో సాధించిన ఆరు పతకాల చరిత్రను అధిగమించింది.

Also read: మూడో ముప్పు ముసురుకుంటోంది, తస్మాత్ జాగ్రత!

125 మంది వెళ్ళి ఏడు పతకాలతో తిరిగి వచ్చారు

నూటపాతికమందికి పైగా మన ఆటగాళ్లు ఈసారి బరిలో దిగారు. 18 క్రీడాంశాల్లో ఏడింట పతకాలను మెరిపించడం చెప్పుకో తగ్గ ఘనతగానే భావించి సంతసించాలి. ఇప్పుడు జబ్బలు చరచుకొనే ప్రభుత్వాలు,వాణిజ్య, వ్యాపార స్వార్థంతో బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకోడానికి బహుమానాలతో ముందుకు వస్తున్న కంపెనీలు ఇంతకు ముందుగానే క్రీడలకు, క్రీడాకారులకు అండగా నిలుచొని ఉండి ఉంటే ఇంతకంటే దండిగా పతకాలను కొల్లగొట్టి ఉండేవారం. ఆ దమ్ము, ధైర్యం మనక్రీడాకారులకు పుష్టిగా ఉంది. తగిన ప్రోత్సాహకాలు లేకనే మన ప్రతిభ మసకబారింది. 2024లో జరుగబోయే ఒలింపిక్స్ లో మళ్ళీ సత్తా చూపించడానికి మన క్రీడాబృందాలు సంసిద్ధంగా ఉన్నాయి. నేటి విజయాల స్ఫూర్తితో ఇప్పటికైనా మన ప్రభుత్వాలు, బడా కంపెనీలు క్రీడల పక్షాన నిలిస్తే మనకు ఎదురే ఉండదు. 2021 ఒలింపిక్స్ మనకు తీయని జ్ఞాపకాలనే మిగిల్చింది. జావెలిన్ త్రో లో స్వర్ణాన్ని హస్తగతం చేసుకున్న నీరజ్ చోప్రా వందేళ్లకు ఒక్కడుగా నిలిచి, భారత ఘనతను స్వర్ణాక్షరాల్లో లిఖించాడు.  మన్ ప్రీత్ బృందం పురుషుల హకీలో చూపించిన సత్తా, సాధించిన  గెలుపు  తక్కువేమీ కాదు. 41 ఏళ్ళ గతానికి పరిమితమైన మన చరితను మళ్ళీ తట్టిలేపి,ఈ తరాలకు చూపించిన మహత్వం మన్ ప్రీత్ బృందానిదే. కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చినా  ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి, పతాకాన్ని చేజిక్కించుకున్న తీరు అద్భుతమని చెప్పాలి. మన పరువును కాపాడిన వీరికి హృదయంగమంగా అభినందనలు అందించాల్సిందే. క్రికెట్ హోరులో, ఆ ఆకర్షణ జ్వరంలో  మన జాతీయ క్రీడ దశాబ్దాల నిరాదరణకు గురయ్యింది. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పుణ్యమా అని మళ్ళీ మన హకీ పైకి లేచింది. పురుష,స్త్రీ బృందాలతో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకొని నూటయాభైకోట్ల రూపాయల నిధులు అందించి,ఆయన పెన్నిధిగా నిలిచారు.నిజం చెప్పాలంటే,మన కేంద్ర ప్రభుత్వానికి కానీ,మన రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ వాళ్ళు ఖర్చు పెట్టె డబ్బుతో,చేసే దుబారాతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నమొత్తం. ఒక్క ఒరిస్సా తప్ప, ఏ ఒక్క ప్రభుత్వం, ఏ బడా కంపెనీ జాతీయ క్రీడను బతికించుకోవడంలో ముందుకు రాకపోవడం చాలా దురదృష్టకరం. దాదాపుగా మూడు దశబ్దాల నుంచి మనం ఒలింపిక్స్ లో మనకంటూ ఒక ముద్ర వేసుకోలేకపోయాం. కొన్నాళ్ళు ఒకే ఒక పతకంతోనే సరిపెట్టుకున్నాం. 2008లో మూడు,2012లో  ఆరు, 2016లో రెండు పతకాలు మాత్రమే సాధించగలిగామంటే  మనం ఎంతగా వెనకబడిపోయమో చెప్పక్కర్లేదు.ఈ చరిత్రతో పోల్చుకుంటే నేటి ఒలింపిక్స్ లో మనం మెరుగ్గానే నిలబడ్డాం.

Also read: రామాలయం సరే, రామరాజ్యం ఎప్పుడు?

జావెలెన్ స్వర్ణం అందించిన ఆధిక్యం

జావెలెన్ త్రో లో స్వర్ణం సాధించి తల పైకెత్తుకో గలిగాం. మన తెలుగమ్మాయి సింధు బ్యాడ్మింటన్ లో వరుసగా రెండు పతకాలను సొంతం చేసుకొని మన పేరు నిలబెట్టింది. బరువులెత్తి రజతం పట్టి  మన పరువు పెంచిన మీరాబాయి చానుకు అభినందనలు అందిద్దాం. బాక్సింగ్ లో లవ్లీగా ఆడి, కాంస్యం కొట్టేసిన లవ్లీనాకు జేజేలు పలుకుదాం. సింధు,మీరాబాయి చాను, లవ్లీనా ముగ్గురు మహిళాశక్తిని చాటి చెప్పారు. ఒలింపిక్స్ చరిత్రలో మన మహిళా హకీ జట్టు సెమీస్ దాకా వెళ్లడం మంచి మలుపు. పతకాలు పొందకుండా వెనక్కు వచ్చినా నేడు చూపిన ప్రావీణ్యం, తెగువ వచ్చే ఒలింపిక్స్ లో తప్పక పతాకాన్ని కైవసం చేసుకుంటామనే విశ్వాసాన్ని ప్రోది చేశాయి. ఈ జట్టు మలుపుకు కూడా ఒరిస్సా ప్రభుత్వ సహకారమే మూలంగా నిలిచింది. కుస్తీ పోటీల్లో రవి, బజరంగ్ లు రెండు పతకాలను పట్టేసి  మన పతకాల ఖాతాను పెంచారు. సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకొంటే పొరపాటోయి … అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ఈ ఒలింపిక్స్ గెలుపు స్ఫూర్తిని నింపినా మన వెనుకబాటుతనాన్ని, మన వైఫల్యాలను సమీక్షించుకొని తీరాల్సిందే. వాటి నుంచి పాఠాలు,గుణపాఠాలు నేర్చుకొని ముందుకు సాగితే  మరిన్ని విజయతీరాలకు చేరువవుతాం. నేడు సాధించిన పతకాల పట్టికను బట్టి చూస్తే  మన దేశం 47వ స్థానంలో ఉంది. అమెరికా (113), చైనా (88), జపాన్ (58) తొలి మూడు స్థానాల్లో అగ్రపీఠంపై ఉన్నాయి.స్వర్ణాల్లోనూ రెండవ స్థానంలో నిలచిన చైనా 38 స్వర్ణ పతకాలు చేజిక్కించుకొని, ఆమెరికాకు(39)కు దగ్గరగా వచ్చేసింది.మనం ఒకే ఒక స్వర్ణాన్ని పొందగలిగాం. చైనా మనకంటే అన్నిరకాలుగానూ అందనంత స్థాయిలో ఉందని మరోసారి రుజువయ్యింది. ఆ దేశాలన్నీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడిన క్రీడా ప్రాంగణాలను లెక్కకు మించి నిర్మించుకున్నాయి. చిన్ననాటే పిల్లల ప్రతిభను గుర్తించి అత్యున్నతమైన ఆచార్యులతో అత్యుత్తమమైన శిక్షణను ఇవ్వగలిగితే, మనవాళ్ళూ రాణిస్తారు. వసతులు, వనరులు కల్పించడం, క్రీడా విద్యాలయాలు ఏర్పాటు చేయడం, ఒలింపిక్స్,ప్రపంచ కప్స్ సాధనలో ప్రత్యేకమైన శిక్షణ, తోడ్పాటు అందజేస్తే  పతకాలను కొల్లగొట్టే చేవ మనవారిలో పుష్కలంగా ఉంది. ఆత్మనిర్భర్ లో క్రీడలు కూడా భాగస్వామ్యం కావాలి. రాజులు తలచుకుంటే విజయాలకు, పతకాలకు కొదువేమి ఉంటుంది? ఇప్పటికైనా మన ప్రభుత్వాలు, మన బడా సంస్థలు క్రీడావికాసానికి కదిలిరావాలి. మనకంటే చాలా చిన్న దేశాలు మనల్ని మించిన విజయాలను సాధించాయి. ఆ దేశాల తీరు తెన్నులను మనం అధ్యయనం చెయ్యాలి. నేటి ఒలింపిక్స్ ఫలితాలు రేపటి గెలుపుకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిద్దాం.

Also read: విశాఖ ఉక్కు: నాయకుల నక్కజిత్తులు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles