భారతీయ ఆంగ్ల కవులు-1
కళ దేశ కాలాలకు అతీతమైoది. ఆందులో ఓ ముఖ్య భాగమైన కవిత్వం కూడా అవధులు లేనిది. ఆంగ్లం మాతృభాషగా కలిగిన వారేకాక మరెందరో ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించి చక్కటి రచనలు చేశారు. అలాంటి వారిలో భారతీయ కవులు ఎవరికీ తీసిపోని ప్రత్యెక స్థానం సంపాదించుకున్నారు. రవీoద్రనాద్ ఠాకూర్ నుండి నేటి వరకు అనేక మంది భారతీయులు తమ రచనలతో ఆంగ్ల కవిత్వాన్ని సంపన్నం చేశారు. సృజనాత్మకత, వాసితో పాటు రాశి, భాషా పాటవం మనవారి ఆంగ్ల కవిత్వాన్ని ప్రత్యేక సాహిత్యంగా ప్రపంచం ముందు నిలబెట్టింది. అరవింద ఘోష్, పార్థ సారధి, డోమ్ మొరెస్ , కమలా దాస్, మైఖేల్ మధుసూదన్ దత్, తోరు దత్, సరోజినీ నాయుడు, మీనా కందసామి లాంటి లబ్ధ ప్రతిష్టులైన అనేకమంది ప్రముఖ కవులను వదలి కొందరిని మాత్రమె ఈ చిన్ని విహంగ వీక్షణ వ్యాస పరిధిలో పొందుపరచడం జరిగింది.
మైసూరు వాసి ఎ కె రామానుజం “ఎ రివర్” అనే కవితలో మధురైలోని నది గురించి వర్ణించారు. ఆ దేవాలయాల నగరoలో జీవనదిగా భావించబడే నదీ తీరాన వేసవి కాలంలో ఇసుక తిన్నెలు బయట పడినపుడు కవులెవరూ దానిని పట్టించుకోరు. కాని వరదలతో నది నిండినపుడు పాత, కొత్త కవులందరూ నది అందాన్ని వర్ణిస్తూ కవిత్వం రాస్తారు. వరదలో కొట్టుకు పోయిన మూడు ఇళ్ళ గురించి, ఒక గర్భిణి గురించి, గోపి, బ్రింద అనే పేర్లు కలిగిన రెండు ఆవుల గురించి ఎవరూ పట్టించుకోరు. అది అక్కడ ప్రతి సంవత్సరం జరిగేదే అనేస్తారు. విశేషమేమిటంటే ఆవుల పేర్లు తెలుసు వారికి. కాని చనిపోయిన గర్భిణి పేరు మాత్రం తెలియదు. మానవత్వం, సాంఘీక బాధ్యత లేని కవుల నిర్దయను ఎండగట్టారు రామానుజం ఈ కవితలో.