- అటు కరోనా…ఇటు క్రికెట్ హైరానా!
అత్యుత్తమ ప్రమాణాలకు మరో పేరైన ఆస్ట్రేలియా గడ్డపై ఓ విదేశీజట్టు టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఇంతగా కష్టపడాలా? అనుకొనే రోజులు వచ్చాయి. జనవరి 15 నుంచి గబ్బా స్టేడియం వేదికగా జరిగే ఆఖరి టెస్టు లో పాల్గొనటానికి సిడ్నీ నుంచి బ్రిస్బేన్ చేరుకొన్న భారత క్రికెటర్లు పడుతున్నపాట్లు అన్నీఇన్నీ కావు.
బ్రిస్బేన్ వేదికగా ఉన్న క్వీన్స్ లాండ్ రాష్ట్రంలో కరోనా అదుపుకోసం అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలు పాటిస్తోంది. పొరుగునే ఉన్న న్యూసౌత్ వేల్స్ నుంచి తమ రాష్ట్ర్రానికి వచ్చిన సాధారణ పౌరులకు సైతం 14 రోజుల క్వారెంటెయిన్ ను తుచతప్పక అమలు చేస్తోంది. గత 24 గంటల్లో మూడుమాత్రమే కరోనా కేసులు నమోదైనా…అక్కడి ప్రభుత్వం బెంబేలెత్తిపోతోంది. సాధారణ పౌరులైనా,విదేశాలనుంచి వచ్చిన అతిథులైనా కరోనా నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పట్టుపడుతోంది. దీనికి భారత క్రికెటర్లు సైతం మినహాయింపు కాదని చెప్పకనే చెబుతోంది.
దిగివచ్చిన క్రికెట్ ఆస్ట్ర్రేలియా…
ఐపీఎల్ 13వ సీజన్ ముగిసిన వెంటనే దుబాయ్ నుంచి ఆస్ట్ర్రేలియా చేరుకొన్న భారత క్రికెట్ జట్టు సభ్యులు ,సహాయక సిబ్బంది 14 రోజుల క్వారెంటెయిన్ తోపాటు… వారం వారం కరోనా పరీక్షలు చేయించుకొంటూ వస్తున్నారు. మూడుమ్యాచ్ ల వన్డే, టీ-20 సిరీస్ లను ఎలాగో ఓకలాగా ముగించినా…నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభంనాటికి అసలు కష్టాలు మొదలయ్యాయి.
Also Read : అటు కరోనా… ఇటు క్రికెట్ హైరానా!
ఒకే హోటెల్ లో భారతజట్టు సభ్యులు విడిది చేసినా…వేర్వేరు ప్రాంతాలలో ఉండటం, వేర్వేరుగా ఉంటూ భోజనం చేయటం లాంటి పరిస్థితులు గందరగోళానికి గురి చేశాయి.
అదీ చాలదన్నట్లుగా…బ్రిస్బేన్ చేరిన వెంటనే భారతజట్టు సభ్యులకు హోటెల్ లో విడిది ఏర్పాటు చేసినా…రూమ్ సర్వీస్ ను నిలిపివేశారు. హౌస్ కీపింగ్ లేకపోడం, స్టార్ హోటెల్ లోని జిమ్, స్విమ్మింగ్ పూల్ ల లోకి అనుమతించక పోడం పట్ల టీమ్ మేనేజ్ మెంట్ తీవ్రఆందోళన వ్యక్తం చేసింది. దీంతో అక్కడి కోవిడ్ నిబంధనలను…భారత క్రికెటర్ల వరకూ సడలించాలని నిర్ణయించారు.
Also Read : ఆఖరిటెస్టుకు బుమ్రా, విహారీ దూరం
అయితే…జట్టు సభ్యులంతా బయోబబుల్ వాతావరణంలోనే ఉండితీరాలని ఆదేశించింది. క్రికెట్ ఆస్ట్ర్రేలియా జోక్యం చేసుకోడంతో…భారతజట్టు సభ్యులకు బుదవారం నుంచి రూమ్ సర్వీస్, హౌస్ కీపింగ్, జిమ్, స్విమ్మింగ్ పూల్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. భారతజట్టు సభ్యులు ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లటానికి, లిఫ్ట్ సదుపాయం వాడుకోడానికి అనుమతించినట్లు ఆస్ట్ర్రేలియా క్రికెట్ సంఘం ప్రకటించింది. స్విమ్మింగ్ పూల్ సదుపాయం మాత్రం ఉండబోదని తేల్చిచెప్పింది.
టెస్ట్ మ్యాచ్ ముగిసేవరకూ మరో వారంరోజులపాటు బ్రిస్బేన్ లోనే భారతజట్టు విడిది చేయాల్సి ఉంది. అయితే…ప్రతికూలవాతావరణంలో ఉంటూ…మ్యాచ్ ఆడాల్సిరావడం టీమ్ మేనేజ్ మెంట్ ను మాత్రమేకాదు… క్రికెటర్లను సైతం చికాకుకూ, తీవ్రఅసౌకర్యానికీ గురిచేస్తోంది.
Also Read : టెస్టు క్రికెట్లో రికార్డుల రిషభ్