దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఇతరులకు చేరకూడదన్న లక్ష్యంతో భారత సైన్యం కోసం ఇండియన్ ఆర్మీ వాట్సాప్ తరహా కొత్త యాప్ ను ఆర్మీకి అందుబాటులోకి తెచ్చింది. దీనికి సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ద ఇంటర్నెట్ అని పేరు పెట్టారు. ఇందులో వాయిస్, వీడియో, ఆడియో మెసేజ్ లకు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుందని భారత రక్షణ శాఖ తెలిపింది.
జవాన్ల వాట్సాప్‌కు పాక్ స్పామ్ మెసేజ్‌లు
సరిహద్దుల్లో భారత సైనికులతో ఉన్నతాధికారులు సంభాషించేందుకు ఉపయోగిస్తున్న వాట్సాప్ దుర్వినియోగమవుతోంది. సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల పై స్పందించేందుకు ఆర్మీ ఏర్పాటు చేసిన వాట్సాప్ అకౌంట్ దుర్వినియోగమవుతోంది. ఆర్మీకి చెందిన వాట్సాప్ నెంబరుకు పాకిస్తాన్ నుంచి స్పామ్ మెసేజ్ లు వస్తున్నట్లు సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటి వరకు 30 వేల మెసేజ్ లకు పైగా పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు వెల్లడించారు. వీటిలో ఎక్కువగా ఇండియాను ఇండియన్ ఆర్మీని దూషిస్తూ వచ్చినవే నని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ కు చెందిన నంబర్ల నుంచి ఆర్మీ వాట్సాప్ కు మెసేజ్ లు రాకుండా అడ్డుకునేలా చర్యలు చేపట్టినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
యాప్ పనితీరును పరిశీలించిన రాజ్ నాథ్
కేవలం ఆర్మీకి చెందిన వారు మాత్రమే ఉపయోగించేలా ఈ కొత్త యాప్ ను అభివృద్ధి చేసినట్లు అర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. దశల వారీగా అండ్రాయిడ్ వినియోగదారులకు ఈ యాప్ ను అందుబాటులోకి తెస్తామని రక్షణ శాఖ తెలిపింది. ఈ యాప్ ను రాజస్తాన్ ఆర్మీలో సిగ్నల్ యూనిట్ లో పనిచేస్తున్న కల్నల్ సాయి శంకర్ అభివృద్ధి చేశారు. ఈ యాప్ పనితీరును చూసిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
కీలక సమాచారం శత్రువులకు చిక్కకుండా చర్యలు
అధికారిక కార్యకలాపాల్లో సామాజిక మాధ్యమాల వినియోగం వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రక్షణ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక సమాచారం ఇతరులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధించిన యాప్స్ ను తమ ఫోన్లలో తొలగించాలని అధికారిక సమాచార మార్పిడికి వాట్సాప్, ఫేస్ బుక్, జూమ్ వంటి యాప్స్ ను వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్వదేశీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రక్షణ శాఖ స్పష్టం చేసింది.