- నాలుగోరోజుకే ఇంగ్లండ్ ఖేల్ ఖతం
- చెపాక్ అంచెలో భారత్ 1- ఇంగ్లండ్ 1
భారత్-ఇంగ్లండ్ జట్ల నాలుగుమ్యాచ్ ల ఐసీసీ టెస్ట్ లీగ్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. కోవిడ్ నిబంధనల నడుమ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా గత రెండు వారాల సమయంలో జరిగిన మొదటి రెండుటెస్టుల్లో రెండు జట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీగా నిలిచాయి. తొలి టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల తేడాతో భారత్ పై సంచలన విజయం సాధిస్తే ఏకపక్షంగా సాగిన రెండోటెస్టులో భారత్ 317 పరుగుల రికార్డు విజయంతో దెబ్బకు దెబ్బ తీసి టెస్ట్ లీగ్ ఫైనల్స్ బెర్త్ ను సజీవంగా నిలుపుకొంది.
భారత్ రికార్డు విజయం :
Also Read: చెపాక్ లో ఇంగ్లండ్ కు అశ్విన్ డబుల్ షాక్
దెబ్బతిన్నచోటే లేచి నిలబడి ప్రత్యర్థిని దెబ్బకు దెబ్బ తీయాలన్నమాటను విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు మరోసారి నిజం చేసింది. చెపాక్ వేదికగా గత నాలుగు రోజులుగా జరిగిన డూ ఆర్ డై రెండో టెస్టు మ్యాచ్ నాలుగో రోజుకే భారత్ 317 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా భారత్ కు పరుగుల పరంగా అతిపెద్ద విజయం ఇదే కావటం విశేషం. మూడోరోజు ఆట ముగిసే సమయానికి సాధించిన 3 వికెట్లకు 53 పరుగుల స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ భారత స్పిన్నర్ల ముప్పేట దాడికి దాసోహమనక తప్పలేదు.
Also Read: టెస్టు క్రికెట్లో అశ్విన్ మరో ప్రపంచరికార్డు
మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి రెండురోజులఆటలో 419 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్ 54.2 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జో రూట్ 33, ఆల్ రౌండర్ మోయిన్ అలీ 43 పరుగులు మినహా మిగిలిన ఆటగాళ్లు నిలదొక్కుకోలేక పోయారు. భారత బౌలర్లలో అరంగేట్రం స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు, అశ్విన్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. ఆల్ రౌండ్ షోతో భారత విజయంలో ప్రధాన పాత్ర వహించిన రవిచంద్రన్ అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని మూడో టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 24 నుంచి డే-నైట్ గా జరుగుతుంది.