న్యూజిలాండ్ పైన ఒన్డే సీరీస్ ను ఇండియా కైవసం చేసుకున్నది. ప్రపంచంలో అగ్రశ్రేణి జట్టుగా నిలిచింది. భారత జట్టు ఓపెనర్ గా ఆట ప్రారంభించి పదేళ్ళు జరిగిన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండోర్ లో మంగళవారం జరిగిన మ్యాచ్ లో శతకం కొట్టాడు. అద్భుతమైన సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసి రోహిత్ అభిమానులకు ఆనందం పంచాడు. మొత్తం ఆరు సిక్స్ లు కొట్టాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ తన బ్రహ్మాండమైన బ్యాటింగ్ తీరు కొనసాగిస్తూ మరో సెంచరీ సాధించాడు. ఇద్దరు ఓపెనర్లూ తలో సెంచరీ బాదడంతో ఆట భారత్ కు అనుకూలంగా మారింది. న్యూజిలాండ్ పైన ఒన్ డేలలో అత్యధిక ఓపెనింగ్ స్కోరును రోహిత్, గిల్ సాధించారు. రోహిత్ తన 30వ శతకాన్ని సాధించగా, గిల్ నాలుగో శతకం నమోదు చేసుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ డీవన్ కాన్వే కూడా సెంచరీ సాధించడంతో ఈ 50-ఓవర్ల మ్యాచ్ లో మొత్తం మూడు శతకాలు నమోదైనాయి.
రోహిత్, శుభ్ మన్, హార్దిక్ పాండ్యా(54పరుగులు) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు 385 పరుగుల దాకా ఎగబాకింది. అయినప్పటికీ శార్దూల్ బౌలింగ్ లో విజృంభించకపోతే ఇండియాను విజయం వరించేది కాదు. ఒక దశలో న్యూజిలాండ్ జట్టు దూకుడుగా ఆడుతున్నట్టు కనిపించింది. శార్దూల్ ను రెండో సారి బౌలింగ్ చేయమని 25వ ఓవర్ తర్వాత రోహిత్ శర్మ ఆదేశించినప్పుడు కాన్వే పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సారి మహమ్మద్ షమీనీ, మహమ్మద్ సిరాజ్ ను విశ్రాంతి తీసుకొమ్మన్నారు. వారి స్థానంలో వచ్చిన యజువేంద్ర చహాల్ బౌలింగ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ జోరుగా బ్యాటింగ్ చేశారు. ఉమ్రాన్ మాలిక్ స్పీడు బౌలింగ్ ను కూడా కివీలు తేలికగానే ఆడగలిగారు.
స్కోరు రెండు వికెట్లకు 184 పరుగులు ఉన్నప్పుడు పాతిక ఓవర్లు అయిపోయాయి. అంటే మరి పాతిక ఓవర్లు ఉన్నాయి. టార్గెట్ అయిన 386 పరుగులును న్యూజిలాండ్ సాధించగలుగుతుందనే చాలామంది భావించారు. అప్పుడు శార్దూల్ రంగంలో దిగి ఒక షార్ట్ బాల్ విసిరి న్యాజిలాండ్ బ్యాట్స్ మన్ డరైల్ మిచెల్ ను ఆశ్చర్య చకితుడిని చేసి వికెట్ కీపర్ ఇషాంత్ కిషన్ కు క్యాచ్ ఇచ్చేలా చేయగలిగాడు. అంతకు ముందు కాన్వే 58స్కోరుదగ్గర ఉన్నప్పుడు చహాల్ బౌలింగ్ లో స్టంపు చేసి ఔట్ చేసే అవకాశాన్ని కిషన్ జారవిడుచుకున్నాడు. శార్దూల్ బౌలింగ్ లో ఆ పొరబాటు కిషన్ చేయలేదు. ఆ తర్వాత కెప్టెన్ టామ్ లతమ్ చేత శార్దూల్ అడ్డగోలుగా ఆడించి మిడ్ ఆఫ్ లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇప్పించాడు. హ్యాట్రిక్ కాకుండా గ్లిన్ ఫిలిప్ అడ్డుకున్నాడు కానీ అంతలోనే అవుటైనాడు. చివరికి మాలిక్ కాన్వే వికెట్టు పడగొట్టి కథ సుఖాంతం చేశాడు.
శార్దూల్ విసిరిన పది బంతులలో ఆట స్వరూపస్వభావాలు మారిపోయి ఇండియా గెలుపొందగలిగింది. రోహిత్ పరుగెడుతూ ఒంటి చేత్తో క్యాచ్ పట్టుకున్న తీరు, చివరి వికెట్టును పడగొట్టడానికి విరాట్ కొహ్లీ క్యాచ్ అందుకున్న తీరు మనోరంజకంగా ఉన్నాయి. ఇండోర్ మ్యాచ్ గెలుపొందడంతో న్యూజిలాండ్ పైన మూడు మ్యాచ్ ల సిరీస్ ని ఇండియా 3-0 స్కోరుతో గెలుచుకొని తన ఘనత, ఆధిక్యం చాటుకున్నది.