* అక్షర్ స్పిన్ తో భారత్ 10 వికెట్ల విజయం
* మోడీ స్టేడియంలో రెండురోజుల్లోనే ఖేల్ ఖతం
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో అద్భుతమే జరిగింది. ఐదురోజులపాటు జరగాల్సిన డే-నైట్ టెస్టు మ్యాచ్ కేవలం రెండోరోజుల్లోనే ముగిసిపోయింది. నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జరిగిన ఈ కీలక పింక్ బాల్ సమరంలో ఆతిథ్య భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను చిత్తు చేయడం ద్వారా…ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్స్ బెర్త్ ను దాదాపుగా ఖాయం చేసుకొంది. ప్రస్తుత సిరీస్ లో వరుసగా రెండో ఓటమితో ఇంగ్లండ్ టెస్ట్ లీగ్ ఫైనల్స్ రేస్ నుంచి నిష్క్ర్రమించింది.
రెండురోజుల్లో 30 వికెట్ల పతనం
సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ అంటే రోజుకు 90 ఓవర్ల చొప్పున ఐదురోజులపాటు 450 ఓవర్లపాటు సాగాల్సిన సమరం. అయితే…నరేంద్ర మోడీ పేరుతో అహ్మదాబాద్ లో పునర్ నిర్మించిన మోతేరా స్టేడియంలో మాత్రం ఆట తొలిరోజు మొదటి గంట ఆట నుంచే బంతి బొంగరంలా తిరగడం ప్రారంభించింది.
కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న ఇంగ్లండ్ 48.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 6 వికెట్లు, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు.
Also Read : 400 వికెట్ల క్లబ్ లో అశ్విన్
భారత్ 145కే ఆలౌట్
ఇంగ్లండ్ ను 112 పరుగులకే కుప్పకూల్చిన వెంటనే తన తొలిఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ 3 వికెట్లకు 96 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట ప్రారంభించి…53.2 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటయ్యింది. 47 పరుగుల తేడాలో చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్, పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ 6.2 ఓవర్లలో 3 మేడెన్ ఓవర్లతో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రూట్ లాంటి అనామక బౌలరే 5 వికెట్లు పడగొట్టడం చూస్తే..మోడీ స్టేడియం పిచ్ ప్రమాణం ఏ స్థాయిలో ఉందీ క్రికెట్ కనీస పరిజ్ఞానం ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అక్షర్ వలయంలో ఇంగ్లండ్ సఫా
33 పరుగుల తొలిఇన్నింగ్స్ లోటుతో రెండోఇన్నింగ్స్ కు దిగిన ఇంగ్లండ్ 30.4 ఓవర్లలో 81 పరుగులకే చతికిలబడింది. ఆల్ రౌండల్ బెన్ స్టోక్స్ 25, కెప్టెన్ రూట్ 19, పోపీ 12 పరుగులు మినహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. భారత్ ప్రత్యర్థిగా జరిగిన టెస్టు మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ కు అదే అత్యల్పస్కోరు కావడం విశేషం.
Also Read : సిక్సర్ల బాదుడులో రోహిత్ ను మించిన గప్టిల్
భారత స్పిన్నర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లు, అశ్విన్ 4, సుందర్ 1 వికెట్ పడగొట్టారు. మ్యాచ్ నెగ్గాలంటే 48 పరుగులు చేయాల్సిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ మొదటి వికెట్ కు 7.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయం అందించారు.
రోహిత్ 25 పరుగులు, శుభ్ మన్ గిల్ 15 పరుగుల నాటౌట్ స్కోర్లతో నిలిచారు. ఈ విజయంతో భారత్ నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడుటెస్టులు ముగిసేనాటికి 2-1 ఆధిక్యంతో పైచేయి సాధించింది. అహ్మదాబాద్ వేదికగానే జరిగే ఆఖరిటెస్టును భారత్ డ్రాగా ముగించగలిగితే టెస్ట్ లీగ్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగలుగుతుంది. 11 వికెట్లతో భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సిరీస్ లోని ఆఖరి టెస్టు మ్యాచ్ మార్చి 4న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రారంభమవుతుంది.
Also Read : రూట్ స్పిన్ లో భారత్ గల్లంతు