- 1-0 ఆధిక్యంలో భారత్
- మొత్తం మూడు టెస్టులు
దక్షిణాఫ్రికాపైన భారత్ తొలి టెస్ట్ లో విజయం సాధించింది. కేఎల్ రాహుల్ బ్యాటింగ్, మహమ్మద్ షమీమ్ బౌలింగ్ కారణంగా దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాపై ఎన్నో ఏళ్ళుగా అసాధ్యంగా మిగిలిపోయిన విజయాన్ని భారత్ సాధించింది. సెంచూరియన్ లో జరిగిన తొలి మ్యాచ్ లో 113 పరుగుల తేడాతో భారత్ గెలుపొంది మూడు టెస్టుల సీరీస్ లో 1-0 స్కోరుతో ముందున్నది.
భారత్ అదృష్టం కొద్దీ అత్యంత అరుదుగా లభించే పేస్ బౌలర్ల బృందం ఈ సారి అందుబాటులో ఉండటంతో ఈ విజయం సాధ్యమైంది. ఈ రెయిన్ బౌ దేశంలో మునుపెన్నడూ లభించని సీరీస్ విజయం ఇప్పుడు చేజిక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా గెలుపొందాలంటే తమ రెండో ఇన్నింగ్స్ లో 305 పరుగులు చేయవలసి ఉంది. బ్యాట్స్ మన్ అంత రాణించకపోవడంతో అంత స్కోరు చేయడం అసాధ్యంగా పరిణమించింది. గురువారంనాటి ఆటలో 68 ఓవర్లకే ఆభ్యాగత జట్టు 191 పరుగులకే అన్ని వికెట్లూ కోల్పోయింది. వర్షం వచ్చే అవకాశాలు ఉన్న దశలో కూడా భారత్ ఫాస్ట్ బౌలర్లు ఏ మాత్రం జంకకుండా వేగంగా బౌలింగ్ చేసి వికెట్లు తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ మాత్రం 156 బంతులలో77 పరుగులు తీశాడు. దక్షిణాఫ్రికా రెండు ఇన్నింగ్స్ లోనూ రెండు వందల పరుగులు కూడా దాటకపోవడం విశేషం. బ్యాటర్ క్వింటన్ దీ కాక్ సెలవు తీసుకోవడంతో రెండో టెస్ట్ లో అతడు ఆడడు. అందువల్ల రెండ్ టెస్ట్ గెలుచుకోవడం భారత్ కు తేలిక అవుతుంది. భారత పేస్ బౌలర్లు నలుగురూ కలిసి 18 వికెట్లు తీసుకున్నారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దక్షిణాఫ్రికా జట్టు తోక కత్తిరించాడు. మొదటి ఇన్నింగ్స్ లో సెచరీ చేసిన రాహుల్, అయిదు వికెట్లు తీసుకున్న షమీ, మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టిన జస్పీత్ బుమ్రా కారణంగా మొదటి టిస్ట్ లో ఇండియా గెలవగలిగింది. మహమ్మద్ సిరాజ్ (హైదరాబాద్), శార్దూల్ ఠాకూర్ కూడా బాగా బౌలింగ్ చేసి భారత్ ను విజయపథంలో పరుగెత్తించారు.
ఈ మ్యాచ్ తో జస్పీత్ బుమ్రా కొత్త మైలు రాయి దాటాడు. దేశం వెలుపల వంద వికెట్లు సాధించిన ఘనత నమోదు చేసుకున్నాడు. బుధవారంనాడు రాసీ వాన్ డెర్ దెస్సేన్ వికెట్టు పడగొట్టడంతో జస్ప్రీత్ దేశానికి ఆవల వంద వికెట్లు పూర్తి చేసినట్టు అయింది. భగవత్ చంద్రశేఖర్ గతంలో నెలకొల్పిన రికార్డును జస్ప్రీత్ అధిగమించాడు. వంద వికెట్ల రికార్డును జస్ప్రీత్ 23 టెస్టులలో సాధిస్తే, చంద్రశేఖర్ 25 టెస్టులలో సాధించి రెండో స్థానంలో ఉండగా అశ్విన్ 26 టెస్టులలో ఆ ఫీటు చేసి మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో బిషన్ సింగ్ బేడీ, జవగళ్ శ్రీనాథ్, మహమ్మద్ షమీ సంయుక్తంగా నిలిచారు.
మొదటి ఇన్నింగ్స్ లో అయిదు వికెట్లు పడగొట్టిన షమీని భారత్ కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రశంసించాడు. మొదటి టెస్ట్ లో బాగా రాణించిన ఓపెనింగ్ బ్యాటర్లు మయాంక్ అగర్వాల్ నీ, రాహుల్ నీ అభినందించాడు. మనం ఆశించినట్టు ఆట సవ్యంగా ప్రారంభించి, విజయంతో ముగించగలిగాం అని విరాట్ కొహ్లీ వ్యాఖ్యానించాడు. మన బౌలింగ్ బృందంపైన సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నాడు.