- మూడు టీ20 మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ ఇండియా కైవసం
- అయిదు వికెట్ల తేడాతో విజయం, 1-0 ఆధిక్యం
- సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, అశ్విన్ ప్రతిభావంతమైన ప్రదర్శన
- చివరి నాలుగు ఓవర్లలో ముందుకు కదలలేకపోయిన భారత్ బ్యాటర్లు
న్యూజిలాండ్ పై టీ 20 ఇంటర్నేషనల్ తొలి మ్యాచ్ లో ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విధంగా రాహుల్ ద్రావిడ్ – రోహిత్ శర్మ జంట తమ ఇన్నింగ్స్ ను విజయవంతంగా ప్రారంభించింది. రవిశాస్త్రి – విరాట్ కొహ్లీ ఆధ్వర్యంలోని ఇండియాను గల్ఫ్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ రెండో మ్యాచ్ లో ఓడించిన న్యూజిలాండ్ పై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నది. జైపూర్ లో బుధవారం జరిగిన టీ 20 మ్యాచ్ లో తేలికగా గెలవవలసిన మ్యాచ్ చివరలో చమటలు పట్టించారు. ప్రేక్షకులలో, క్రికెట్ అభిమానులలో చివరి క్షణాలలో మానసిక ఒత్తిడి పెంచివేశారు.
మొదట బ్యాట్ చేసిన రాహుల్, శర్మలు తొలి అయిదు ఓవర్లలో 50 పరుగులు చేసి మంచి పునాది వేశారు. రాహుల్ 15 పరుగులకు వికెట్టు కోల్పోగా అతని స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడాడు. ఈ మ్యాచ్ కోసం విరామం ఇచ్చిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో వచ్చిన సూర్యకుమార్ నిలకడగా, ప్రతిభావంతంగా ఆడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 48 పరుగులు చేసి అవుట్ కాగా ఆయన స్థానంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ వచ్చాడు. 62 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ రివర్స్ షాట్ ప్రయత్నించి బంతిని వికెట్టు మీదికి పంపుకొని అవుటైనాడు. అప్పుడు శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. అతను అయిదు పరుగులకే పెవిలియన్ కు తరలిపోయాడు. అతడి స్థానంలో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ ఒక బౌండరీ కొట్టి పేలవంగా అవుటైపోయాడు. ఇదే వెంకటేశ్ కి తొలి టెస్ట్ మ్యాచ్. వికెట్ కీపర్ రిషభ్ పంత్ నవ్వుతూనే ఉన్నాడు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విజయానికి అవసరమైన పరుగులను ఇంకా రెండు బంతులు మిగిలి ఉన్నాయనగా చేశాడు.
అంతకు ముందు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో మార్టిన్ గప్ టిల్, మార్క్ చాపమన్ లు వరుసగా 70, 63 పరుగులు సాధించి మంచి పునాది వేశారు. న్యూజిలాండ్ ఓపెనర్లూ, భారత ఓపెనర్లూ బాగా ఆడి మంచి ప్రాతిపదికను ఏర్పాటు చేశారు. కానీ మధ్యస్థాయి బ్యాటర్లు అనవసరంగా డిఫెన్స్ ఆడి స్కోరు ముందుకు జరపలేక పోయారు. ప్రత్యర్థుల బౌలింగ్ కూడా ప్రతిభావంతంగా ఉంది. చివరికి పంత్ సకాలంలో కోలుకొని ఒక బౌండరీతో విజయం నమోదు చేసుకొని ద్రావిడ్ – రోహిత్ ల పరువు దక్కించాడు. మ్యాచ్ ని చివరి ఓవర్ వరకూ తీసుకొని పోవడమే న్యూజిలాండ్ కు గర్వకారణమంటూ ఆ జట్టు కెప్టెన్ సౌతీ వ్యాఖ్యానించాడు. మార్క్ చాప్ మన్ బ్యాటింగ్ ను టిమ్ సౌతీ ప్రశంసించాడు. గప్ టిల్, చాప్ మన్ మంచి ఊపులో ఉన్న దశలో రవిచంద్రన్ అశ్విన్ రోహిత్ శర్మని రంగంలో దింపాడు. అశ్విన్ రెండు కీలకమైన వికెట్లు సాధించి విజయానికి ఇండియాను చేరువ చేశాడు. మరో స్పిన్నర్ భువనేశ్వర్ కుమార్ కూడా 24 పరుగులు ఇచ్చి నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి విజయానికి 165 పరుగులను లక్ష్యంగా పెట్టింది. ఇండియా అయిదు వికెట్ల నష్టానికి ఆ లక్ష్యం సాధించింది. ఈ విజయంతో ఇండియా న్యూజిలాండ్ పై మూడు మ్యాచ్ ల సీరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది.