- అభిమానుల సమక్షంలో భారత్- ఇంగ్లండ్ సిరీస్
- చెన్నై,అహ్మదాబాద్, పూణే స్టేడియాలలో అభిమానులకు అనుమతి
కరోనా వైరస్ దెబ్బతో గత ఏడాదికాలంగా ఇంటిపట్టునే ఉండి క్రికెట్ మ్యాచ్ లను ప్రత్యక్షప్రసారాల ద్వారా వీక్షిస్తున్న భారత క్రికెట్ అభిమానులు మళ్లీ స్టేడియాలకు వెళ్లి మ్యాచ్ లు చూసే అవకాశం కనుచూపు మేరలో కనిపిస్తోంది. క్రికెట్ ఆస్ట్ర్రేలియా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని…భారత్ వేదికగా వచ్చేనెలలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు అభిమానులను అనుమతించాలని బీసీసీఐ యోచిస్తోంది.
వచ్చేనెలలో జరిగే భారత్- ఇంగ్లండ్ జట్ల సిరీస్ లకు ఆతిథ్యమిస్తున్న స్టేడియాల సామర్థ్యంలో 50 శాతం వరకూ అభిమానులను అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలను తుచతప్పక పాటిస్త్తూనే క్రికెట్ సిరీస్ ను నిర్వహించాలని బీసీసీఐ గట్టిగా భావిస్తోంది.
మూడు వేదికల్లోనే సిరీస్ లు
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే సిరీస్ లను కేవలం మూడువేదికలకే పరిమితం చేశారు. చెన్నై,అహ్మదాబాద్, పూణే స్టేడియాలు వేదికలుగా బయోబబుల్ వాతావరణంలో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
Also Read : భారత్ కు ఇంగ్లండ్ పేస్ సవాల్
వన్డే, టీ-20, టెస్ట్ సిరీస్ లకు కనీసం 50 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాలలోకి అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ సిరీస్ జరిగే అన్ని స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో కొన్ని క్రికెట్ సంఘాలు స్టేడియం సామర్థ్యంలో 20 నుంచి 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది.
చివరిసారి గతేడాది జనవరిలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌మ్యాచ్ లను ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఆ తర్వాత భారత్ వేదికగా అస్సలు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించలేదు. ఐపీఎల్ 13వ సీజన్ పోటీలను సైతం గల్ఫ్ దేశాలు వేదికగా నిర్వహించిన సంగతి తెలిసింది.
Also Read : ఇంగ్లండ్ తో సిరీస్ కు కొహ్లీ, పాండ్యా, ఇశాంత్
గల్ఫ్ మ్యాచ్ లు కూడా ఖాళీ స్టేడియాలలోనే
దుబాయ్, అబుదాబీ, షార్జా స్టేడియాలలోకి సైతం అభిమానులను అనుమతించలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న దేశవాళీ క్రికెట్ టోర్నీలను సైతం ఖాళీ స్టేడియాలలోనే నిర్వహిస్తున్నారు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలు సైతం ప్రేక్షకులు లేకుండానే సాగుతున్నాయి. భారత్ పర్యటనకు రానున్న ఇంగ్లండ్ జట్టు మొత్తం మూడువన్డేలు, 5 టీ-20 మ్యాచ్ లతోపాటు నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో సైతం తలపడనుంది.
జనవరి 5 నుంచి చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా మొదటి రెండుమ్యాచ్ లు, ఆఖరి రెండుటెస్టులూ అహ్మదాబాద్ వేదికగాను నిర్వహిస్తారు. ఆస్ట్ర్రేలియా వేదికగా ఇటీవలే ముగిసిన వన్డే, టీ-20, టెస్టు సిరీస్ మ్యాచ్ లకు 25 శాతం మంది అభిమానులను మాత్రమే అనుమతించారు. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని భారత్- ఇంగ్లండ్ జట్ల సిరీస్ లను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.