* రెండో వన్డేలో ఇంగ్లండ్ సూపర్ చేజింగ్
* రాహుల్ శతకం వృథా
వన్డే క్రికెట్లో ప్రపంచ చాంపియన్, టాప్ ర్యాంక్ జట్టు ఇంగ్లండ్ మరోసారి సత్తాచాటుకొంది. భారత్ తో పూణే వేదికగా ముగిసిన రెండోవన్డేలో తనదైన స్టయిల్లో సూపర్ చేజింగ్ విజయంతో 1-1తో సమఉజ్జీగా నిలవడం ద్వారా సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకొంది.
తొలివన్డే చేజింగ్ లో 66 పరుగుల ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ రెండో వన్డే చేజింగ్ లో 337 పరుగుల భారీలక్ష్యాన్ని అలవోకగా సాధించింది. ఓపెనర్లు బెయిర్ స్టో- జేసన్ రాయ్, వన్ డౌన్ ఆటగాడు బెన్ స్టోక్స్…తమ వీరబాదుడుతో పవర్ హిట్టింగ్ కే సరికొత్త అర్థం చెప్పారు.
రాహుల్- రిషభ్ పంత్ ల షో
ఈ తీన్మార్ సిరీస్ కే కీలకంగా మారిన రెండోవన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 25, శిఖర్ ధావన్ 4 పరుగులకే విఫలం కాగా…వన్ డౌన్ విరాట్ కొహ్లీ, రెండోడౌన్ రాహుల్, మూడోడౌన్ రిషబ్ పంత్, నాలుగోడౌన్ హార్ధిక్ పాండ్యా చెలరేగిపోయారు.
కెప్టెన్ కొహ్లీ 79 బాల్స్ లో 3 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 66 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. సెంచరీ సాధించడంలో మరోసారి విఫలమైన విరాట్…తన కెరియర్ లో 62వ అర్థశతకం నమోదు చేశాడు. మరోవైపు…యువఆటగాడు రాహుల్ 114 బాల్స్ లో 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 108 పరుగుల స్కోరుతో…తన కెరియర్ లో పదవ శతకం పూర్తిచేయగలిగాడు.
Also Read : సిరీస్ విజయానికి భారత్ గురి
రిషభ్ పంత్ కేవలం 40 బాల్స్ లో 3 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 77, హార్థిక్ పాండ్యా 16 బాల్స్ లో 1 బౌండ్రీ, 4 సిక్సర్లతో 35 పరుగుల స్కోర్లు సాధించడంతో భారత్ ప్రత్యర్థి ఎదుట 337 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో టోప్లే, టామ్ కరెన్ చెరో 2వికెట్లు, రషీద్ ,సామ్ కరెన్ చెరో వికెట్ పడగొట్టారు.
రాయ్- బెయిర్ స్టో బాదుడే బాదుడు
337 పరుగుల భారీటార్గె్ట్ తో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు ఓపెనింగ్ జోడీ జేసన్ రాయ్- జానీ బెయిర్ స్టో మొదటి వికెట్ కు 110 పరుగుల భాగస్వామ్యంతో కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు.
జేసన్ రాయ్ కేవలం 52 బాల్స్ లో 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 55 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో ఇంగ్లండ్ తొలివికెట్ నష్టపోయింది. రాయ్ స్థానంలో క్రీజులోకి వచ్చిన సూపర్ హిట్టర్ బెన్ స్టోక్స్ ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. భారత స్పిన్నర్లు కృణాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ల బౌలింగ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు. పూల్, లాఫ్టెడ్ షాట్లతో పూనకం వచ్చినట్లు గ్రౌండ్ నలుమూలలకూ షాట్లు కొట్టాడు.
Also Read : 6 వేల పరుగుల రికార్డుకు చేరువగా ధావన్
స్టోక్స్ సిక్సర్ల సునామీ
మరో ఓపెనర్ బెయిర్ స్టోతో కలసి స్టోక్స్ సెంచరీభాగస్వామ్యం సాధించడం ద్వారా తనజట్టు భారీవిజయానికి మార్గం సుగమం చేశాడు. కేవలం 52 బాల్స్ లోనే 10 సిక్సర్లు, 4 బౌండ్రీలతో 99 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో భారత్ ఊపిరితీసుకోగలిగింది.
స్టోక్స్ ఒక్క పరుగులో మూడంకెల స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. పేసర్ భువనేశ్వర్ బౌలింగ్ లో కీపర్ పంత్ పట్టిన క్యాచ్ కు వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన స్టాండిన్ కెప్టెన్ జోస్ బట్లర్ ను భారతయువఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ ఓ సూపర్ యార్కర్ తో డకౌట్ గా పడగొట్టాడు.
బెయిర్ స్టో 112 బాల్స్ లో 11 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 124 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. మిడిలార్డర్ ఆటగాళ్లు డేవిడ్ మలాన్ 16, లైమ్ లివింగ్ స్టోన్ 27 పరుగుల నాటౌట్ స్కోర్లతో నిలవడంతో…ఇంగ్లండ్ 43.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికే 337 పరుగుల టార్గెట్ ను అందుకోగలిగింది.
Also Read : భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ కు గాయాలదెబ్బ
చేజింగ్ లో ఇంగ్లండ్ సాధించిన ఐదవ అతిపెద్ద లక్ష్యంగా ఈ 337 పరుగులు…రికార్డుల్లో చేరాయి. ఇంగ్లండ్ విజయంలో ప్రధానపాత్ర వహించిన జానీ బెయిర్ స్టోకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే.. పూణేలోని మహారాష్ట్ర్ర స్టేడియం వేదికగానే… సూపర్ సండే ఫైట్ గా జరుగనుంది.