- భారత ఎదుట కొండంత లక్ష్యం
- ఆఖరిరోజున 381 పరుగుల సవాల్
- రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 178, భారత్ 39/1
భారత్- ఇంగ్లండ్ జట్ల నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టు నాలుగోరోజు ఆట ముగిసే సమయానికే రసపట్టుగా మారింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మొదటి మూడురోజుల ఆటకు భిన్నంగా నాలుగోరోజుఆట నాటకీయంగా సాగింది.
ఓవర్ నైట్ స్కోరుతో నాలుగోరోజుఆట కొనసాగించిన భారత్ 337 పరుగుల స్కోరు సాధించడం ద్వారా ఫాలోఆన్ ప్రమాదం నుంచి విజయవంతంగా బయటపడింది.
సుందర్-అశ్విన్ పోరాటం
మూడోరోజుఆట ముగిసే సమయానికే ఆరు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన భారత్ ను…తమిళనాడు ఆల్ రౌండర్ల జోడీ వాషింగ్టన్ సుందర్- రవిచంద్రన్ అశ్విన్ 7వ వికెట్ కు కీలకభాగస్వామ్యంతో ఆదుకొన్నారు. భారత్ ను ఫాలోఆన్ ఊబిలోకి దింపాలన్న ఇంగ్లండ్ ఆశల్ని అడియాసలు చేశారు. అశ్విన్ 91 బాల్స్ లో 3 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 31 పరుగులకు అవుట్ కాగా….సుందర్ 85 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.
Also Read : టెస్టు క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు
సుందర్ 138 బాల్స్ ఎదుర్కొని 12 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన కెరియర్ లో కేవలం రెండుటెస్టుల్లో మూడో ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన సుందర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం విశేషం.
భారత లోయర్ ఆర్డర్లో నదీమ్, బుమ్రా డకౌట్లు కాగా…ఇశాంత్ 4 పరుగులకు అవుటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెస్ 4 వికెట్లు, ఆర్చర్, యాండర్సన్, లీచ్ తలోరెండు వికెట్లు పడగొట్టారు.
Also Read : చెన్నై టెస్టులో భారత్ ఎదురీత
అశ్విన్ స్పిన్ మ్యాజిక్
భారత్ ను 337 పరుగులకు ఆలౌట్ చేయడం ద్వారా 241 పరుగుల భారీ తొలిఇన్నింగ్స్ ఆధిక్యత సంపాదించిన ఇంగ్లండ్… రెండో ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ రోరీ బర్న్స్ వికెట్ నష్టపోయింది. ఈ వికెట్ ను అశ్విన్ పడగొట్టడం ద్వారా ఓ అరుదైన రికార్డును తన పేరుతో లిఖించుకొన్నాడు. తొలిఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ హీరో రూట్..రెండో ఇన్నింగ్స్ లో 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
తొలిఇన్నింగ్స్ లో 578 పరుగుల భారీస్కోరు సాధించిన ఇంగ్లండ్…రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకే కుప్పకూలింది. 46.3 ఓవర్లలోనే ప్రత్యర్థిని భారత బౌలర్లు ఆలౌట్ చేయగలిగారు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 6 వికెట్లు, నదీమ్ 2వికెట్లు, ఇశాంత్,బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.
Also Read : రూట్ డబుల్.. భారత్ కు ట్రబుల్
భారత్ ముందు 420 పరుగుల టార్గెట్
ఇంగ్లండ్ ను రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకే ఆలౌట్ చేసిన భారత ఆనందం ఎంతో సేపు నిలువలేదు. 420 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్…ఆరవ ఓవర్ లోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ నష్టపోయింది.12 పరుగులు సాధించిన రోహిత్ ను లెఫ్టామ్ స్పిన్నర్ జాక్ లీచ్…ఓ జాదూ బంతితో పెవీలియన్ దారి పట్టించాడు.
యువఓపెనర్ శుభ్ మన్ గిల్ 35 బాల్స్ లో 3 బౌండ్రీలతో 15 పరుగులు, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా 23 బాల్స్ లో ఒకే ఒక్క బౌండ్రీతో 12 పరుగుల నాటౌట్ స్కోర్లతో క్రీజులో ఉన్నారు. వికెట్ నష్టానికి 39 పరుగులు చేసిన భారత్ ఆఖరి రోజు ఆటలో మరో 381 పరుగులు చేయగలిగితే..టెస్టుక్రికెట్ చరిత్ర లో మరో అద్భుత విజయం సాధించినట్లవుతుంది. అయితే…అదేమంత తేలికకాదు. ఇంగ్లండ్ విజయమో…లేక మ్యాచ్ ను భారత్ డ్రాగా ముగించడమో…లేదా భారత్ పరాజయమో…తొలిటెస్టు తుదిఫలితంగా వచ్చే అవకాశం ఉంది.
Also Read : అంకిత రైనా సరికొత్త చరిత్ర