- భయపెడుతున్న ఫాలోఆన్ గండం
- ఇంగ్లండ్ 578, భారత్ 257/6
చెన్నై టెస్టు మూడోరోజు ఆటలోనే కథ అడ్డం తిరిగింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కు 578 పరుగుల భారీస్కోరు సమర్పించుకొన్న భారత్ ఆదివారం ఆట ముగిసే సమయానికే ఎదురీత మొదలు పెట్టింది. 257 పరుగులకే ఆరు టాపార్డర్ వికెట్లు నష్టపోయి…ఫాలోఆన్ ముప్పు నుంచి తప్పించుకోడానికి పోరాటం మొదలు పెట్టింది.
ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ల జోడీ వాషింగ్టన్ సుందర్- రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్ బౌలర్లను నిలువరించడం ద్వారా మూడోరోజుఆటను ముగించగలిగారు.
578 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
అంతకుముందు …ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ను భారత బౌలర్లు 578 పరుగుల స్కోరుకు ఆలౌట్ చేయగలిగారు. టెయిల్ ఎండర్ జిమ్మీయాండర్సన్ ను స్పిన్నర్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు తెరపడింది.
Also Read : రూట్ డబుల్.. భారత్ కు ట్రబుల్
ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్లో డోమనిక్ బెస్ 34 పరుగులకు అవుట్ కాగా లీచ్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు, నదీమ్, ఇశాంత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
రోహిత్, విరాట్, రహానే ఫ్లాప్
ఇంగ్లండ్ భారీ తొలిఇన్నింగ్స్ స్కోరుకు సమాధానంగా తన తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ను ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అగ్గిపిడుగుల్లాంటి బంతులతో దెబ్బ మీద దెబ్బ కొట్టాడు.
సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 6 పరుగులకే అవుట్ కాగా, యువఓపెనర్ శుభ్ మన్ గిల్ 29 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు. దీంతో 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ను ఆదుకోవాల్సిన కెప్టెన్ కొహ్లీ సైతం 48 బంతులు ఎదుర్కొని 11 పరుగుల స్కోరుకు దొరికిపోయాడు.
Also Read : చెన్నైటెస్టు తొలిరోజున ఇంగ్లండ్ షో
కొహ్లీ స్థానంలో వచ్చిన వైస్ కెప్టెన్ రహానే ఒకే ఒక్క పరుగుకు అవుటయ్యాడు. పరిస్థితి ఆందోళన కరంగా మారడంతో నయావాల్ పూజారా తనదైన శైలిలో జిడ్డాట ఆడుతూ.. రిషభ్ పంత్ తో కలసి.. పోరాటం కొనసాగించాడు. ఓ వైపు పూజారా ఆచితూచి ఆడుతుంటే…మరోవైపు పంత్ సిక్సర్లు, బౌండ్రీలతో ఎదురుదాడి మొదలు పెట్టాడు.
పూజారా, పంత్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా నిలదొక్కుకోడంతో భారత్ తేరుకొన్నట్లే కనిపించింది. అయితే…పూజారా 143 బాల్స్ లో 11 బౌండ్రీలతో 73 పరుగులకు, పంత్ కేవలం 88 బాల్స్ లోనే 5 సిక్సర్లు, 9 బౌండ్రీలతో 91 పరుగుల స్కోర్లకు ఒకరి వెనుక ఒకరుగా అవుట్ కావడంతో కథ మళ్లీ మొదటి కొచ్చింది.
తమిళనాడు జోడీ సుందర్- అశ్విన్ 7వ వికెట్ కు 32 పరుగుల అజేయభాగస్వామ్యంతో ఇంగ్లండ్ బౌలర్లను నిలువరించడంతో భారత్ 6 వికెట్లకు 257 పరుగులతో మూడోరోజు ఆట ను ముగించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ బెస్ 4 వికెట్లు, పేసర్ ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టారు.
Also Read : శత టెస్టులో శతకవీరులు
పొంచి ఉన్న ఫాలోఆన్ ముప్పు
భారతజట్టు ఫాలోఆన్ గండం నుంచి బయటపడాలంటే నాలుగోరోజు ఆటలో మరో 122 పరుగులు చేయాల్సి ఉంది. సుందర్- అశ్విన్ ల పోరాటం పైనే భారతజట్టు ఫాలోఆన్ ఉచ్చు నుంచి బయటపడేది లేనిదీ తేలిపోనుంది. మరోవైపు…కొత్తబంతితో ఇంగ్లండ్ బౌలర్ల దాడిని భారత లోయర్ ఆర్డర్ ఎంత వరకూ తట్టుకోగలదన్నది అనుమానమే. ఆఖరి రెండురోజుల ఆటలో స్కోరు తో పాటు సమయాన్ని భారత్ ఎంతవరకూ వృధా చేయగలదన్నఅంశంపైనే మ్యాచ్ ను డ్రాగా ముగించడం ఆధారపడి ఉంది.