- సిడ్నీటెస్ట్ నాలుగోరోజున భారత్ 2 వికెట్లకు 98
- ఏదైనా అద్భుతం జరిగితేనే భారత్ కు విజయావకాశం
సిడ్నీటెస్ట్ నాలుగోరోజుఆటలో భారత్ ఎదురీదుతోంది. 407 పరుగుల భారీలక్ష్యం ఛేదనలో పోరాడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ స్ట్రోక్ పుల్ హాఫ్ సెంచరీ సాధించి నిలదొక్కుకొంటున్న సమయంలో వికెట్ చేజార్చుకోడంతో భారత్ ఎదురీత మొదలు పెట్టింది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 98 పరుగుల స్కోరు సాధించింది. ఆఖరి రోజు ఆటలో భారత్ మ్యాచ్ నెగ్గాలంటే మరో 309 పరుగుల స్కోరు చేయాల్సి ఉంది. వన్ డౌన్ పూజారా 9, కెప్టెన్ రహానే 4 పరుగుల స్కోర్లతో క్రీజులో ఉన్నారు.
స్మిత్, లబుషేన్ హాఫ్ సెంచరీలు
అంతకుముందు మూడోరోజు ఆట ముగిసే సమయానికి సాధించిన స్కోరుతో నాలుగరోజున రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కంగారూటీమ్ 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు జోడించింది. చివరకు 6 వికెట్లకు 316 పరుగుల స్కోరుతో డిక్లేర్ చేసింది.
Also Read : ఆస్ట్రేలియా అభిమానుల జాత్యహంకార జాడ్యం
వన్ డౌన్ లబుషేన్ 73, సెంచరీహీరో స్టీవ్ స్మిత్ 81, కామెరూన్ గ్రీన్ 84 పరుగుల స్కోర్లు సాధించారు. కెప్టెన్ టిమ్ పైన్ 39 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.
భారత బౌలర్లలో నవదీప్ సైనీ, అశ్విన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రా, సిరాజ్ ఒక్కో వికెట్ తో సరిపెట్టుకొన్నారు. తొలిఇన్నింగ్స్ ఆధిక్యతతో కలసి ఆస్ట్ర్రేలియా మొత్తం 407 పరుగుల భారీలక్ష్యంతో భారత్ కు సవాలు విసిరింది.
Also Read : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ నుంచి జడేజా అవుట్
ఓపెనర్ల శుభారంభం
నాలుగో ఇన్నింగ్స్ల్ లో భారీలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు శుభ్ మన్ గిల్- రోహిత్ శర్మ మొదటి వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. యువ ఓపెనర్ గిల్ 31 పరుగుల స్కోరుకు హేజిల్ వుడ్ బౌలింగ్ లో కీపర్ పెయిన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ బౌండ్రీలతో స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. తన టెస్ట్ కెరియర్ లో 10వ హాఫ్ సెంచరీని పూర్తి చేసిన వెంటనే రోహిత్ సైతం వెనుదిరిగాడు.
Also Read : సిడ్నీటెస్ట్ మూడోరోజున అశ్విన్ ప్రపంచ రికార్డు
పాట్ కమిన్స్ బౌలింగ్ లో స్టార్క్ పట్టిన క్యాచ్ కు రోహిత్ శర్మ 52 పరుగుల స్కోరుతో అవుటయ్యాడు. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి పూజారా 9, రహానే 4 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. కంగారూ బౌలర్లలో హేజిల్ వుడ్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్ కు అంతగా అనువుకాని ఆఖరిరోజు పిచ్ పైన భారత్ మ్యాచ్ నెగ్గాలంటే మరో 309 పరుగులు చేయాల్సి ఉంది. పూజారా- రహానేల భాగస్వామ్యం పైనే భారత్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే మినహా ఆస్ట్ర్రేలియా జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read : సిడ్నీటెస్టుపై కంగారూ పట్టు