- బౌలింగ్ కు ఆర్చర్, స్టోక్స్ పవర్
- ఫిబ్రవరి 5 నుంచి టెస్ట్ సిరీస్
భారత గడ్డపై టెస్ట్ సిరీస్ అతిపెద్ద సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి భారత్ వేదికగా జరిగే నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అత్యంత బలమైన జట్టును ప్రకటించింది.
స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టులో జోస్ బట్లర్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బెన్ ఫోక్స్, మోయిన్ అలీ, డోమ్ బెస్, జిమ్మీ యాండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జాక్ క్రాలే, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డామ్ సిల్బే, టాన్ లారెన్స్, వోలీ స్టోన్, క్రిస్ వోక్స్ లాంటి ఆటగాళ్లున్నారు.
రిజర్వ్ ఆటగాళ్లలో జేమ్స్ బ్రాసీ, మాసన్ క్రేన్, సకీబ్ మహ్మద్, మాథ్యూ పార్కిన్ సన్, ఓలీ రాబిన్సన్, అమర్ విర్దీ ఉన్నారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ జట్టు సభ్యులు కొలంబో నుంచి నేరుగా చెన్నై చేరుకోనున్నారు.
Also Read : ఇంగ్లండ్ తో సిరీస్ కు కొహ్లీ, పాండ్యా, ఇశాంత్
చెన్నై వేదికగా మొదటి రెండు టెస్టులు
ఇంగ్లండ్ జట్టు తన భారత పర్యటనలో భాగంగా మూడుమ్యాచ్ ల వన్డే, ఐదుమ్యాచ్ ల టీ-20, నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తలపడనుంది. ఫిబ్రవరి 5న ప్రారంభంకానున్న తొలి టెస్టుతో పాటు రెండోటెస్టుకు సైతం చెపాక్ స్టేడియమే వేదికగా నిలువనుంది. సిరీస్ లోని మూడు, నాలుగు టెస్టుమ్యాచ్ లకు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తుంది.
కోవిడ్ నిబంధనలు, ఆటగాళ్ల భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని…బయోబబుల్ వాతావరణం కోసమే ఒక్కో వేదికపై రెండేసి టెస్టుమ్యాచ్ ల చొప్పున నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మ్యాచ్ జరిగే సమయాలలో స్టేడియం సామర్థ్యంలో 25 నుంచి 50 శాతం వరకూ అభిమానులను మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకొ్న్నారు. ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నంబర్ వన్ జట్టుగా ఉంటే…ఇంగ్లండ్ మాత్రం నాలుగో ర్యాంక్ జట్టుగా ఉంది.
Also Read : టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ గా భారత్
భారత్ కు కెవిన్ వార్నింగ్
ఆస్ట్రేలియాపై సంచలన విజయంతో గాల్లో తేలిపోతున్న భారత జట్టుకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ హెచ్చరిక జారీ చేశాడు. ఇంగ్లండ్ ను తక్కువగా అంచనా వేస్తే భారత్ కు కష్టాలు తప్పవని, పవర్ ఫుల్ ఇంగ్లండ్ ను అధిగమించాలంటే భారత్ అత్యుత్తమంగా రాణించితీరక తప్పదని ఓ సందేశం ద్వారా తెలిపాడు.