- ఆఖరాటకు బ్రిస్బేన్ లో అంతా రెడీ
- నువ్వా-నేనా అంటున్న భారత్, ఆస్ట్రేలియా
- హాట్ ఫేవరెట్ గా కంగారూటీమ్
భారత్- ఆస్ట్ర్రేలియా జట్ల నాలుగుమ్యాచ్ ల ఐసీసీటెస్ట్ చాంపియన్షిప్ లీగ్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. కంగారూ విజయాల అడ్డా బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో గురువారం ప్రారంభమయ్యే ఆఖరి పోరాటానికి టెస్ట్ క్రికెట్ రెండు,మూడు ర్యాంక్ జట్లు సై అంటే సై అంటున్నాయి. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టుకే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండటంతో విజయమే లక్ష్యంగా రెండుజట్లూ బరిలోకి దిగుతున్నాయి.
డూ ఆర్ డై ఫైట్
నాలుగు మ్యాచ్ ల ఈ టెస్ట్ సిరీస్ ను ఘోర పరాజయంతో ప్రారంభించిన భారత జట్టు తీవ్రప్రతికూల పరిస్థితులను అసాధారణ రీతిలో అధిగమించి ఆతిథ్య కంగారూ జట్టుతో సమఉజ్జీగా నిలిచింది.
Also Read : ఏడేళ్ల తర్వాత శ్రీశాంత్ కు తొలివికెట్
అడిలైడ్ వేదికగా జరిగిన డే-నైట్ పింక్ బాల్ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలి…8 వికెట్ల ఘోరపరాజయం చవిచూసిన భారతజట్టు ఓటమితో పాటు కెప్టెన్ విరాట్ కొహ్లీని సైతం దూరం చేసుకొంది.
వ్యక్తిగత కారణాలతో కొహ్లీ స్వదేశానికి తిరిగి వస్తే స్టాండ్ ఇన్ కెప్టెన్ గా అజింక్యా రహానే బాధ్యతలు స్వీకరించడమే కాదు స్ఫూర్తిదాయకమైన నాయకత్వం, పోరాటపటిమతో సాధించిన సెంచరీతో మెల్బోర్న్ టెస్టులో తనజట్టుకు 8 వికెట్ల విజయం అందించి వారేవ్వా అనిపించుకొన్నాడు. అంతేకాదు. 1-1తో ఆస్ట్ర్రేలియాతో తనజట్టును సమఉజ్జీగా నిలిపాడు. ఆ తర్వాత సిడ్నీ వేదికగా ముగిసిన మూడోటెస్టులో భారత్ పోరాడి ఆడి మ్యాచ్ ను గౌరవప్రదమైన డ్రాగా ముగించగలిగింది.
కీలక ఆటగాళ్ల గాయాలు
అడిలైడ్ టెస్ట్ ఆడుతూ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయపడితే మెల్బోర్న్ టెస్ట్ పూర్తికాక మునుపే మరో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ గాయంతో జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. యువఆటగాడు రాహుల్ సైతం నెట్ ప్రాక్టీస్ చేస్తూ గాయంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. సిడ్నీ టెస్టు ఆడుతూ జడేజా,హనుమ విహారీ, బుమ్రా గాయాలపాలై జట్టుకు దూరమయ్యారు. దీంతో భారత జట్టు మరోసారి కత్తిమీదసాముకు సిద్ధమయ్యింది.
Also Read : ఆఖరిటెస్టుకు బుమ్రా, విహారీ దూరం
మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్ లాంటి అంతగా అనుభవంలేని బౌలర్లతోనే కీలక ఆఖరి టెస్టు పోరుకు దిగాల్సివస్తోంది. సీనియర్ ఫాస్ట్ బౌలర్లు ఇశాంత్ శర్మ,భువనేశ్వర్ కుమార్,షమీ, ఉమేశ్ యాదవ్, బుమ్రా లేకుండానే భారతజట్టు ఓ అత్యంత ప్రధానమైన టెస్టులో పాల్గొనటం…మరాఠా యోధుడు అజింక్యా రహానే నాయకత్వానికే అసలుసిసలు పరీక్షకానుంది.
రోహిత్ , పూజారా, పంత్ లపైనే భారం
డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా,కెప్టెన్ రహానే, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్, ఆల్ రౌండర్ అశ్విన్ పూర్తిగా ఫామ్ లోకి రావడం..భారత్ కు సానుకూలమైన అంశంగా కనిపిస్తోంది. ప్రపంచ మేటి ఆటగాడు విరాట్ కొహ్లీ, అపారఅనుభవం కలిగిన నలుగురు ఫాస్ట్ బౌలర్లు లేకుండానే రహానేసేన యుద్ధానికి సిద్ధమయ్యింది. దీనికితోడు…ఫాస్ట్ బౌలర్ల స్వర్గం బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో భారత్ కు అంతంత మాత్రమే రికార్డు ఉంది. విపరీతమైన బౌన్స్ తో కూడిన గబ్బా పిచ్ పైన కంగారూ పేస్ బ్యాటరీని ఎదుర్కొనడంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ కు తలకుమించిన భారమే అనడంలో సందేహం లేదు.
ఆసీస్ విజయాల అడ్డా బ్రిస్బేన్ గబ్బా
ప్రపంచ క్రికెట్లోనే అత్యంత వేగవంతమైన వికెట్లలో ఒకటిగా పేరుపొందిన బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో 1988 నుంచి ఆతిథ్య ఆస్ట్ర్రేలియాకు ఓటమి లేదంటే ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది. విపరీతమైన బౌన్స్ తో కూడిన గబ్బా వికెట్ పైన భారత టాపార్డర్ ఇచ్చే ఆరంభంపైనే మ్యాచ్, సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది. జనవరి 15 నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ మ్యాచ్ లో రెండోర్యాంక్ ఆస్ట్ర్రేలియానే హాట్ ఫేవరెట్ గా పోటీకిదిగుతోంది. పూర్తిజట్టుతో కంగారూలు పోటీకి సిద్ధమయితే…బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్ళు, అనుభవంలేమి కలిగిన ఫాస్ట్ బౌలింగ్ తో భారతజట్టు మహాసాహసమే చేస్తోంది. బ్రిస్బేన్ టెస్టులో భారతజట్టు నెగ్గడం సంగతి అటుంచి మ్యాచ్ ను డ్రాగా ముగించగలిగితే…అది ఘనవిజయంతో సమానమే.
Also Read : టెస్టు క్రికెట్లో రికార్డుల రిషభ్