- మూడో రోజు ఆటలో సుందర్,శార్దూల్ పోరాటం
- 7వ వికెట్ కు రికార్డు భాగస్వామ్యం
- భారత్ 336 ఆలౌట్, ఆస్ట్రేలియా 54 పరుగుల ఆధిక్యం
బ్రిస్బేన్ గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ‘డూ ఆర్ డై’ ఆఖరిటెస్టు మూడో రోజు ఆటలో భారత మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు స్పూర్తిదాయకమైన ఆటతీరు ప్రదర్శించారు.
టాపార్డర్ వికెట్లు టపటపారాలినా ఆల్ రౌండర్లు శార్దూల్ ఠాకూర్- వాషింగ్టన్ సుదర్ 7వ వికెట్ కు రికార్డు భాగస్వామ్యం నమోదు చేయడంతో కంగారూలకు భారత్ దీటైన సమాధానం చెప్పింది.
ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆస్ట్ర్రేలియా వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేయడం ద్వారా 54 పరుగుల ఓవరాల్ ఆధిక్యం సంపాదించింది.
టాపార్డర్ టపటపా
ప్రధాన ఆటగాళ్ల గాయాలతో ఆఖరిటెస్ట్ తుదిజట్టులో అనూహ్యంగా చోటు సంపాదించిన ఆల్ రౌండర్ల జోడీ శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ సత్తా చాటుకొన్నారు. భారత్ పై తొలిఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యత సాధించాలన్న కంగారూల ఆశలకు గండి కొట్టారు.
Also Read : బ్రిస్బేన్ టెస్ట్ రెండో రోజు ఆటకు వాన దెబ్బ
అంతకుముందు …ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన భారత్…కీలకసమయాలలో వికెట్లు నష్టపోయి చిక్కుల్లో పడింది. వన్ డౌన్ చతేశ్వర్ పూజారా 25, కెప్టెన్ అజింక్యా రహానే 37 , మయాంక్ అగర్వాల్ 38, రిషభ్ పంత్ 23 పరుగులకే అవుట్ కావడంతో…భారత్ 186 పరుగుల స్కోరుకే ఆరు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన తరుణంలో ఆల్ రౌండర్లు శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి అడుగుపెట్టారు.
రికార్డు భాగస్వామ్యం
తమ కెరియర్ తొలిటెస్టుమ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన బౌలింగ్ ఆల్ రౌండర్లు శార్దూల్,సుందర్ ఎంతో అనుభవం ఉన్నవారిలా ఆత్మవిశ్వాసంతో కంగారూ పేస్ బ్యాటరీని ఎదుర్కొన్నారు. హేజిల్ వుడ్,కమిన్స్, స్టార్క్ ల నిప్పులు చెరిగే ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ ను సంయమనంతో అడ్డుకొన్నారు. చెత్తబంతులను అలవోకగా బౌండ్రీకి తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు.
శార్దూల్ ఠాకూర్ టెస్ట్ క్రికెట్లో తన తొలి పరుగును సిక్సర్ షాట్ తో మొదలు పెట్టాడు. ఫాస్ట్ బౌలర్ కమిన్స్ బౌలింగ్ లో కళ్లు చెదిరే సిక్సర్ షాట్ కొట్టి తన అంతర్యాన్నిచాటి చెప్పాడు. మరోవైపు తమిళనాడు యువఆటగాడు వాషింగ్టన్ సుందర్ సైతం ఆత్మవిశ్వాసానికి చూడముచ్చటైన షాట్లు జోడించి ఆకట్టుకొన్నాడు. ఈ ఇద్దరూ వ్యక్తిగతంగా తమ తొలి అర్థశతకాలు పూర్తిచేయడంతో పాటు…గబ్బా వేదికగా 7వ వికెట్ కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు.
శార్దూల్ ఠాకూర్ 67, వాషింగ్టన్ సందర్ 62 పరుగులు సాధించారు. శార్దూల్ మొత్తం 115 బాల్స్ ఎదుర్కొని సిక్సర్ తో తన ఖాతా తెరవడంతో పాటు సిక్సర్ తోనే హాఫ్ సెంచరీ పూర్తిచేయటం విశేషం. వాషింగ్టన్ సుందర్ 144 బాల్స్ ఎదుర్కొని 62 పరుగుల స్కోరుతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే 7వ డౌన్ లో బ్యాటింగ్ కు దిగి అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా సుందర్ రికార్డుల్లో చేరాడు.
భారత స్కోరు 300 దాటిన తరువాత శార్దూల్, సుందర్ ఒకరి తర్వాత ఒకరుగా అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ 336 పరుగుల స్కోరుతో ముగిసింది. కంగారూ బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ 57 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తన టెస్ట్ కెరియర్ లో ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం హేజిల్ వుడ్ కు ఇది 9వసారి.
కంగారూలకు 33 పరుగుల ఆధిక్యం
33 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్ర్రేలియాకు ఓపెనర్లు వార్నర్- మార్కుస్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగుల భాగస్వామ్యం అందించడంతో మూడోరోజుఆట ముగిసింది. వార్నర్ 20, మార్కుస్ 3 పరుగుల స్కోర్లతో అజేయంగా నిలిచారు.
Also Read : బ్రిస్బేన్ టెస్ట్ తొలిరోజున హోరాహోరీ
నాలుగోరోజుఆటలో కంగారూటీమ్ ఎంతవేగంగా పరుగులు సాధించి…ప్రత్యర్థి ఎదుట ఎంతలక్ష్యాన్ని ఉంచగలదన్న అంశంపైనే టెస్ట్ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.