- ఇండియా-అమెరికా సంబంధాల బలోపేతం
- అమెరికాలో విశిష్ఠ అతిధిగా మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన ప్రపంచ దేశాలకు ఆసక్తికరంగా మారింది. అమెరికా – చైనా విదేశాంగ విధానాలలో వైఖరి కాస్త మారుతున్న వేళ నరేంద్రమోదీ మాట్లాడే ప్రతిమాటను పలు దేశాలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఐరాసలో జరిగే అంతర్జాతీయ యోగా ఉత్సవానికి మన ప్రధాని నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ అందించే ఆతిధ్యాన్ని స్వీకరించనున్నారు. ఈ సందర్భంలో ఇరు దేశాలకు సంబంధించిన అంశాలే గాక, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, చైనా, పాకిస్తాన్ కదలికలు, విదేశాంగ విధానాలు చర్చకు రానున్నాయి. మంగళవారం నాడు ప్రధాని మోదీ అమెరికా బయల్దేరారు. భారత్ -అమెరికా మధ్య బలమైన భాగస్వామ్యాన్ని సుస్థిర పరచడమే ప్రధాన లక్ష్యం. ప్రపంచ దేశాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ద్వైపాక్షిక సహకారం పెంచుకోవడం కీలకం. జీ20, క్వాడ్, ఇండో -పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ వంటి సదస్సుల్లో ఇరు దేశాల వాణిని ఐక్యతా సూత్రంతో వినిపించాల్సివుంది. మరో ముఖ్య అంశం అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదన చేసినవారు భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నది తెలిసిందే. వాణిజ్యం, సాంకేతికత, సృజనాత్మకత వంటి రంగాల్లో సైతం భాగస్వామ్యం బలోపేతం కావాలి.
Also read: గీతాప్రెస్ కు గాంధీ పురస్కారం
రక్షణ ఒప్పందాలే ప్రధానం
రక్షణ రంగంలో పరస్పర సహకారం దిశగా అడుగులు పడాలి. మోదీ -బైడెన్ మధ్య జరగబోయే చర్చల్లో రక్షణ పరిశ్రమల రంగంలో ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధికి సంబంధించి బృహత్ మార్గాలు వేయాలి. అమెరికా కాంగ్రెస్ లో రెండు సార్లు మాట్లాడిన ఘనత దక్కించుకొనే తొలి భారత ప్రధానిగా నరేంద్రమోదీ చరిత్రకెక్కనున్నారు. గత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తోనూ మోదీకి మంచి స్నేహం ఉంది. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే గాక, భారతదేశానికి ఆహ్వానించి పెద్దసభ నిర్వహించారు. జోబైడెన్ తోనూ ఆ స్థాయి సంబంధాలే ఏర్పడగలవని విశ్వసిద్దాం. ప్రవాస భారతీయులు భారీ ర్యాలీలతో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు.మెరుగైన పారిశ్రామిక వ్యవస్థలను నిర్మించడంతో పాటు టెలికం, అంతరిక్ష రంగాలపైన కూడ దృష్టి సారించనున్నారు. 23వ తేదీన కొన్ని కంపెనీల సీఈఓలతోనూ ప్రధాని సమావేశం కానున్నారు. రష్యా – ఉక్రెయిన్ విషయంలోనూ, చైనాతో ప్రయాణం అంశంలోనూ స్పష్టమైన వైఖరితోనే భారత్ ఉందని ప్రధాని తాజాగా మరోమారు స్పష్టం చేశారు. ప్రధానంగా శాంతి కాముకులమని చెబుతూనే, సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలపై పరస్పర గౌరవ ప్రదర్శనలలో రాజీపడేదేలేదని మోదీ బలంగా చెబుతున్నారు. దౌత్య పరమైన మార్గాలు, చర్చల ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలకు భారత ప్రధాని మరోమారు సందేశం ఇవ్వనున్నారు.సరిహద్దుల్లో ప్రశాంతమైన వాతావరణం నిలబడేలా భారత్ – చైనా బంధాలు, విధానాలు ఉండాలని మోదీమొదటి నుంచి చెబుతున్నారు.
Also read: ఎన్నికల బాగోతంలో ‘ఉత్తర’రామాయణం
ఉభయతారకం
విద్య,మౌలిక సదుపాయాల్లో ఇప్పటికే మనం విస్తృతంగా పెట్టుబడులు పెడుతున్నాం. ప్రపంచంలో భారత్ అతిపెద్ద మార్కెట్ కేంద్రం. ఈ ప్రయాణంలో అగ్రరాజ్య సహకారం కూడా అవసరం. మిగిలిన దేశాలు ఎట్లా ఉన్నప్పటికీ, భారత ప్రధాని నరేంద్రమోదీ – అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలయికపై చైనా తన అసూయా దృక్కులను ప్రసరిస్తూనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య బంధం బలీయమైతే, తను బలహీన పడిపోతానన్నది చైనా భయం. అమెరికా పర్యటన ముగిసాక అక్కడి నుంచే నేరుగా మన ప్రధాని ఈజిప్టుకు వెళ్ళనున్నారు. ఈ పర్యటనతో అగ్రరాజ్యంతో, అధ్యక్షుడు బైడెన్ తో భారత్ బంధాలు మరింత పెరగాలని ఆకాంక్షిద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం అద్భుతంగా జరగాలని అభినందనలు అందిద్దాం.
Also read: ‘పలుభాషల పలుకుతోడు – పాటల సైజోడు’ ఎస్పీ బాలసుబ్రమణ్యం….