ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో భారత్, అమెరికాలు పోషిస్తున్న పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రశంసించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం (మార్చి 19) భారత్ చేరుకున్న ఆస్టిన్ తొలుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ తో సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలకమైన సవాళ్లపై రెండు దేశాలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయని ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. నిన్న సాయంత్రం ఆస్టిన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఇరువురి భేటీ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాల్సిన అవశ్యకత ఉందని తెలిపారు.
Also Read: ఆత్మరక్షణ కోసమే ‘క్వాడ్’
ఇరు దేశాల రక్షణ మంత్రుల కీలక భేటీ:
ఈరోజు (మార్చి 20) ఢిల్లీలో భారత్, అమెరికా రక్షణ మంత్రుల అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, లాయిడ్ జేమ్స్ ఆస్టిన్ ఉన్నతాధికారులతో కలిసి భేటీ అయ్యారు. ఆస్టిన్తో అద్భుతమైన, ఫలప్రద చర్చలు జరిగాయని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఇరువురి నేతల మధ్య ఎల్ఈఎంఓఏ, కామ్కాసా, బెకా ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు రాజ్ నాథ్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లను భారత్, అమెరికా లు సంయుక్తంగా ఎదుర్కోవాలని ఓ అంగీకారానికి వచ్చారు. రక్షణ సంబంధాల బలోపేతానికి మరింత ఇరు దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించారు. సైనిక విస్తరణ, సమాచార మార్పిడి, రవాణాలో పరస్పర సహకారం అందించాలని నిర్ణయించినట్లు రాజ్ నాథ్ తెలిపారు. రాజ్ నాథ్, ఆస్టిన్ ల సమావేశానికి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు.
రాజ్ నాథ్ తొ భేటీకి ముందు దిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు ఆస్టిన్ నివాళులు అర్పించారు. అనంతరం విజ్ఞాన్ భవన్ లొ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.
Also Read: అంతరిక్షంలో నాలుగు స్థంభాలాట