- కనువిందు చేస్తున్న బొమ్మలు
- ఎగ్జిబిషన్ లో పాల్గొన్న వందలాది మంది తయారీదారులు
దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఇండియా టాయ్ పెయిర్ 2021 ను మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఆత్మనిర్భర భారత్ దిశగా టాయ్ పరిశ్రమ అడుగులు వేయాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాయ్ పరిశ్రమలో భారత్ ముద్ర స్పష్టంగా కనిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బొమ్మల పరిశ్రమ సమగ్రాభివృద్ధి దిశగా వర్తకులు, వినియోగదారులు, ఉపాధ్యాయులు, డిజైనర్లను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ డిజిటల్ టాయ్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రధాని మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
వర్చువల్ విధానంలో జరిగే ఈ ప్రదర్శనలో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1000 మందికి పైగా తయారీదారులు తమ ఉత్పత్తులను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నారు. ఇందులో సాంప్రదాయ భారతీయ బొమ్మలతో పాటు ఎలక్ట్రానిక్ బొమ్మలు, ఖరీదైన బొమ్మలు, పజిల్స్, ఆటలతో సహా ఆధునిక బొమ్మలు ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా బొమ్మల తయారీ రంగంపై ప్రముఖ భారతీయ, అంతర్జాతీయ వక్తలతో వెబ్‌నార్లు, ప్యానెల్ చర్చలు కూడా నిర్వహించనున్నారు.
Also Read: అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం
ప్రపంచ బొమ్మల పరిశ్రమలో మనదేశానికి తక్కువ వాటా ఉందని భారత వ్యాపారులు ఈ రంగం అభివృద్ధికి కృషిచేయాలన్నారు. దేశంలో గొప్ప నైపుణ్యం గల ప్రతిభావంతులైన చేతివృత్తులవారు ఉన్నారని వారంతా బొమ్మల తయారీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్లాస్టిక్ బొమ్మల్లో 30 శాతం ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని ఇవి పిల్లలకు సురక్షితం కాదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇండియా టాయ్ ఫెయిర్ ఈరోజు నుంచి (ఫిబ్రవరి 27) మార్చి 2వ తేదీ వరకు జరగనుంది.