Sunday, December 22, 2024

వన్ చైనా పాలసీకి భారత్ స్వస్తి?

  • తైవాన్ తో వాణిజ్యానికి సై అంటున్న భారత్
  • గతంలో చైనా ఒత్తిళ్లకు తలొగ్గిన భారత్
  • వాణిజ్య ఒప్పందంతో భారీగా రానున్న పెట్టుబడులు
  • భారత్ దూకుడు…చైనా హెచ్చరిక

చైనాకు  2020 సంవత్సరం కలిసిరాలేదనే చెప్పొచ్చు. కరోనా వైరస్ కు చైనా మూలకారణమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో చైనా ఉంది. దీంతో తీవ్ర అప్రతిష్టను చైనా మూటగట్టుకుంది. అదే సమయంలో తైవాన్ కు ఈ సంవత్సరం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రపంచంలోని పలు దేశాలు తైవాన్ తో దౌత్య, వాణిజ్య సంబంధాలు నెరిపేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో చైనాకు కక్కలేని మింగలేని పరిస్థితి నెలకొంది.  సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న దుందుడుకు వైఖరిని అడ్డుకునేందుకు భారత్ మెల్ల మెల్లగా ఉచ్చు బిగిస్తోంది. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ … లద్దాఖ్ లో ఘర్షణ వైఖరి కొనసాగిస్తోన్న  చైనాకు ముకుతాడు వేసేందుకు భారత్ పావులు కదుపుతోంది

చైనా ఒత్తిళ్లకు లోగడ తలొగ్గిన భారత్

తైవాన్ తో వాణిజ్య ఒప్పందానికి భారత్ సానుకూల సంకేతాలు ఇవ్వడంతో చైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ‘వన్ చైనా’ పాలసీని గౌరవించాలని, చైనా సార్వభౌమత్వానికి భంగం కలిగించేవిధంగా వ్యవహరించొద్దని సుద్దులు చెబుతోంది. ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక ఒప్పందంపై 2018 లో సంతకాలు చేసిన తర్వాత భారత్ తో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కోసం  గత కొద్ది సంవత్సరాలుగా తైవాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే చైనా ఒత్తిళ్లకు తలొగ్గి భారత్ ముందడుగు వేయలేకపోయింది. తైవాన్ తో వాణిజ్య ఒప్పందం కుదిరితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారీగా పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ తైవాన్ లకు చెందిన ఉన్నతాధికారులు చర్చలకు తుదిరూపు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

వాణిజ్య ఒప్పందాలు లాంఛనమే

అక్టోబర్ తొలివారంలో తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్, విస్ట్రన్ కార్పొరేషన్, పెగట్రాన్ కార్పొరేషన్ లకు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం  సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తైవాన్ నుంచి స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలోకి 150 బిలియన్ ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు తైవాన్ తో వాణిజ్యానికి భారత్ సానుకూలంగా స్పందించడం తైవాన్ కు దౌత్యపరంగా, వాణిజ్యపరంగా గొప్ప విజయమని రాజకీయ విశ్లేషకులు  అభివర్ణిస్తున్నారు.

వాణిజ్య ఒప్పందం ఎవరికి లాభం ?

వాణిజ్య ఒప్పందంతో భారత్, తైవాన్ లకు లాభం కలగనుంది. చైనాపై భారీగా ఆధారపడుతున్న భారత్ కు కొంత ఉపశమనం కలుగుతుంది. అదే సమయంలో భారత్ లో కి విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉంది.  టెలికాం, ఎలక్ట్రానిక్ రంగాల్లో చైనా పెత్తనానికి తైవాన్ చెక్ పెట్టే అవకాశాలున్నాయి. తైవాన్ కు మాత్రం భారత్ లాంటి పెద్ద మార్కెట్ దొరకడం వాణిజ్య పరంగా గొప్ప విజయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అయితే, వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిందంటే భారత్ కు చైనాతో సంబంధాలు బెడిసికొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

‘వన్ చైనా’ పాలసీకి తూట్లు

తైవాన్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మీడియా శుభాకాంక్షలు తెలియజేయడాన్ని ఇటీవల భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం తీవ్రంగా తప్పుబట్టింది.  చైనాతో దౌత్య సంబంధాలు కలిగిన ఏ దేశమైనా తైవాన్ తో సత్సంబంధాలు నెరపడాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ స్పష్టం చేశారు. తైవాన్ తో ప్రత్యేక సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా  చైనా సౌర్వభౌమత్వాన్ని సవాల్ చేసినట్లేనని జావో ప్రకటించారు. జావో లిజియన్ నిరసన తర్వాత చైనా రాయబార కార్యాలయ భవనంలోనూ, ఇతర చోట్లా తైవాన్ కు శుభాకాంక్షలు తెలిపే పోస్టర్లను తొలగించారు. కానీ భారత్ మాత్రం చైనాతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతోంది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles