సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు పాల్పడటమే కాకుండా దక్షిణాసియాలో తన సైనిక ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైనాకు ముకుతాడు వేసేందుకు భారత్ చర్యలు వేగవంతం చేసింది. తన మిత్రదేశం మయన్మార్ కు ఇప్పటివరకు జలాంతర్గామి లేకపోవడంతో ఆ కొరతను భారత్ తీర్చనుంది, కొన్నేళ్లుగా ఇరుదేశాల నౌకాదళాల మధ్య సహకారం క్రమ క్రమంగా పెరుగుతోంది.
ఉపఖండంలో అన్ని దేశాల భద్రత, వృద్ధి కోసం సాగర్ దార్శినికతలో భాగంగా మిత్రదేశాలకు భారత్ రక్షణ సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగా కిలోక్లాస్ కు చెందిన ఐఎన్ఎస్ సింధువీర్ జలాంతర్గామిని మయన్మార్ కు లీజుకు ఇవ్వనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. రష్యాలో తయారైన సింధువీర్ డీజీల్, విద్యుత్ రెండింటితో పనిచేస్తుంది. శత్రువుపై మెరుపుదాడి చేసేందుకు తరుపుముక్కలా ఉపయోగపడుతుందని నేవీ అధికారులు తెలిపారు. సింధువీర్ 1980 లో ఇండియన్ నేవీలో చేరింది. హిందుస్థాన్ షిపియార్డ్ లో ఆధునీకరించి మయన్మార్ కు ఇవ్వనున్నారు.