- స్వార్మ్ టెక్నాలజీని పరీక్షించిన భారత్
- తేజస్ కొనుగోలుకు కేబినెట్ ఆమోదం
- చైనా కవ్వింపులకు చెక్ పెట్టనున్న భారత్
సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు పాల్పడుతున్న పాకిస్తాన్, చైనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలను చేపడుతోంది. ముఖ్యంగా డోక్లాం ప్రతిష్ఠంభన నుంచి చైనా అవలంబిస్తున్న ద్వంద్వ విధానం నేపథ్యంలో భారత ప్రభుత్వం తన ఆయుధగారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలను సమకూరుస్తోంది. ఇందుకు ఆత్మనిర్భరభారత్ లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాలు తయారు చేస్తున్న సంస్థలకు ప్రాముఖ్యతనిస్తున్నారు.
వైమానికదళం చేతికి తేజస్:
దేశీయంగా అభివృద్ధి పరిచిన 83 తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను 48 వేల కోట్ల ఖర్చుతో వైమానిక దళానికి అందించనుంది. రక్షణ రంగ ఉత్పత్తులను భారీగా దిగుమతులు చేసుకుంటున్న భారత్ ఇక స్వదేశీ సంస్థలను ప్రోత్సహించనున్నట్లు తెలుస్తోంది. తేజస్ లను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న తేజస్ లు భారత వైమానిక దళానికి వెన్నుదన్నుగా నిలవనున్నాయి. తేజస్ విమానాల కోసం మూడు సంవత్సరాల క్రితమే టెండర్లను జారీ చేసినా తుదిరూపు ఇవ్వడానికి చాలా సమయం పట్టింది.
తేజస్ తయారీలో దేశీయ కంపెనీల హవా:
తొలివిడతలో హెచ్ఏఎల్ అందించనునర్న 40 తేజస్ జెట్ లలో కొన్ని ఇప్పటికే వాయుసేనలో సేవలందిస్తున్నాయి. భారత వైమానిక దళం, హెచ్ఏఎల్ ల మధ్య మార్చిలో ఒప్పందం జరిగే అవకాశాలున్నాయి. 2024 నుంచి విమానాల అందజేత మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. విమానంలో వాడి యంత్ర సామాగ్రి, విడి పరికరాలు దేశీయంగా తయారైనవి 50 శాతంగా ఉన్నా 2024 నాటికి ఇది 60 శాతానికి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 500 భారతీయ కంపెనీలు తేజస్ తయారీలో హెచ్ఏఎల్ తో భాగస్వాములవుతున్నాయి. తేజస్ లో ఆధునిక రాడార్లను అమర్చడం ద్వారా ఒకేసారి 16 లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. తేలికపాటి యుద్ద విమానాల కేటగిరీలో ప్రపంచ వ్యాప్తంగా తేజస్ కు ప్రముఖ స్థానముంది. తేజస్ ల నిర్వహణకు వీలుగా విమాన స్థావరాల్లో నిర్వహన మరమ్మతులకు వీలు కల్పించి తక్కువ సమయంలో వాయుసేనకు సేవలందించేందుకు సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం అంగీకరించిందని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
డ్రోన్ల వినియోగంలో ముందున్న చైనా:
మరోవైపు డ్రోన్ల వినియోగంలో అందరికంటే చైనా దూసుకెళుతోంది. యుద్ధం అంటూ జరిగితే సాంకేతిక పరిజ్ఞానం కీలక భూమిక పోషించనుంది. సైన్యాలను మోహరించడం, సంప్రదాయ యుద్ధానికి దిగడం ఇవన్నీ పాత పద్దతులు.సంప్రదాయ యుద్ధాలలో ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చైనా సంప్రదాయ యుద్ధాలకు స్వస్తి పలికేందుకు ఎప్పటినుంచో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే దాదాపు 2 లక్షల సైన్యాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన భారత్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విషయంలో చైనాతో పోలిస్తే చాలా వెనకబడిందనే చెప్పవచ్చు. సరిహద్దుల్లో చైనా ఉద్రిక్తతలకు పాల్పడటంతో భారత్ ఇటీవలి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. గుట్టు చప్పుడు కాకుండా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. డ్రోన్ల తయారీలో ముందడుగు వేసింది. శత్రువుల ను ఏమార్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరితగతిన అభివృద్ధి చేస్తోంది.
ఆర్మీడే (జనవరి 15) సందర్భంగా దాడి చేసే సామర్థ్యంతో కూడిన 75 డ్రోన్ల గుంపును ప్రదర్శించింది. పదుల సంఖ్యలో ఉండే డ్రోన్ల సమూహం ట్యాంకులు, శత్రుస్థావరాలు, ఉగ్రవాద స్థావరాలు, హెలీప్యాడ్ లు శత్రువుల ఇంధన నిల్వలపై ఒక్కసారిగా విరుచుకుపడి విధ్వంసం సృష్టించగలవు. ఈ టెక్నాలజీ భారత ఆయుధ రంగంలో కీలక భూమిక పోషించనుంది.
సైన్యానికి సాయంగా డ్రోన్ల గుంపు:
డ్రోన్లతో క్లిష్ట సమయాలలో సైన్యానికి సాయం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలకు సరుకులు, మందులు, వంటివి అందించేందుకు ఉపయోగించనున్నారు. 75 డ్రోన్ల సమూహం 600 కిలోల బరువును సరఫరా చేయగలవని అధికారులు తెలిపారు.
తక్కువ వ్యవధిలో డ్రోన్ల వ్యవస్థపై పట్టు :
భారత్ స్వార్మ్ టెక్నాలజీపై చాలా వేగంగానే పట్టు సాధించిందని చెప్పొచ్చు. చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో గత సంవత్సరం నుంచి స్వార్మ్ టెక్నాలజీపై పట్టు సాధించేందుకు న్యూ స్పేస్ రీసెర్చి అండ్ టెక్నాలజీస్ తో కలిసి పరిశోధనలు మొదలు పెట్టింది. 1000 రోటరీ వింగ్ డ్రోన్లను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి 75 డ్రోన్లను ప్రయోగించే స్థాయికి చేరింది.