- మోడీ స్టేడియంలో మెరిసిన యువజోడీ
- రిషభ్- సుందర్ సెంచరీ భాగస్వామ్యం
- 89 పరుగుల ఆధిక్యంలో భారత్
ఐసీసీ టెస్టు లీగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ చేరడమే లక్ష్యంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ ఆడుతున్న భారత్ నిర్ణయాత్మక ఆఖరిటెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికే పైచేయి సాధించింది.
తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 205 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ తన తొలిఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 294 పరుగుల స్కోరు సాధించింది. యువఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 60, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 11 పరుగుల స్కోర్లతో క్రీజులో ఉన్నారు.
Also Read : రిషభ్ పంత్ ఫటాఫట్ సెంచరీ
టాప్ ఆర్డర్ మరో ఫ్లాప్
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టానికి 24 పరుగులతో రెండోరోజు ఆట కొనసాగించిన భారత్ కు దెబ్బ మీద దెబ్బ తగిలింది, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా 17, కెప్టెన్ విరాట్ కొహ్లీ డకౌట్ గాను అవుటయ్యారు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
మరోవైపు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఎక్కడలేని ఓర్పుతో బ్యాటింగ్ కొనసాగించి 144 బాల్స్ ఎదుర్కొని 7 బౌండ్రీలతో 49 పరుగుల స్కోరుకు బెన్ స్టోక్స్ బౌలింగ్ లో అవుట్ కావడంతో భారత్ చిక్కుల్లో పడింది. అశ్విన్ 13 పరుగులకే వెనుదిరగడంతో జట్టును ఆదుకొనే భారం యువజోడీ రిషభ్ పంత్- వాషింగ్టన్ సుందర్ లపైన పడింది.
Also Read : విరాట్ ను వెంటాడుతున్న వైఫల్యాలు
7వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం
భారతజట్టు 146 పరుగులకే 6 టాపార్డర్ వికెట్లు నష్టపోయిన కీలకసమయంలో యువజోడీ రిషభ్ పంత్- సుందర్ బాధ్యతాయుతంగా ఆడి 7వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 7వ వికెట్ కు ఇదే తొలిసెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం. తన కెరియర్ లో 20వ టెస్టు, 33వ ఇన్నింగ్స్ ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ 118 బాల్స్ లో 2సిక్సర్లు, 13 బౌండ్రీలతో 101 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.
23 సంవత్సరాల రిషబ్ కు టెస్టుక్రికెట్లో ఇది మూడో శతకం మాత్రమే. ఇక తమిళనాడు యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 117 బాల్స్ లో 8 బౌండ్రీలతో 60 పరుగుల స్కోరు సాధించి నాటౌట్ గా నిలిచాడు. 21 సంవత్సరాల వయసుకే నాలుగోటెస్టు ఆడుతున్న సుందర్ కు ఇది మూడో అర్థశతకంగా రికార్డుల్లో చేరింది. అక్షర్ పటేల్ 34 బాల్స్ ఎదుర్కొని 2 బౌండ్రీలతో 11 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో యాండర్సన్ 3, స్టోక్స్, లీచ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మూడోరోజుఆటలో భారత్ చివరి మూడు వికెట్లకు మరో 50 పరుగులు జోడించ గలిగితే ఇంగ్లండ్ కు కష్టాలు తప్పవు.
Also Read : సిరాజ్ తో బెన్ స్టోక్స్ లడాయి