- మూడింట మూడు మ్యాచ్ లూ గెలుచుకున్న భారత జట్టు
- రాహుల్ ద్రావిడ్-రోహిత్ శర్మ జంటకు శుభారంభం
- 3-0 తేడాతో విజయం సాధించి సీరీస్ గెలుచుకున్న రోహిత్ జట్టు
టీం ఇండియా న్యూజిలాండ్ పై మూడు టీ20 మ్యాచ్ ల పరంపరను 3-0 మ్యాచ్ ల తేడాతో సంపూర్ణంగా గెలుచుకున్నది. మూడు మ్యాచ్ లకు గాను మూడింటినీ గెలవడం ద్వారా క్లీన్ స్వీప్ చేసినట్టు అయింది. ఇటీవలే జరిగిన టీ20 ప్రపంచ కప్ పోటీలలో జరిగిన రెండవ మ్యాచ్ లో భారత్ ను ఓడించిన న్యూజిలాంగ్ జట్టు ప్రపంచ కప్ పైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పొందింది. గల్ఫ్ నుంచి ఇండియా వచ్చి మూడు టీ20 సీరీస్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడం విశేషం. ప్రప్రథమంగా రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గా, రోహిత్ శర్మ నాయకుడుగా రంగంలో దిగిన భారత టీ20 జట్టు అప్రతిహతంగా చెలరేగి విజయం సాధించింది.
ఆదివారంనాడు జరిగిన మూడో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న భారత జట్టు అద్భుతంగా ఆట మొదలు పెట్టింది. రోహిత్ శర్మతో మొదటి రెండు మ్యాచ్ లలో ఓపెనర్ గా ఆడిన రాహుల్ మూడో మ్యాచ్ ఆడలేదు. అతని స్థానంలో వచ్చిన యువక్రీడాకారుడు ఇషాన్ కిషన్ బ్రహ్మాండంగా ప్రారంభించారు. ఓపెనర్లు ఇద్దరూ కలిసి 69 పరుగులు చేశారు. రోహిత్ మూడు సిక్సర్లతో అదరగొట్టాడు. టీ20లో అత్యధిక అర్ధశతకాలు సాధించినవారిలో విరాట్ కోహ్లీ (29) రికార్డును అధిగమించి రోహిత్ 30 అర్ధశతకాలు చేశాడు. ముందు ఇషాన్ కిషన్ అవుటైన వెంటనే సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఒక్క రన్ కూడా చేయకుండానే అవుటై పెవిలియన్ కు తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది సేపటికి రోహిత్ అర్ధశతకం పూర్తి చేసి వికెట్టు కోల్పోయాడు. రిషభ్ పంత్ కూడా నాలుగు పరుగులు సాధించి తిరుగుముఖం పట్టారు. శ్రేయా అయ్యర్, వెంకటేశ్ కలిసి 36 పరుగులు సాధించారు. అయ్యర్ అవుటయ్యే సమయానికి భారత్ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. ఆరు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. మిచెల్ శాంట్నర్ మూడు వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లది పైచేయిగా ఉన్నదని భావిస్తున్న సమయంలో హర్షల్ పటేల్, దీపక్ చహర్ లు అద్భుతమైక క్రీడాపాటవం ప్రదర్శించారు. అడమ్ మిల్నే వేసిన చివరి ఓవర్ లో దీపక్ 19 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. స్కోరు 184కి చేరింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం బాగానే జరిగింది కానీ ఒక వైపు వికెట్ల పతనం కొనసాగుతూ ఉండింది. అక్సర్ పటేల్ బ్రహ్మాండమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. డరీల్ మిచెల్, మార్క్ చాపమన్ వికెట్లను పటేల్ (3/9) తన మొదటి ఓవర్ లోనే పడగొట్టాడు. యజువేంద్ర చహల్ ను మార్టిన్ గుప్టల్ పిచ్చికొట్టుడు కొట్టినప్పటికీ అతడికే బౌలింగ్ అవకాశాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అదనంగా ఇవ్వడంతో ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేసి గుప్టిల్ ను అవుట్ చేశాడు. వెంకటేశ్ అయ్యర్ మొదటి సారి బౌలింగ్ చేసి ఒక వికెట్టు తీసుకున్నాడు. చివరలో భారత పేస్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్ లు చెరి రెండు ఓవర్లు బౌల్ చేసి న్యూజిలాండ్ ను తుడిచిపెట్టేశారు. న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 111 పరుగులు చేసి అవుటైపోయింది. భారత్ 73పరుగుల తేడాతో విజయం సాధించింది.
నవంబర్ 25న భారత్, న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్ ల సీరీస్ కాన్పూర్ లో ప్రారంభం అవుతుంది. భారత జట్టుకు విరాట్ కొహ్లీ నాయకత్వం వహిస్తాడు. రోహిత్ శర్మ ఆ మ్యాచ్ ఆడడు. విరామం తీసుకుంటాడు.