Thursday, November 21, 2024

వాక్సిన్ విజేత భారత్

వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, అవి క్షేమకరం అని చెప్పడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి మొదలు ముఖ్యులంతా వ్యాక్సిన్ వేయించుకోవడం ఎంతో ధైర్యాన్ని తద్వారా ఆనందాన్ని ఇచ్చే అంశం. రెండు రోజుల నుంచి  కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం సంతోషాన్ని కలిగించే అంశం. వ్యాక్సినేషన్ లో రెండో దశలోకి అడుగుపెట్టాం. అది విజయవంతంగానే సాగుతోంది.

మనోధైర్యాన్ని పెంచే పరిణామాలు

అత్యవసర సిబ్బందితో పాటు సాధారణ ప్రజలు కూడా వ్యాక్సినేషన్ ను వినియోగించుకునేందుకు వీలుగా చర్యలను ప్రారంభించడం మంచి పరిణామం. 45ఏళ్ళు దాటి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కూడా టీకాలను సిద్ధం చేయడం అభినందనీయం. మరెన్నో సంస్థల నుంచి మరిన్ని వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి రానుండడం కూడా మనోధైర్యాన్ని పెంచే అంశం. కరోనా వైరస్ కల్పించిన కష్టాల నుంచి మనం మెల్లగా బయటపడుతున్నాం, త్వరలో ఒకప్పటి సాధారణ పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నాం, అని అందరూ స్వేచ్చావాయివులు పీల్చుకుంటున్న వేళ, దేశంలోని పలు ప్రాంతాల్లో మళ్ళీ కరోనా విజృంభణం మొదలవ్వడం చాలా బాధాకరం.

Also Read : భారత చీఫ్ కోచ్ కు కరోనా వాక్సిన్

ప్రాణాల ఖరీదు కట్టలేం

అన్ని దశల పరీక్షలు సంపూర్ణమవ్వకుండానే వ్యాకిన్లు విడుదల చేయడంపై విమర్శలు ఇంకా ఆగలేదు. వ్యాక్సిన్ల సమర్ధత ఇంకా పూర్తిగా రుజువు కావాల్సివుంది. పాలకులు, న్యాయమూర్తులు, అధికారులు వ్యాక్సిన్లు తీసుకొని ప్రజలకు ధైర్యం చెప్పడం అభినందనీయమైన విషయం. ఇదే క్రమంలో, టీకాలు వికటించటం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఇది చాలా విచారకరం. వ్యాక్సిన్లు వికటించినవారి సంఖ్య తక్కువే కావచ్చు, కానీ ప్రాణానికి ఖరీదు కట్టలేం. నిజంగా వికటించటం ద్వారానే ఇవన్నీ జరిగితే, పూర్తి స్థాయిలో నిష్పక్షపాతమైన దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలి. కొత్త వ్యాకిన్లు వచ్చిన కొత్తల్లో ఇటువంటివి జరగడం సర్వ సాధారణం అంటూ కొట్టిపారేయడం అనైతికం.

దేశీయ సంస్థల సామర్థ్యం ప్రశంసనీయం

మన దేశానికి సంబంధించిన సంస్థలు ఇంత తక్కువకాలంలో వ్యాక్సిన్లను తయారుచేయడం ఎంతో ప్రశంసాత్మకం. అదే సమయంలో, సమర్ధతపై ఇంకా దృష్టి సారించాల్సిన అవసరం వుంది. వికటించటంపై పునఃపరీక్షలు జరపాల్సిన అవసరం ఉంది. వైరస్ కొత్త రూపాలను సంతరించుకుంటోంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు వీటికి ఉన్నాయని చెబుతున్నారు. వివిధ అనారోగ్యాలతో బాధపడేవారికి కరోనా సోకితే కష్టమేనని వైద్యులు చెబుతూనే వున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నా, కొత్త వైరస్ మళ్ళీ సోకే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు.

Also Read : మళ్ళీ వస్తోంది మహమ్మారి!

చైనా సైబర్ దాడి నీచం, పాపం

కరోనా వైరస్ లోని కొత్త రకాలను కూడా ఎదుర్కొనే శక్తి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లకు ఉందని కూడా ప్రచారం జరిగింది. ఇవన్నీ ఆచరణలో తేలాల్సివుంది.ఇవన్నీ అట్లుండగా, మన వ్యాక్సిన్ వ్యవస్థలపై చైనా సైబర్ దాడి ప్రారంభించిందనే వార్తలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. సభ్య సమాజంలో కలకలం సృష్టిస్తున్నాయి. నిజంగా ఇది నిజమైతే ఇంతకు మించిన నీచం, పాపం ఇంకొకటి ఉండదు. ముఖ్యంగా మన దేశీయ సంస్థలైన భారత్ బయోటెక్, సీరమ్ ఇన్ స్టిట్యూట్ పై ఈ దాడి జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థల నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన, వివరణ రావాల్సివుంది. భారత్ బయో టెక్ సంస్థ మన తెలుగువారిది కూడా. ఈ సంస్థల్లోని సిస్టమ్స్ లోకి మాల్ వేర్ చొప్పిస్తున్నారని, తద్వారా, వాటి మేధాసంపత్తిపై దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

దుష్ట పథకం రచించిన చైనా సంస్థ

చైనా ప్రభుత్వం అండదండలతో నడిచే స్టోన్ పాండా /ఏపిటి 10 ఈ పథకరచన చేసిందని చెబుతున్నారు. సిస్టమ్స్ లోని లోపాలను, బలహీనతలను గుర్తించి, ఈ దుర్మార్గానికి పాలుపడుతున్నట్లు వెళ్లడవుతున్న సమాచారం అత్యంత వేదనను కలిగిస్తోంది.సింగపూర్ లో, అమెరికన్ ఆర్ధిక సేవల సంస్థ గోల్డ్ మన్ శాక్స్ ఆధ్వర్యంలో నడిచే సైబర్ సెక్యూరిటీ సంస్థ “సైఫర్మా” ఈ సైబర్ దురాగతాన్ని బయటపెట్టిందని వార్తా కథనాలు వస్తున్నాయి. ఇందులో ఏ మాత్రం నిజంలేదని, ఇది చైనాపై జరిగే దుష్ప్రచారమనీ, చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ పెన్ బిన్ ఖండించారు.  కరోనాకు వ్యాక్సిన్లు రూపొందించి, దేశ ప్రజల రక్షణ కోసం కృషి చేస్తున్న మన దేశీయ సంస్థలపై ఇటువంటి సైబర్ దాడులు జరగడం దారుణమైన అంశం.

Also Read : కరోనా వ్యాక్సినేషన్ రెండో డోస్ ప్రక్రియ ప్రారంభం

నిజం నిగ్గు తేల్చాలి

దీనిపై మన ప్రభుత్వంతో పాటు, అమెరికా సహా మిగిలిన దేశాల ప్రభుత్వాలన్నీ దృష్టి సారించాలి. నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఇటువంటి దుశ్చర్యలకు ఏ వ్యక్తి, ఏ సంస్థ, ఏ దేశం పాల్పడినా  అంతకు మించిన నేరం,పాపం, నీచం ఇంకొకటి ఉండదు. అసలు చైనాయే కరోనా వైరస్ సృష్టికర్త, అనే ప్రచారం ప్రపంచంలో ఉంది. ఇప్పుడు ఈ సైబర్ దుర్మారం బయటకు వచ్చింది. కరోనా వల్ల యావత్తు ప్రపంచం తల్లడిల్లిపోయింది. ఇంకా లోకం ఆ చీకటి నుంచి బయటకు రాలేదు. సంపూర్ణంగా ఎప్పుడు బయటకు వస్తుందో కూడా తెలియరావడం లేదు. కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూనే ఉందాం. త్వరలోనే కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందుతామని విశ్వసిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles