- భద్రతామండలి తీర్మానానికి ఆమోదం తెలపని చైనా, రష్యా
- అమెరికా ప్రయోజనాలను మాత్రమే తీర్మానం కాపాడిందని విమర్శ
ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి అధ్యక్ష స్థానం నుంచి దిగిపోయే ముందు రోజు భారత్ తన విదేశాంగ విధానంలో ప్రధానమైన అంశాన్ని నొక్కి చెప్పింది. 2593 వ తీర్మానాన్ని ఆమోదింపజేయడంలో భారత ప్రతినిధులు చేసిన కృషి ఫలించింది. ఉగ్రవాదులకు అఫ్ఘానిస్తాన్ భూమిని వినియోగించుకునే అవకాశం ఇవ్వరాదనీ, ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వరాదనీ, వారిని ప్రోత్సహించరాదనీ అఫ్ఘానిస్తాన్ కు చెబుతూ చేసిన ఈ తీర్మానంపైన శాశ్వత సభ్యదేశాలు రెండు ఓటు చేయలేదు. మొత్తం అయిదు శాశ్వత సభ్యదేశాలు భద్రతామండలిలో ఉన్నాయి. అవి చైనా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్. వీటిలో చైనా, రష్యాలు ఓటింగ్ లో పాల్గొనలేదు. శాశ్వత సభ్యత్వంలేకపోయినప్పటికీ ఇండియాకు కొంతకాలంపాటు భద్రతామండలి అధ్యక్ష స్థానంలో కూర్చునే అవకాశం ఇచ్చారు.
ఇండియా ఆందోళన చెందుతున్న ముఖ్యమైన అంశాలు ప్రస్తావించిన ఈ తీర్మానం భద్రతామండలి ఆమోదం పొందడాన్ని ఒక విజయంగా భారత ప్రభుత్వం భావిస్తున్నది. ఈ తీర్మానం నెగ్గడానికి చేసిన ప్రయత్నాలను విదేశాంగమంత్రి ఎస్. జయశంకర్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ సమన్వయం చేశారు. వీరిద్దరీ భారత విదేశాంగ విధానం రూపకల్పనలో, అమలులో ముఖ్యభూమికను పోషిస్తున్నారు. ఈ తీర్మానం ఆమోదం పొందేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి అంటోనీ బ్లింకెన్ తో కూడా మాట్లాడారు. దేశం వీడిపోవాలనుకునే అఫ్ఘాన్ పౌరులను క్షేమంగా వెళ్ళే అవకాశం ఇవ్వాలని కూడా తీర్మానం కోరింది.
ఈ తీర్మానంలో అన్ని ఇస్లామిక్ గ్రూపులనూ, ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ గ్రూపునూ, య్యూఘర్ తూర్పు టర్కిస్తాన్ ఇస్లామిక్ ఉద్యమాన్ని కూడా ప్రస్తావించాలని తాము కోరుతున్నట్టు చైనా, రష్యా తెలిపాయి. అమెరికా, ఫ్రాన్స్ , బ్రిటన్ లు తక్కువ వ్యవధిలో తమకు తోచిన తీర్మానాన్ని ఆమోదించాలని హడావిడి చేశారని చైనా, రష్యా విమర్శించాయి. ఉగ్రవాదులను రెండుగా విభజించి, అమెరికా అనుకూల ఉగ్రవాదులనూ, అమెరికా వ్యతిరేక ఉగ్రవాదులనూ రెండు భాగాలుగా పరిగణించడాన్ని చైనా, రష్యాలు అంగీకరించలేదు. 1267వ తీర్మానంలో పేర్కొన్న వ్యక్తులనూ, ఉగ్రవాద సంస్థలనూ అంటూ 2593 తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తీర్మానంలో పేర్కొన్న సంస్థలలో లష్కర్-ఇ-తొయ్యబా, జైష్-ఇ-మొహమ్మద్ కూడా ఉన్నాయి.