* బర్నవుట్ల భయం ఉందన్న కొహ్లీ
* క్రికెటర్లతో చర్చించే షెడ్యూలు
కరోనా వైరస్ భయంతో ఓవైపు ప్రపంచ దేశాల ప్రజలంతా గజగజలాడి పోతుంటే…. ఏడాదిపొడవునా ఎడాపెడా క్రికెట్ మ్యాచ్ లు ఆడేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న విరాట్ కొహ్లీ అండ్ కో మాత్రం మరో భయంతో ఒణికిపోతున్నారు.
బయోబబుల్ వాతావరణంలో స్వదేశీ, విదేశీ క్రికెట్ సిరీస్ లు ఆడుతూరావడం భారతజట్టు సభ్యులకు ఓ సవాలుగా మారిందని, సహనానికి పరీక్షగా నిలిచిందని కెప్టెన్ విరాట్ కొహ్లీ చెబుతున్నాడు.
ఇంగ్లండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన మీడియా సమావేశంలో కొహ్లీ తన మనసులో మాట బయటపెట్టాడు.
Also Read : కొహ్లీకి ఇంకా కాని శతకోదయం
ఆటగాళ్లతో చర్చించాలి- విరాట్
అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ను రూపొందించడానికి ముందు క్రికెటర్ల సలహాలు సూచనలు తీసుకోవాలని బీసీసీఐని కోరాడు. స్వదేశీ,విదేశీ సిరీస్ లు, ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు ఆడుతూ క్రికెటర్లు మరబొమ్మల్లా మారిపోయారని, ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో క్రిమిరహిత బయోబబుల్ వాతావరణంలో గుడుపుతూ సిరీస్ లు ఆడటం ఓ సవాలుగా మారిందని వాపోయాడు.
క్రికెటర్లు శారీరకంగా పటిష్టంగా ఉన్నా…మానసికంగా కృంగిపోయే ప్రమాదం ఉందని, ఈ వాస్తవాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి, బీసీసీఐ వర్గాలు గమనించాలని పరోక్షంగా సూచించాడు. క్రికెటర్ల ప్రతినిథులతో చర్చించిన తర్వాతే షెడ్యూలు ఖరారు చేస్తే బాగుంటుందని కొహ్లీ చెప్పాడు.
Also Read : కృణాల్ పాండ్యా ప్రపంచ రికార్డు
మరోవైపు…ఇలాంటి పరిస్థితిని నివారించడం కోసం…ఇంగ్లండ్ రొటేషన్ విధానాన్ని అమలు చేస్తోంది. మరోవైపు భారత్ సైతం ఒక్కో స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్ళను ప్రత్యామ్నాయంగా ఉంచుతోంది.
క్రికెటర్లకు సిరీస్ వెంట సిరీస్ ఆడాలన్న నిర్భంధం లేదని, అలసిపోయామనుకొంటే తమకు తాముగా తప్పుకోవచ్చునని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఏదిఏమైనా…సినిమా స్టార్ల మాదిరిగానే నేటితరం క్రికెట్ స్టార్లు సైతం దీపం ఉండగానే ఇల్లుచక్కబెట్టుకోవాలని చూస్తున్నకారణంగానే బర్నవుట్ల భయం వెంటాడుతోంది.
Also Read : అయ్యర్ కు విదేశీ లీగ్ చాన్స్