- ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైన ఇంగ్లాండ్
ఇంగ్లండ్ తో నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో మట్టికరిపించింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ ను 3-1 తేడాతో చేజిక్కించుకుంది. మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను టీమిండియా స్పిన్నర్లు పకడ్బందీ బౌలింగ్ తో కట్టడి చేయడంతో విజయం భారత్ వశమైంది. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ భారత్ బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. ఈ గెలుపుతో టీమిండియా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంది.
Also Read : ఆఖరి టెస్టుపై భారత్ పట్టు
నాలుగో టెస్ట్ లో ఇంగ్లండ్ తన తొలి ఇన్సింగ్స్ లో 205 పరుగులకు ఆలౌట్ కాగా, బదులుగా భారత్ 365 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 135 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టీమిండియా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ మాయాజాలం ముందు పర్యాటక జట్టు బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. ఇద్దరూ పోటీలు పడి వికెట్లు తీస్తూ బ్యాట్స్ మెన్‌ను కట్టడి చేశారు.
మొతేరాలో స్పిన్ మాయాజాలం
అశ్విన్, అక్షర్ ఇద్దరూ చెరో ఐదు వికెట్లు తీసుకుని ఇంగ్లండ్ పరాజయాన్ని బాటలు పరిచారు. ఇంగ్లాండ్ జట్టులో డేనియల్ లారెన్స్ చేసిన 50 పరుగులే అత్యధికం. కెప్టెన్ జో రూట్ 30 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ కకావికలమైన పిచ్‌పై భారత ఆటగాళ్లు రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్‌లు అద్భుత ఆటతీరుతో అభిమానుల మనసులను ఆకట్టుకున్నారు. పంత్ సెంచరీతో అదరగొట్టగా, సుందర్ 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ 49, అక్షర్ పటేల్ 43 పరుగులు చేసి జట్టు విజయానికి పునాదులు వేశారు.
భారత్, ఇంగ్లండ్ ల మధ్య మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్ లు జరగ్గా, చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ఆ తర్వాత అదే స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అహ్మదాబాద్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో కోహ్లీ సేన 10 వికెట్ల తేడాతో విజయం సాధించగా, చివరిదైన నాలుగో టెస్టులో ఏకంగా ఇన్సింగ్స్ 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.
Also Read : రిషభ్ పంత్ ఫటాఫట్ సెంచరీ