- మోదీ, పుతిన్ చర్చలలో సామరస్యం
- వ్యాపారం పెంపొందించుకోవాలని నిర్ణయం
- ఇరు దేశఆల రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య భేటీ
- చైనాతో రష్యా సాన్నిహిత్యమే ఇండియాకు ఇబ్బంది
ఇరవయ్యవ ద్వైపాక్షిక వార్షిక సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోదీ సమావేశం కావడం మంచి పరిణామం. ఇరుదేశాల అధినేతలు నేరుగా మనసు విప్పి మాట్లాడుకొనే అవకాశం కూడా వచ్చింది. రెండు దేశాల మధ్య బంధాలు తగ్గుముఖం పడుతున్నాయని లోకంలో ప్రచారం జరుగుతున్న వేళ, ఇటువంటి సమాగమాలు అటువంటి అనుమానాలకు ఎంతోకొంత అడ్డుకట్టవేస్తాయి. రెండు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రుల మధ్య కూడా భేటీ జరగడం మరో మంచి పరిణామం. 2+2 ప్రాతినిధ్యంతో ఈ తరహా చర్చలు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ద్వైపాక్షికంగా అనేక అంశాలు ఉన్నప్పటికీ, రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రధానమైన ఎజెండా. ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న వ్యాపారం విలువ 75 వేల కోట్ల రూపాయలని సమాచారం. 2025నాటికి అది 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవలన్నది ప్రధానమైన లక్ష్యం. రక్షణరంగంతో పాటు ఇంధనం, చమురు, సహజవాయువు రంగాల్లో పెట్టుబడులకు ఇరు దేశాలు మొగ్గు చూపిస్తున్నాయి. రష్యా నుంచి సాంకేతికతను బదిలీ చేసుకొని, ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలను బలోపేతం చేసుకోవలన్నది మన ఆశయం.
Also read: నిష్క్రమించిన నిలువెత్తు తెలుగుదనం
నాటి ఆత్మీయత నేడు లేదు
చైనాతో తగాదాలు, వివాదాలు పెరుగుతున్న ఈ సమర వాతావరణంలో ఆయుధాల దిగుమతుల పరంగా రష్యా నుంచి సహకారం పొందడం మనకు అత్యంత అవసరం. రక్షణ ఆయుధాల విషయంలో ఇప్పటికీ మనం 60 శాతానికి పైగా రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే మనకు అవసరం – రష్యాకు అవకాశం. ఈ సందర్భంలో పుతిన్ ది ఫక్తు వ్యాపార పర్యటనగానే చూడాలని కొందరు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. సోవియట్ యూనియన్ విఛ్చిన్నం తర్వాత, ప్రపంచ దేశాల మధ్య మారిన సమీకరణాల నేపథ్యంలో ఇండియా- రష్యా మధ్య ఒకప్పటి సుహృద్భావ, ఆత్మీయ వాతావరణం తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల నుంచి అది పెరుగుతూ వచ్చింది. ఈ ఇరవై ఏళ్ళల్లో చైనా బాగా ఎదిగింది. అమెరికా- ఇండియా రెండు దేశాలు బాగా దగ్గరవుతున్నాయి. ‘శత్రువు శత్రువు మిత్రుడు’ అనే రాజనీతిలో భాగంగా చైనా-రష్యా మధ్య బంధాలు బాగా పెరుగుతూ వస్తున్నాయి. అదే క్రమంలో భారత్ ను రష్యాకు దూరం చేయాలనే కుట్రలను చైనా పెంచుతూ వస్తోంది. ఆ ఉభయులకు అమెరికా ఉమ్మడి శత్రువు కావడమే దీనికి కారణం. అగ్రరాజ్యంగా అవతరించాలన్న చైనా సామ్రాజ్య కాంక్ష మరో ప్రధాన కారణం. ఏది ఏమైనా, మనం స్వయంసమృద్ధిని సాధించేంత వరకూ మిగిలిన దేశాల మీద ఆధారపడక తప్పదు. రక్షణ, అణు, ఇంధన, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం తీసుకోవాల్సిందే. రష్యా నుంచి భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకోవడం అమెరికాకు ఏ మాత్రం రుచించడం లేదు. డేటా చోరీ జరుగుతుందని, తమ రక్షణ ప్రయోజనాలకు విఘాతకరమనే అనుమానాలను, అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఇండియా విషయంలో ‘కాట్సా’ ( కౌంటరింగ్ ఆమెరికాస్ యాడ్ వెర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ ) ప్రయోగం అంశంపై అమెరికా తర్జనభర్జనలు పడుతోంది. భారత్ కు మినహాయింపు ఇవ్వాలని ఎక్కువ శాతం సెనెట్ సభ్యులు సూచిస్తున్నారు. ‘భారత్ మాకు వ్యూహత్మకంగా అతిపెద్ద రక్షణ భాగస్వామి, మా బంధాలను కాపాడుకుంటాం’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రెస్ ఐటీవల చేసిన వ్యాఖ్యలను మనం పరిగణనలోకి తీసుకోవాలి.
Also read: రోశయ్య జీవితం ఫలప్రదం, జయప్రదం
చైనాతోనే సమస్య
మన విషయంలో అమెరికా నుంచి పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ చైనా వల్లనే కొత్త తలనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తాలిబాన్ విషయంలో చైనా, రష్యా ఒకే పల్లవిని ఆలపిస్తున్నాయి. అదే మనకు అనుమానాస్పదం, అభ్యంతరకరం. ఇండో – పసిఫిక్ ప్రాంతంపైనా ఆధిపత్యం కోసం చైనా కుయుక్తులు పన్నుతోంది. అమెరికా కనుసన్నల్లో అమెరికా,ఇండియా,జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి ‘క్వాడ్’ ( క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) గా ఏర్పడడం అటు చైనాకు -ఇటు రష్యాకు ఇష్టం లేదు. దీనిని మూసెయ్యాలని రెండు దేశాలు పట్టుబడుతున్నాయి. ఇందులో ప్రధాన పాత్ర చైనాదే. అమెరికాతో ఆధిపత్య పోరు, జాతివైరం నేపథ్యంలో చైనా, రష్యా ఒకదానికొకటి బాగా దగ్గరవుతున్నాయి.ఈ పరిణామాలు భారత్ కు అంత కలిసొచ్చేవి కావు. కాకపోతే వ్యాపార స్వప్రయోజనాల దృష్ట్యా రష్యా మనల్ని పూర్తిగా వదులుకోలేక పోతోంది. చైనా -రష్యా బంధాలు కూడా స్వప్రయోజనాలనే అంతఃసూత్రాలపైన నిర్మాణమైనవే తప్ప వేరు కాదు. చైనాకూ, మనకూ సరిహద్దు వివాదాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగిన చరిత్ర ఉంది కానీ, రష్యా, భారత్ మధ్య ఎటువంటి తగాదాలు, వివాదాలు పెద్దగా లేవు. జవహర్ లాల్ నెహ్రు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రెండు దేశాల మధ్య గొప్ప స్నేహపూర్వక వాతావరణం ఉండేది. నిజం చెప్పాలంటే ఇరు దేశాల మధ్య కొన్ని అంశాల్లో భావ సారూప్యమైన చిన్న చిన్న అభ్యంతరాలు తప్ప వివాదాలు ఏమీ లేవు. రష్యా, ఇండియా శత్రుదేశాలు కానే కావు. అదే విశేషమైన అంశం. అదే ఇప్పటికీ రెండు దేశాలను వేరుపోకుండా ఉంచింది. విశాల దృక్పథంతో, సర్వ జనామోదంగా, గత ఘన స్నేహ చరితను మనసులో ఉంచుకొని, విలువలకు కట్టుబడి ఉండే భారతదేశం పట్ల రష్యా స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని విశ్వసిద్దాం. ఆ బంధం ఎన్నటికీ ఇగిరిపోని గంధంగా విలసిల్లాలని ఆకాంక్షిద్దాం.
Also read: అప్రమత్తంగా ఉంటే అనర్థం ఉండదు