* ఆఖరిటెస్టులో ఇంగ్లండ్ పై ఇన్నింగ్స్ విజయం
* అశ్పిన్, అక్షర్ స్పిన్ జాదూలో రూట్ ఆర్మీ గల్లంతు
ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టెస్టు లీగ్ చాంపియన్షిప్ ఫైనల్స్ కు భారత్ దూసుకెళ్లింది. ఇంగ్లండ్ తో ముగిసిన నాలుగుమ్యాచ్ ల సిరీస్ ను 3-1తో నెగ్గడం ద్వారా టైటిల్ సమరంలో పాల్గొనటానికి అర్హత సంపాదించింది.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముగిసిన నాలుగోటెస్టు రెండున్నర రోజుల ఆటలోనే ఇంగ్లండ్ ను భారతజట్టు ఊదిపారేసింది. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్ నిలబెట్టుకొంది.
సుందర్-అక్షర్ సూపర్ బ్యాటింగ్
రెండోరోజు ఆట ముగిసేసమయానికి సాధించిన స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన భారత్ కు ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ జోడీ సెంచరీ భాగస్వామ్యంతో భారీవిజయానికి మార్గంసుగమం చేశారు.
Also Read : ఫైనల్ కు కోహ్లీసేన : 3-1 తేడాతో సిరీస్ కైవసం
అక్షర్ 97 బాల్స్ లో 5 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 43 పరుగుల స్కోరుకు రనౌట్ గా వెనుదిరిగాడు. యువఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 174 బాల్స్ లో 10 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 96 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలవడంతో భారత్ 365 పరుగుల స్కోరు సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 4 ,యాండర్సన్ 3, లీచ్ 2 వికెట్లు పడగొట్టారు.
అశ్విన్- అక్షర్ స్పిన్ జాదూ
160 పరుగుల తొలిఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ భారత స్పిన్ జోడీ అక్షర్ పటేల్, అశ్విన్ ల జాదూలో గల్లంతయ్యింది. 54.5 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రూట్ 30, మిడిలార్డర్ ఆటగాడు లారెన్స్ 50 పరుగులు మినహా మిగిలిన ఇంగ్లండ్ ఆటగాళ్లంతా భారత స్పిన్ కు దాసోహమనక తప్పలేదు.
Also Read : ఆఖరి టెస్టుపై భారత్ పట్టు
అశ్విన్ 47 పరుగులిచ్చి 5 వికెట్లు, అక్షర్ 48 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టారు. దీంతో మూడోరోజుఆట పూర్తిగా ముగియకుండానే భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారీవిజయంతో సిరీస్ నిలబెట్టుకొంది. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన యువఆటగాడు రిషభ్ పంత్ కు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్, ఆల్ రౌండర్ అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
Also Read : టెస్టు సిరీస్ లో అశ్విన్ విశ్వరూపం
క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జూన్ 21న జరిగే ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్స్ టైటిల్ సమరంలో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.