Sunday, November 24, 2024

బ్రహ్మపుత్రపై భారత్ సైతం…

బ్రహ్మపుత్ర నదిపై భారీ  ప్రాజెక్టు నిర్మించడానికి భారత ప్రభుత్వం సన్నాహాలు చేయడం  భౌగోళిక చరిత్రలో గొప్ప మలుపు. ఈ నది బహు ప్రయోజనకారి, గొప్ప చరిత్ర దీని సొంతం. ఈ ఆలోచనలు గత ప్రభుత్వాలు కూడా చేసినా, ప్రతిపాదనల దశ దాటి ముందుకు సాగలేదు. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధితో ముందుకు సాగి నిర్మాణం సంపూర్ణం చేస్తే జాతికి బహుళప్రయోజనాలు కలుగుతాయి.

రక్షణకవచం

చైనా-భారత్ మధ్య సాగుతున్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్ కు రక్షణ కవచంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంది. వీలైనంత త్వరగా ప్రారంభించి, పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ దిశగా చైనా మనకంటే ఎన్నో అడుగులు ముందుంది. టిబెట్ లో బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టుకు  చైనా 16 మార్చి 2009న శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించింది. ప్రాజెక్టు నిర్మాణానికి  చైనాలోని ఐదు పెద్ద విద్యుత్ కంపెనీలు ఒక వ్యాపారకూటమిగా ఏర్పడ్డాయి. ఇది సంపూర్ణమైతే, ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా నిలుస్తుంది. అప్పటి ప్రతిపాదనల మేరకు దీని ద్వారా 40మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్రహ్మపుత్ర నది/ యార్ లంగ్ జంగ్ మూ   పై డ్యామ్ నిర్మించారు. భూటాన్, ఇండియా సరిహద్దుల వైపు  ఉంది. ఇది  జంగ్ మూ హైడ్రో పవర్ ప్రాజెక్టు లో భాగం. 13 అక్టోబర్ 2015 నాటికి ఈ డ్యామ్ అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

బ్రహ్మపుత్రపైన మొదటి డ్యామ్

బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణమైన మొట్టమొదటి డ్యామ్ ఇదే. ఈ అంశంలోనూ మనకూ -చైనాకూ మధ్య ఎన్నో వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం వినవస్తున్న సమాచారం మేరకు, టిబెట్ లోని బ్రహ్మపుత్ర నదిపై 60000 మెగావాట్ల  సామర్ధ్యంతో భారీ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు చైనా ప్రభుత్వ విద్యుత్ సంస్థ చైర్మన్ యాన్ ఝియాంగ్ ఒక వారం క్రితం ప్రకటించారు. దీని వల్ల భారత్ కు పెను ప్రమాదాలు పొంచిఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మన భూభాగంలో ఆకస్మిక వరదలతో పాటు నీటి ఎద్దడి కూడా పెరుగుతుంది. ఈ నది టిబెట్, బంగ్లాదేశ్, భారతదేశంలో ప్రవహిస్తోంది.

వరద ప్రమాదం

గతంలో కంటే ఎక్కువసార్లు, పెద్దఎత్తున వరదలు వచ్చే ప్రమాదముందని “నేచర్ కమ్యూనికేషన్స్” అనే పత్రిక ప్రచురించింది. కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు  ప్రకటించిన వ్యాసం దీనికి ఆధారం. మానవులు చేస్తున్న ప్రకృతి వ్యతిరేక చర్యల ప్రభావంతో పాటు, పర్యావరణంలో వచ్చే మార్పులు కూడా ఈ దుష్పరిణామాలకు కారణాలవుతాయని పరిశోధకులు తేల్చిచెప్పారు. వీటన్నింటి నేపథ్యంలో, భారత ప్రభుత్వం అరుణాచలప్రదేశ్ లో బహుళ ప్రయోజన ప్రాజెక్టు నిర్మాణానికి యోచిస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి టి.ఎస్. మొహ్రా మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 10వేల మెగావాట్ల సామర్ధ్యం కలిగిన జల విద్యుత్ కేంద్ర నిర్మాణ ప్రతిపాదన కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు.

భారత్ కు బ్రహ్మపుత్ర వరప్రసాదిని

ఈ ప్రాజెక్టు సంపూర్ణమైతే మన అవసరాల సరిపడా నీటిని నిల్వచేసుకోవడంతో పాటు, విద్యుత్ ఉత్పత్తికీ వీలవుతుంది. బ్రహ్మపుత్రనది భారతదేశంలోని 40శాతం జలవిద్యుత్ అవసరాన్ని, 30శాతం నీటి వనరుల అవసరాన్ని తీరుస్తుందని ఒక అంచనా. బ్రహ్మపుత్రగా ప్రసిద్ధమైన ఈ నదికి అనేకపేర్లు ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. దీని పూర్వనామం “లౌహిత్య”. అస్సాంలో దీన్ని లుయుత్ అని పిలుస్తారు. టిబెటన్ భాషలో యార్ లంగ్ త్సాంగ్ పో అంటారు. సహజంగా నదులన్నింటికీ స్త్రీ పేర్లు ఉంటాయి. బ్రహ్మపుత్ర అనేది పురుషనామం. ఇదే దీని ప్రత్యేకత. అలలు సముద్రాలలోనే వస్తాయి.ప్రపంచంలో అలలపోటు సృష్టించే నది కూడా ఇదే కావడం విశేషం.

ఇప్పటికి ప్రతిపాదన దశలోనే ప్రాజెక్టు

1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేంత వరకూ బ్రహ్మపుత్ర నది పెద్ద జలమార్గంగా ఉపయోగపడింది. సరుకుల రవాణాకు గొప్ప మార్గంగా విలసిల్లింది. భిన్న మతాల, భాషల, జాతుల, సంస్కృతుల, ఉపనదుల సంగమం బ్రహ్మపుత్ర. ఇంకా యోచన దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఏ ఏ ప్రయోజనాలు నెరవేరుతాయి,ఎంత ఖర్చవుతుంది,  ఎటువంటి అడ్డంకులు ఉన్నాయి మొదలైన అంశాలపై మన ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టత రావాల్సివుంది. ఈ మహా ప్రాజెక్టును  ఉద్యమస్ఫూర్తితో పూర్తి చేసి,దేశభక్తిని చాటుకోవాల్సిన బాధ్యత బిజెపి ప్రభుత్వానికి, దేశనేత ప్రధానమంత్రి నరేంద్రమోదీ భుజస్కంధాలపై ఉంది. జయోస్తు!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles