Sunday, December 22, 2024

ప్రపంచ ఫుట్ బాల్ పోటీలలో పత్తా లేని ఇండియా!

  • ఫీఫా పోటీలలో ఆడే అర్హత  సంపాదించలేని ఇండియా
  • 3 లక్షల జనాభా గల ఐస్ లాండ్ పోటీపడుతోంది
  • 135 కోట్ల జనాభా కలిగిన ఇండియా ఒక మూల కునారిల్లుతోంది. ఎందుకు?

ప్రపంచ ఫుట్ బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. కతార్ జట్టు వీరావేశం, ఇరాన్ జట్టు ప్రతిభావిశేషాలు, అర్జెంటీనా పోటీతత్వం వంటి శీర్షికలు మన పత్రికలలో వస్తున్నాయి. మనం చదువుతున్నాం. కానీ మన జట్టు ఎక్కడ ఉంది? ప్రపంచ ఫుట్ బాల్ క్రీడలో ఇండియా ర్యాంకు ఎంత? ప్రపంచంలో మనం సగర్వంగా నిలిచివెలుగుతున్నాం అంటూ డాంబికాలు పలికే నాయకులు ఫుట్ బాల్ ఊసెత్తడం లేదు. కారణం ఏమిటి?

ప్రపంచ కప్ లో ఆడటం మాట అటుంచి, ఆసియా కప్ పోటీలలో ఆడటానికి అర్హత పొందేందుకు గట్టి పోటీ ఇవ్వడాన్నే గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ పోటీలో జూన్ లో విజయం సాధించిన సందర్భంగా సునీల్ ఛేత్రీ నాయకత్వంలోని భారత ఫుట్ బాల్ జట్టు పండగ చేసుకున్నది. ఆసియా ఫుట్  బాల్ కాన్ఫెడరేషన్ సభ్యుల జాబితాలో ఇండియా 19వ స్థానంలో ఉంది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్ బాల్ అసోసియేషన్ (ఫీఫా) తాజా ర్యాకింగ్ ల ప్రకారం ఇండియా 104వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ (103)కంటే ఒక ర్యాంకు తక్కువలో ఉంది. ఇరాన్, బ్రాజిల్, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్ లాండ్స్, ఇంగ్లండ్, స్పెయిన్, ఇటలీ, పోర్చ్ గీస్, డెన్మార్క్  వంటి మనకంటే చిన్న దేశాలు అగ్రగాములుగా ఉన్నాయి.

మూడు లక్షల జనాభా మాత్రమే ఉన్న ఐస్ లాండ్ మొన్నటి వరకూ ఫీఫా 133వ స్థానంలో ఉంది. ఇప్పుడు అది విజృంచి ఆడి ఫీఫా కప్ పోటీలలో పాల్గొన్నది. అదే ఇండియా ఎందుకో కానీ విజృంభించడం లేదు. ప్రపంచకప్  పోటీలలో పాల్గొనడం లేదు. ప్రపంచ కప్ పోటీలలో పాల్గొనడానికి అర్హత సంపాదించే పోటీలో ఇండియా ఉన్న గ్రూప్ లో ఇరాన్, టర్కెమినిస్తాన్, గువాం, ఓమన్ లు ఉన్నాయి. ఆట చివరికి మనం గ్రూప్ లో చివరన మిగిలాం. ఐస్ లాండ్, కామరూన్ వంటి బుల్లి దేశాలు సాధిస్తున్న విజయాలు 130 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత దేశంలో ఎందుకు సాధించలేకపోతోంది? ముందు దేశంలో పుట్ బాల్ నాగరికత పెంపొందించాలని  భారత ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ భాయ్ చుంగ్ భూటియా అంటున్నారు. మన దేశంలో క్రికెట్ ఒక ఉన్మాదస్థాయికి పెరిగింది. బాల్ బాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ లు కూడా బతికి బట్టకడుతున్నాయి. కానీ ఫుట్ బాల్ మాత్రం దిగదుడుపే. ఎప్పుడో మోహన్ బగాన్ జట్టూ, హైదరాబాద్ జట్టు ఫుట్ బాల్ ఆడేవాళ్ళు. అదంతా ఎప్పుడో పాతరోజుల సంగతి. దక్షిణ అమెరికా,  ఆఫ్రికా దేశాలలో ఫుట్ బాల్ ని ఆరాధిస్తారు. యూరోపియన్ దేశాలలో సైతం ఫుట్ బాల్ చాలా ప్రజాదరణ పొందిన ఆట.

మన దేశంలో ఫుట్ బాల్ ప్రేమికులు లేకపోలేదు. యూరోపియన్ దేశాల మధ్య జరిగే పోటీలను ఆసక్తిగా చూస్తారు. అయితే, వీరు పట్టణ ప్రాంతాలలో సంపన్న కుటుంబాలకు చెందిన యువకులు. వారికోసం మన టీవీ చానళ్ళు ఇంగ్లీషు ప్రైమరీ లీగ్ మ్యాచ్ లను లైవ్ లో చూపిస్తాయి.  మన దేశంలో ఫుట్ బాల్ కి ప్రాథమిక వసతులు లేవు. ఫుట్ బాల్ కి మాత్రమే ప్రత్యేకించిన మైదానాలు లేనే లేవు. క్రికెట్ కి ఉన్న ప్రాథమిక సదుపాయాలు సైతం ఫుట్ బాల్ కి అక్కరలేదు. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలలోనూ, గోవాలోనూ, పశ్చిమబెంగాల్ లోనూ, కేరళలోనూ ఫుట్ బాల్ బాగా అడతారు.

హాకీ లాగానే ఫుట్ బాల్ సైతం జట్టుగా ఆడే ఆట. క్రికెట్ కూడా జట్టుగానే ఆడుతుంది కానీ ఈ ఆటలో వ్యక్తిగత ప్రతిభావిశేషాలూ, వైఫల్యాలూ కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. జట్టు ఆటమీద ప్రభావం వేస్తాయి. ఫుట్ బాల్, హాకీ, వాలీబాల్ ఆద్యంతం ఒక జట్టుగానే ఆడాలి. హాకీలో సైతం ధ్యాన్ చంద్ రోజుల్లో ప్రపంచ చాంపియన్లుగా ఉండే ఇండియా ఇప్పుడు అడుక్కుపోయింది. ఆస్ట్రేలియా, జర్మనీ, ఇంగ్లండ్ వంటి దేశాలు అగ్రగామిగా ఉన్నాయి. అమెరికన్లకూ, యూరోపియన్లనూ, దక్షిణ అమెరికా దేశాల ప్రజలకూ ఉన్న శారీరక శక్తి, బలం మనవాళ్ళ దగ్గర లేకపోవడం ఫుట్ బాల్ లో రాణించలేకపోవడానికి ఒక కారణం. కానీ ఈ కారణం సమంజసంగా కనిపించదు. వందకోట్లకు పైగా జనాభా కలిగిన దేశంలో అత్యంత వేగంగా కదులుతూ, శక్తిమంతంగా  ఆడేవారు వందమంది దొరకరా?

మన దేశంలో క్రికెటర్లను ఆరాధిస్తారు. వారు సరిగా ఆడకపోతే వారిపైన దాడులు చేస్తారు. వారి ఇళ్ళను తగులబెడతారు. భారత్ కోచ్ గ్రెగ్ చాపెల్ ను భువనేశ్వర్ విమానాశ్రయంలో దవడ వాచేట్లు చెంపదబ్బ కొట్టాడు. మన దేశంలో ఫుట్ బాల్ క్రీడ ప్రజాదరణ పొందకపోవడానికి కారణం ఏమంటే తల్లిదండ్రులు తమ పిల్లలను బోర్డు పరీక్షలకు తయారు చేసే నిమిత్తం వారిని 12 ఏళ్ళ నుంచి 16ఏళ్ళ వరకూ పాఠాలు వల్లెవేయడంలో ఉంచుతారు. ఆటలకు ప్రాధాన్యం ఇవ్వరు. 12-14 ఏళ్ళ మధ్యనే యువకుల్లో ఫుట్ బాల్ ప్రావీణ్యం పెరుగుతుందని కోచ్ లు అంటారు. పేరుకు ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఉంది. గ్రామీణ స్థాయిలో ఫుట్ బాల్ పోటీలు నిర్వహించి ఆ క్రీడను ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకోదు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా క్రికెట్ కు, షటిల్ బాడ్మింటన్ కు విరాళాలు ఇస్తాయి కానీ ఫుట్ బాల్ కు ఇవ్వరు. అందుకే మొత్తం సంస్కృతిలో ఫుట్ బాల్ కి అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పుడే చాంపియన్లు వస్తారు. అంతర్జాతీయ పోటీలలో రాణిస్తారు.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles