Sunday, November 24, 2024

నేపాల్ వైఖరిలో మార్పును స్వాగతిద్దాం

భారత్ -నేపాల్ సంబంధాలు మళ్ళీ పుంజుకుంటాయా, సరిహద్దు దేశం హద్దుల్లో ఉంటుందా, అనే ప్రశ్నలు తాజాగా చర్చకు వస్తున్నాయి. దీనికి కారణం: ఇటీవల కొన్ని రోజుల నుండీ భారత్ విషయం లో నేపాల్ సాత్వికంగా మాట్లాడుతోంది. నిన్న మొన్నటి వరకూ బద్ధ శత్రువులా,  తీవ్రస్థాయిలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు స్వరం మారుస్తోంది. దీని వెనకాల ఏదైనా వ్యూహం వుందా? అన్నది ఒక  ప్రశ్న. భారత్,నేపాల్ మధ్య నెలకొని వున్న అన్ని విభేదాలు చర్చల ద్వారా పరిష్కారమవుతాయనే విశ్వాసాన్ని, అభిప్రాయాన్ని నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి శుక్రవారంనాడు వ్యక్తం చేశారు. ఈ మధ్య కొన్ని రోజుల క్రితం కూడా ఇదే తీరున వ్యాఖ్యానం చేశారు. ఈ భావనలన్నీ నిజంగా హృదయపూర్వకంగా  వుంటే, మంచిదే. రెండూ పొరుగు దేశాల మధ్య  సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎన్నో ఏళ్ళ బంధం ఉంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం.

రాజీవ్ హయాంలో సమస్య

నేపాల్ మొన్నటి దాకా రాజుల పాలనలో ఉంది. అప్పటి వరకూ రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు చాలా వరకూ బాగానే ఉన్నాయి.రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే చిన్న ఆత్మగౌరవ సమస్య(ఇగో క్లాష్ ) వచ్చింది.అది కూడా రాజీవ్ గాంధీ వల్ల కాదు.సోనియా గాంధీని పశుపతి నాథ్ దేవాలయంలోకి అనుమతించక పోవడం వల్ల కొంత రచ్చ ఏర్పడిందని కొందరు చెబుతారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మొదలు అనేకమంది ప్రధానులుగా ఉన్న సమయంలోనూ బాగానే నడిచింది. ముఖ్యంగా పివి నరసింహారావు బాగా సఖ్యత పాటించారు. అందరి కంటే ఐ.కె.గుజ్రాల్ నేపాల్ తో బాగా వ్యవహరించారు. కాకపోతే, ఆయన పరిపాలించిన కాలం చాలా తక్కువ. నేపాల్ లో కమ్యూనిస్ట్ పాలన వచ్చి, కెపిశర్మ ఓలి ప్రధానమంత్రి పదవిని చేపట్టిననాటి నుండి క్రమంగా రెండు దేశాల మధ్య బంధాలు తగ్గుముఖం పట్టాయి.

పింగ్ తెచ్చిన పేచీ

చైనా అధిపతిగా జిన్ పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, బంధాలు దెబ్బతిన్నాయి.నేపాల్ వెనకాల చైనా నిల్చొని, భారత్ పై బాణాలు గురిపెట్టించింది.భారత్ ముందు  నేపాల్ చాలా చిన్న దేశం. నేరుగా మనల్ని ఏమీ చెయ్యలేదు. చైనా అండదండలు, దుష్ప్రభావంతో రెచ్చిపోయింది. నేపాల్ చాలా పేద దేశం. సహజ వనరులు ఉన్నప్పటికీ, ఆర్ధిక వనరులు లేకపోవడం వల్ల, చైనా ఆశ చూపించి ఆడించడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో భారత్ పై నేపాల్ సాంస్కృతికంగా, రాజకీయంగా దాడి మొదలు పెట్టింది. ఘోరమైన విమర్శలు చేసింది. నేపాల్ లో కరోనా వైరస్ వ్యాప్తికి మనమే కారణం అన్నది. అసలు అయోధ్య రామజన్మభూమి కానే కాదంది. సీతదేవిని  కూడా తమ దేవేరిగా ప్రకటించింది. భారత్ భూభాగాన్ని తన మ్యాప్ లో కలుపుకొని కొత్త మ్యాప్ ను సృష్టించడమే కాక, నేపాల్ సరిహద్దులను భారత్ దురాక్రమించిందని తిరిగి అభాండం మన మీదే వేసింది. ఒకవేళ, చైనా-భారత్ యుద్ధం సంభవిస్తే, చైనాకు తోడుగా నిలవాలనుకుంది. ఇలా చాలా చేసింది, చాలా మాట్లాడింది. గతం గతః అని వదిలివేయడం వివేకమే అయినా, నేపాల్ తో జాగ్రత్తగా ఉండడం మరింత ముఖ్యం.

స్వరం మారింది ఎందుకు?

ఇప్పుడు ఎందుకు నేపాల్ స్వరం మార్చుతోందని విశ్లేషిస్తే, దాని వెనకాల రాజకీయ కారణాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. సహజంగా అక్కడి ప్రజలు చాలా వరకూ భారత్ ను సోదర దేశంగానే భావిస్తారు. మన ప్రజలు కూడా నేపాల్ పట్ల వాత్సల్యంగానే ఉంటారు. దీనికి కారణం రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక సంబంధాలే. దీనికి తోడు, భారతీయులు నేపాల్ లో ఎన్నో వ్యాపార సంస్థలు, పారిశ్రామిక కేంద్రాలను స్థాపించి, ఉద్యోగ, ఉపాధులు కల్పిస్తున్నారు. మొన్న మొన్నటి వరకూ నేపాలీ గుర్ఖాలు భారత్ లో పని చేసేవారు. ఇప్పటికీ ఢిల్లీ, యూపీ, బీహార్ లో నేపాలీయులు మన సంస్థల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

రాజకుటుంబాల మధ్య బంధుత్వం

రాజుల కాలంలో మన రాజ కుటుంబాలతో బంధుత్వాలు కూడా ఉన్నాయి.సామాన్య కుటుంబాల మధ్య నేటికీ వివాహ బంధాలు ఉన్నాయి. ఇంతగా రెండు దేశాలు పెనవేసుకున్నాయి. భారతీయులకు నేపాల్ గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. అక్కడ కమ్యూనిస్ట్ రాజకీయ వర్గాల్లోనూ ఎక్కువ మంది భారత్ పట్ల గౌరవభావంతోనే ఉంటారు. ప్రధాని కెపి శర్మ ఓలి చేపట్టిన భారత్ వ్యతిరేక విధానాలను సొంత పార్టీవారు కూడా తీవ్రంగా ఖండించారు. కొత్త మ్యాప్ రూపకల్పనకు చాలా రోజులు ససేమిరా అన్నారు. అదే విధంగా, చైనాకు దగ్గరవ్వడం కూడా నేపాల్ ప్రజలకు పెద్దగా ఇష్టం ఉండదు.వారి మొగ్గు ఎప్పుడూ భారత్ వైపే ఉంటుంది.

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రధాని వైఖరిలో మార్పు

పరిపాలనా వైఫల్యం, విదేశాంగ విధానం, భారత్ తో గొడవలు, చైనాతో అక్రమ సంబంధాల నేపథ్యంలో కెపి శర్మ ప్రధాని పదవికే ఎసరు మొదలైందనే వార్తలూ వస్తున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకునే క్రమంలో, రాజకీయ స్వార్ధంతోనే   భారత్ కు మళ్ళీ దగ్గరవ్వడమో లేదా స్నేహపూర్వకంగా మెలగడమో అనే సరికొత్త పంథాను ఓలి శర్మ ఎంచుకొని ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. నేపాల్ గొప్ప సౌందర్య శోభితమైన ప్రాంతం. నదీ నదాలు ఉన్నాయి.హిమాలయ అందాలు ఉన్నాయి. గొప్ప పర్యాటక దేశం. భారత్ తో కలిసి మెలిసి సాగితే,  నేపాల్ పునర్నిర్మాణంలో భారత్ తప్పకుండా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది ఉభయతారకం. చైనాతో బంధాలు ఎలా ఉన్నా, ఆ ప్రభావంతో  భారత్ తో సంబంధాలు చెడగొట్టుకుంటే నేపాల్ కే నష్టం. భారత రాజకీయ పాలకులు, అధికారులు నేపాల్ వారిపట్ల చిన్నచూపు చూస్తారనే విమర్శలూ ఉన్నాయి. భారత్ విషయంలో నేపాలీయులకు ఆత్మన్యూనత (inferiority complex) కూడా ఉంటుందనీ కొందరు చరిత్రకారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ కారణాల వల్ల నేపాలీయులు భారత్ పట్ల దాయాది భావంతో ఉంటారని కొందరు పరిశీలకుల అభిప్రాయం.

చర్చల ప్రసక్తి శుభపరిణామం

ఈ మానసిక కోణాలను పక్కన పెట్టి, సాంస్కృతికంగా, విదేశాంగ విధాన పరంగానూ రెండు దేశాలు ఇంకా బాగా దగ్గరవ్వాలి. నేపాల్ ప్రధాని ఓలి శర్మ ఏ కారణాలతో, ఏ అవసరాలతో, ఏ  వ్యూహాలతో స్వరం మార్చినా చర్చల ద్వారా ఇరువురి విభేదాలను పరిష్కరించుకుందాం అని అనడాన్ని మంచి పరిణామంగా భావిద్దాం. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకుందాం అని చైనా కూడా అంటోంది. ఆచరణలో అది ముందుకు సాగడం లేదు. సరిహద్దు ఘర్షణల తర్వాత  ఈ నెల 10వ తేదీన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ముఖాముఖీ చర్చలో పాల్గొననున్నారు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజషన్ (ఎస్ సి ఓ ) వార్షిక సదస్సులో వీరిద్దరూ వీడియో సమావేశంలో కలుసుకుంటారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అధ్యక్షత వహిస్తారు. అమెరికాలో కొత్త అధ్యక్షుడి రాకతో ,  భారత్-చైనా మధ్య సంబంధాలు ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ, నేపాల్-భారత్ ల బంధాలపై కూడా కీలక భూమిక పోషిస్తాయి. స్వరంతో పాటు హృదయం కూడా మారాలని కోరుకుందాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles