- దిగుమతులు పెంచే అవకావం
- రష్యా ఆర్థిక వ్యవస్థ కుదుటపడటానికి దోహదం
- చౌకగా రష్యా నుంచి చమురు, ఎరువుల కొనుగోలు
భారత విదేశాంగమంత్రి జె. జైశంకర్ మాస్కోలో మంగళవారంనాడు రష్యావిదేశాంగమంత్రి సెర్జీ లావ్రోవ్ ను కలుసుకున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయం ఇండియా తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పిందని జైశంకర్ అన్నారు. ఇది యుద్దానికి తగిన సమయం కాదన్నది భారత్ అభిప్రాయం.
‘‘అంతర్జాతీయ పరిస్థితి గురించి మాట్లాడుకోవాలంటే గత కొన్ని సంవత్సరాలుగా కోవిద్ మహమ్మారి, ఆర్థిక ఒత్తిళ్ళు, వాణిజ్య ఇబ్బందులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన గట్టి ప్రభావం వేశాయి. ఇవి కాకుండా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం దుష్ఫలితాలు అనుభవిస్తున్నాం’’ అని జైశంకర్ అన్నారు.
‘‘ఉగ్రవాదం, వాతావరణ కాలుష్యం వంటి ఎడతెగని సమస్యలు సైతం ఉన్నాయి. వీటి వల్ల ప్రగతి కుంటుబడుతుంది. సంపద హరిస్తుంది. మన ప్రాంతాలకు సంబంధించిన అంశాలనూ, ప్రపంచానికి సంబంధించిన అంశాలనూ రష్యన్ విదేశాంగమంత్రితో చర్చిస్తాను’’ అని చెప్పారు.
ఇండియా, రష్యాలు వివిధ స్థాయిలలో గట్టి సంబంధాలు కలిగి ఉన్నాయి. సెప్టెంబర్ లో సమర్ ఖండ్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని నరేంద్రమోదీ సమావేశమైనారు. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి చమురు కొనకూడదని అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు చెబుతున్నప్పటికీ ఇండియా కొనుగోలు చేస్తోంది.
‘‘అత్యధికంగా వైవిధ్యం అవుతున్న, సమతుల్యంకోసం నిరంతరంగా ప్రయత్నిస్తున్న ప్రపంచంలో భారత్, రష్యాలు బలమైన, స్థిరమైన సంబంధాలు కొనసాగిస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనగూడదంటూ పాశ్చాత్య దేశాలు భారత్ కు పిలుపు నిస్తే ఏమి చేస్తారని ఒక విలేఖరి ప్రశ్నించగా, ఇంధన మార్కెట్ పైన నిజంగా చాలా ఒత్తిడి ఉన్నదనీ, దీనికి అనేక కారణాలు ఉన్నాయనీ అన్నారు. ప్రపంచంలో చమురునూ, గ్యాస్ నూ అత్యధికంగా వినియోగించే దేశాలలో మూడవ స్థానంలో ఉన్న ఇండియా భారత్-రష్యా సంబంధాలు మనకు (ఇండియాకు) అనుకూలిస్తాయి. మనం ఆ సంబంధాలను కొనసాగిస్తాం’’ అని జైశంకర్ సమాధానం చెప్పారు.
పెద్ద ప్రతినిది వర్గంతో జైశంకర్ రష్యాను సందర్శించడాన్ని చూస్తూ భారత్-రష్యా వాణిజ్యం బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల రష్యా ఉత్పత్తులను (చమురు, ఎరువులు) ఇండియా చౌకగా దిగుమతి చేసుకుంటుంది. రష్యా ఆర్థికవ్యవస్థ కూడా కుదుటపడుతుంది. రష్యాకు మద్దతుగా నిలవడం కారణంగా భవిష్యత్తులో ఉక్రెయిన్-రష్యా సంక్షోభం పరిష్కారంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.