- నాలుగు దశాబ్దాల తర్వాత సెమీఫైనల్ లో ప్రవేశం
- చీఫ్ కోచ్ గ్రాహం రీడ్ శిక్షణ ఫలితం
టోక్యో: గ్రేట్ బ్రిటన్ ను మట్టి కరిపించి భారత హాకీ టీమ్ ఒలింపిక్స్ సెమీఫైనల్ కు చేరుకొని చరిత్ర సృష్టించింది. బాడ్మింటర్ క్రీడాకారిణి ఆదివారం సాయంత్రం చరిత్ర సృష్టించిన ఆదివారం సాయంకాలమే హాకీ టీమ్ కూడా ఘనకార్యం సాధించడం విశేషం. భారత హాకీ జట్టు ఒలింపిక్స్ లో బంగారు పతకం చివరిసారి గెలిచింది 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్ లో. కడచిన 41 సంవత్సరాలలో గెలుపు కాదు కదా సెమీఫైనల్స్ కు కూడా రాలేదు. ఐదో స్థానంలోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.
టోక్యోలో గ్రూప్ ఏలో నాలుగు మ్యాచ్ లలో మూడింటిని గెలిచి రెండో స్థానంలో నిలిచిన భారత్ క్వార్టర్ ఫైనల్ లో గ్రేట్ బ్రిటన్ తో తలబడి 31 స్కోరుతో విజయం సాధించింది. భారత్ తరఫున ఆటమొదలైన తర్వాత కొన్ని నిమిషాలకే దిల్ ప్రీత్ సింగ్ ఒక గోలు కొట్టాడు. రెండో క్వార్టర్ మొదలైన కొద్ది నిమిషాలకు గుజరాన్ సింగ్ మరో గోలు చేశాడు. బ్రిటన్ తరఫున గోల్ ను మూడో క్వార్టర్ ముగుస్తుందన్న సమయంలో చేయగా నాలుగో క్వార్టర్ లో భారత్ కు మూడో గోల్ సాధించి 2 గోల్ ల ఆధిక్యాన్ని హార్దిక్ సింగ్ సాధించాడు.
ఈ ఆటలో భారత్ విజయం సాధించడం వెనుక కోచ్ గ్రాహం రీడ్ కృషి ఉంది. రెండేళ్ళ కిందట భారత హాకీ చీఫ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న ఆస్ట్రేలియా దేశస్థుడు గ్రాహం రీడ్ భారత క్రీడాకారులలో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రత్యర్థుల గత విజయాలను చూసి జంకవద్దనీ, ఎవరి ఆట వారు ఆడుకోవచ్చుననీ, ఎంత బలమైన ప్రత్యర్థినైనా ఓడించే అవకాశం ఉంటుందనీ, మనం ఎక్కువ పెనాల్టీ కార్నర్లు ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడాలనీ రీడ్ భారత క్రీడాకారుల చెవుల్లో నూరిపోశారు. యూరో చాంపియన్ షిప్ లో ఆడి వచ్చిన నాలుగు యూరోపియన్ టీమ్ లలో ఏ టీమ్ తో క్వార్టర్ ఫైనల్ ఆడాలన్నా కష్టమే. ఆస్ట్రేలియాతో గ్రూప్ స్థాయిలో 1-7 గోల్స్ తేడాతో భారత్ దారుణంగా ఓడిపోయింది. గ్రూప్ ఏ లోని నాలుగు మ్యాచ్ లలోనూ మూడు మ్యాచ్ లు భారత్ గెలుచుకొని రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్ బి లో రెండు మ్యాచ్ లు గెలిచి రెండు మ్యాచ్ లు ఓడిన బ్రిటన్ మూడో స్థానంలో నిలిచింది.
ఒలింపిక్ హాకీలో భారత జట్టు ఇంత దూరం రావడం గత నాలుగు దశాబ్దాలలో ఇదే ప్రథమం. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని జట్టు సభ్యులు సెమీఫైనల్స్ లో కూడా ధాటిగా ఆడితే అందరికీ ఆనందం పంచినవారవుతారు.