- క్లినికల్ ట్రయల్స్ కోసం వచ్చిన వాక్సీన్
- హైదరాబాద్ రెడ్డీ ల్యాబ్స్ ధ్రువీకరణ
- ఫెజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్
- కరోనా వైరస్ పై పోరాటంలో 92 శాతం కనబరచిన స్పుత్నిక్ వాక్సీన్
హైదరాబాద్: రెండవ, మూడవ స్థాయి పరీక్షలు నిర్వహించేందుకు స్పుత్నిక్-వి టీకామందు ఇండియాకు చేరింది. దీనిని హైదరాబాద్ కు చెందిన రెడ్డీ ల్యాబ్య్ యాజమాన్యం ధ్రువీకరించింది. ఈ మందు ఎంత సురక్షితమైనదో, దీని వల్ల ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో పరీక్షించడం కూడా ఈ ప్రయోగాలలో భాగం.
ఈ టీకామందు ప్రయోగాలు చేయడానికి డీసీజీఐ రెడ్డీల్యాబ్స్ కు అనుమతి మంజూరు చేసింది. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ (బీఐఏఆర్ సీ)సహకారంతో ఈ ప్రయోగాలను డాక్టర్ రెడ్డీ నిర్వహిస్తుంది. బీఐఏఆర్ సీని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నెలకొల్పింది.
స్పుత్నిక్-వి ని ఆగస్టులోనే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రిజిస్టర్ చేశారు. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్ డీఐఎఫ్) ఈ టీకా మందుకు విడుదల చేస్తుంది. నియంత్రణ సంస్థ (రెగ్యులేటరీ) రెడ్డీ ల్యాబ్స్ ప్రయోగాలను ఆమోదించిన తర్వాత రష్యన్ సంస్థ కోటి డోసుల స్పుత్నిక్ –వి టీకామందును విడుదల చేస్తుంది.
తమ టీకా మందు కోవిడ్ -19 పై పోరాటంలో 90 శాతం విజయం సాధిస్తున్నదని వెల్లడిస్తూ ఫైజర్ కంపెనీ ఇటీవల ఒక ప్రకటన జారీ చేసింది. మనుషుల మీద మూడో స్థాయి ప్రయోగాన్ని ఫైజర్ టీకామందు పూర్తి చేసింది. బయోటెక్ కోవాక్సిన్ మనుషుల పైన మూడవ దశ ప్రయోగంలో ఉన్నది. ఫైజర్ టీకామందు, స్పుత్నిక్ –వి టీకామందు, బయోటెక్ కోవాక్సిన్ టీకా మందు కరోనా వైరస్ ను నిరోధించగలవనే ఆశ కలుగుతున్నది.