- నాలుగోస్థానానికి పడిన ఇంగ్లండ్
- చెపాక్ దెబ్బతో ర్యాంకులు తారుమారు
ఐసీసీ టెస్ట్ లీగ్ టేబుల్ షేర్ మార్కెట్ సూచీలను తలపిస్తూ సాగుతోంది. వారానికి ఓ తీరుగా ఉంటూ వస్తోంది. గతవారం జరిగిన చెన్నై తొలిటెస్టులో భారత్ 227 పరుగుల తేడాతో ఓటమి పొందడంతో టాప్ ర్యాంక్ నుంచి 4వ స్థానానికి పడిపోయింది. అప్పటి వరకూ నాలుగో ర్యాంకులో ఉన్న ఇంగ్లండ్ కాస్త అనూహ్యంగా అగ్రస్థానానికి చేరుకోగలిగింది. అయితే ఆ ఆధిక్యం వారంరోజుల ముచ్చటగానే ముగిసింది. చెన్నై వేదికగా జరిగిన రెండోటెస్టుమ్యాచ్ మొదటి నాలుగురోజుల ఆటలోనే భారత్ 317 పరుగుల భారీ తేడాతో నెగ్గి ప్రతీకారం తీర్చుకొంది. మొదటి రెండుటెస్టులు ముగిసే సమయానికి 1-1తో సమఉజ్జీగా నిలిచింది. అయితే రెండోటెస్టు పరాజయంతో ఇంగ్లండ్ జట్టు టాప్ ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్ కు పడిపోయింది. గతవారం రోజులుగా నాలుగో ర్యాంక్ లో ఉన్న భారత్ కాస్త భారీవిజయంతో పుంజుకొని రెండోర్యాంక్ కు చేరుకోగలిగింది.
ఆఖరి రెండు టెస్టులూ కీలకం :
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా రికార్డులకెక్కిన అహ్మదాబాద్ సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా ఈనెల 24 నుంచి జరుగనున్న సిరీస్ లోని ఆఖరి రెండుటెస్టుల ఫలితాల పైనే…టెస్ట్ లీగ్ ఫైనల్స్ కు ఏ జట్టు చేరేది తేలిపోనుంది. కంగారూజట్టు సౌత్ ఆఫ్రికా పర్యటన రద్దుకావడంతో న్యూజిలాండ్ నేరుగా టెస్ట్ లీగ్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగా మిగిలిన స్థానం కోసం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు పోటీపడుతున్నాయి. భారత్ ఫైనల్స్ చేరాలంటే అహ్మదాబాద్ వేదికగా జరిగే మిగిలిన రెండుటెస్టుల్లో ఓ మ్యాచ్ నెగ్గి, మరో మ్యాచ్ ను డ్రాగా ముగిస్తే సరిపోతుంది. అయితే ఇప్పటికీ టెస్టు లీగ్ ఫైనల్‌కు ఎవరు అర్హత సాధించగలరనేది మాత్రం మూడో టెస్టు తర్వాతే తేలనుంది. ఒకవేళ అహ్మదాబాద్ వేదికగా జరగనున్న డే-నైట్ టెస్టులో భారత్ విజయం సాధిస్తే 2-1 తేడాతో నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఇంగ్లండ్ నెగ్గితే మాత్రం ఆఖరి టెస్టులో ఆరునూరైనా భారత్ నెగ్గితీరాల్సి ఉంది. కాగా భారత్ కు ప్రస్తుతం 69.7 పీసీటీ పాయింట్లు ఉండగా ఇంగ్లండ్‌కు 67 పీసీటీ పాయింట్లు ఉన్నాయి.
టెస్టు సిరీస్ లీగ్ లో భాగంగా ప్రస్తుతం ఆరవ సిరీస్ ఆడుతున్న భారత జట్టు 10 విజయాలు, 4 పరాజయాలు, ఓ డ్రా రికార్డుతో ఉంది. ఇప్పటికే 70 పీసీటీ పాయింట్లతో న్యూజిలాండ్ జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. జూన్‌లో లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్ట్ లీగ్ టైటిల్ సమరం జరుగనుంది.