టోక్యో వేదికగా సాగుతున్న ఒలింపిక్స్ లో భారతావనికి వస్తున్న మెడల్స్ కొత్త ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. ప్రతి గెలుపూ మరో మలుపుకు ఊతంగా,ప్రతి ఓటమి మరోగెలుపుకు మూలంగా సాగే క్రీడాపర్వంలో భారతదేశం తన ఖ్యాతిని నిలబెట్టుకుంటూనే ఉంది. తాజాగా హాకీలో మన్ ప్రీత్ సేన దక్కించుకున్న పతకం 41ఏళ్ళనాటి ప్రతిష్ఠను పునఃలిఖించింది. భారత పతాకాన్ని విశ్వవీధుల్లో రెపరెపలాడించింది. హకీకి పునర్వైభవం ఆరంభమైందనే ఆశలపల్లకీని నిర్మించింది. ఈ ఆట క్రికెట్ ను మించిన ఉత్కంఠను, ఉద్వేగభరిత విజయాన్ని అందించింది. జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో భారతమ్మకే విజయం వరించిందన్న వార్త క్రీడా ప్రపంచాన్ని విస్మయపరిచింది. చివరి ఆరు సెకన్లలో అద్భుతం జరిగింది.
Also read: రామాలయం సరే, రామరాజ్యం ఎప్పుడు?
హాకీ విజయం కోవిడ్ యోధులకు అంకితం
హకీకి సాధించిన కాంస్య పతకాన్ని కోవిడ్ యోధులకు అంకితం చేస్తున్నామని కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ ప్రకటించడం మనందరికీ ప్రీతిపాత్రమే. ఇది ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు మిగిల్చిన గొప్ప జ్ఞాపకాల సరసన చేరింది. బెల్జియంతో జరిగిన సెమిస్ లో టీమ్ ఇండియా పోరాడి ఓడింది. తాత్కాలికంగా ఓడినా, చివరకు గెలుపు మనదే అన్నమాట రుజువయ్యింది.ప్రతిష్ఠాత్మక విశ్వక్రీడల్లో ఈసారి భారత్ కు అమ్మాయిలే పెద్దదిక్కుగా మారారన్న వ్యాఖ్యలు నూరుశాతం సత్యసుందరాలు. నిన్ననే మన తెలుగమ్మాయి సింధు గెలుపుగుర్రంపై ఊరు చేరారు. ఒలింపిక్స్ లో వరుసగా ఆమె రెండు పతకాలు గెలిచిన సందర్భాన్ని ఊరువాడా పండుగ చేసుకున్నారు. డిసెంబర్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్స్ లో ఘన విజయం సాధించడానికి ఒలింపిక్స్ గెలుపు సింధుకు గొప్ప ప్రేరణ కానుంది. ఈ రోజు హకీకి దక్కిన గుర్తింపు అనందంగా ఉన్నా, ఇన్నేళ్ల మన వెనకబాటుతనం బాధకు గురిచేస్తోంది. హకీలో భారత గత చరిత్ర ఎంతో ఘనమైంది. ఆ సువర్ణ అధ్యాయాన్ని ఇప్పటికే అందుకోలేకపోతున్నామన్నది బాధాకరం. ఇప్పుడు ఈమాత్రమైనా గుర్తింపు దక్కిందంటే ఆ పుణ్యం ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కే చెందుతుంది. 2018 నుంచి ఆయన నిధులు కేటాయించి, ఆటను అద్భుతంగా ప్రోత్సహిస్తున్నారు. గెలుపులో వాటాను కొట్టేయ్యడానికి తగుదునమ్మా అంటూ నేడు అందరూ తయారవుతున్నారు. భారత ప్రభుత్వానికి నిధులు లేక కాదు, దానిపై ధ్యాస లేక, విస్మృతికి గురయ్యింది. 1980తోనే మన సువర్ణ అధ్యాయం ముగిసింది. ఈ ఆటను భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చారు.
Also read: విశాఖ ఉక్కు: నాయకుల నక్కజిత్తులు
హాకీ స్వర్ణాలు గత వైభవం
1928లో ఒలింపిక్స్ లో జరిగిన ఐదు ఆటల్లోనూ మనదే గెలుపు, బంగారుపతకం మనమే సొంతం చేసుకున్నాం. అప్పటి నుంచి 1956 వరకూ ప్రతిసారీ స్వర్ణం మనకే దక్కింది. మళ్ళీ 1964,1980లో తిరిగి స్వర్ణాలు సాధించాం. తర్వాత గడ్డికి బదులుగా కృత్రిమ మైదానాలను వాడడం మొదలు పెట్టారు. నిబంధనలను కూడా మార్చారు. అప్పటి నుంచి మెల్లగా మనం పట్టుకోల్పోయాం. పురుషులు, స్త్రీలు అంతర్జాతీయ పోటీల్లో నిలుస్తున్నారు. ఒలింపిక్స్, ప్రపంచ కప్ వేదికలుగా నిలుస్తున్నా మనం సత్తా చాటుకోలేకపోయాం. భారతదేశపు ఖాతాలో ఇప్పటి వరకూ 8 ఒలింపిక్ స్వర్ణాలు చేరాయి. మనం స్వర్ణానికి దూరమై చాలాకాలమైంది. ఇన్నేళ్లకు మళ్ళీ మనకు పతకం చేరువైంది. అది కాంస్యమే అయినా, ప్రస్తుతానికి బంగారంగానే భావించాల్సి వస్తోంది. రేపు జరుగబోయే మహిళల ఆటలో మనం కాంస్యం దక్కించుకుంటే, మరోమైలురాయిని చేరినవాళ్ళమవుతాం. క్రికెట్ ఫీవర్ మన హాకీని నిరాదరణకు గురిచేసిందన్నది చేదునిజం. ఒరిస్సా ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హకీకి ప్రోత్సాహకంగా భారీగా నిధులు కేటాయించి, మన క్రీడాకారులకు, తద్వారా మన క్రీడకు పునరుత్తేజాన్ని కలిగించారు. దేశ పాలకులు, మిగిలిన ప్రభుత్వాలు ఒరిస్సా ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందే. క్రీడా ప్రపంచంలో, వివిధ క్రీడల్లో గుర్తింపు తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, మనదైన క్రీడలను ప్రోత్సహిస్తూ, కాపాడడం అంతకంటే ముఖ్యం. ఆ బాధ్యత ప్రభుత్వలాది, ఏలికలదీ అని మన నాయకులు మరువరాదు. కనీసం, ఇప్పటి నుంచైనా మేలుకుందాం, క్రీడాప్రపంచాన్ని ఏలుకుందాం.
Also read: వ్యధాభరిత కథావిశ్వనాధుడు