- టీఎన్ సీఏ కు బీసీసీఐ ఆదేశం
ఇంగ్లండ్ తో ఫిబ్రవరి 5నుంచి జరిగే టెస్టు సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించాలన్నఅభిమానుల ఆశలపై బీసీసీఐ నీళ్ళు చల్లింది. ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టులకు చెన్నై చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి ఐదురోజులపాటు తొలిటెస్టు, ఫిబ్రవరి 13 నుంచి ఐదు రోజులపాటు రెండోటెస్ట్ మ్యాచ్ నిర్వహించడానికి ఆతిథ్య తమిళనాడు క్రికెట్ సంఘం ఏర్పాట్లు చేసింది. స్టేడియం సామర్థ్యంలో 25 నుంచి 50 శాతం మంది అభిమానులను మ్యాచ్ కు అనుమతించాలని కూడా నిర్ణయం తీసుకొంది. అయితే…దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతూ ఉండడంతో ముందు జాగ్రత్తచర్యగా ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ వర్తమానం పంపింది.
ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టెస్టు సిరీస్ ను పరిమిత సంఖ్యలో అభిమానులను స్టేడియాలలోకి అనుమతించడం ద్వారా నిర్వహించారు. అడిలైడ్, మెల్ బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ నగరాలు వేదికలుగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లకు 25 నుంచి 50 శాతం మంది అభిమానులను మాత్రమే అనుమతించారు. సిడ్నీటెస్టుకు మాత్రం రోజుకు 10వేల మంది అభిమానులకు మాత్రమే టికెట్లు విక్రయించారు.
క్రికెట్ ఆస్ట్రేలియా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ సైతం పరిమిత సంఖ్యలో అభిమానులతో అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. ఈలోపే కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ నుంచి ముందస్తు హెచ్చరికలు రావడంతో బీసీసీఐ జాగ్రత్తపడింది.
ఇదీ చదవండి:కొహ్లీకి టెస్ట్ కెప్టెన్సీ అవసరమా?
ఫిబ్రవరి 5 నుంచి 17 వరకూ జరిగే రెండు టెస్టుమ్యాచ్ లనూ స్టేడియం గేట్లు మూసి మ్యాచ్ లు నిర్వహించాలని తమిళనాడు క్రికెట్ సంఘాన్ని బీసీసీఐ ఆదేశించింది. తమిళనాడు క్రికెట్ సంఘానికి జనవరి 20వ తేదీన బీసీసీఐ సమాచారం పంపింది. అవుట్ డోర్ స్టేడియాలలో జరిగే క్రీడలకు 50 శాతం మంది అభిమానులను అనుమతించవచ్చునంటూ భారత ప్రభుత్వం ఇటీవలే మార్గదర్శకాలను విడుదల చేసింది.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇంగ్లండ్ తో జరిగే నాలుగు మ్యాచ్ ల టెస్టు, 5 మ్యాచ్ ల టీ-20, మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లు నిర్వహించాలని బీసీసీఐ, ఆతిథ్య క్రికెట్ సంఘాలు భావించాయి. అయితే…అనూహ్యంగా దేశంలో కరోనావైరస్ సోకినవారి సంఖ్య పెరిగిపోవడంతో ముందు జాగ్రత్తచర్యగా ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్ లు నిర్వహించడం మేలని బీసీసీఐ భావించింది. అభిమానులను స్టేడియాలలోకి అనుమతించకపోడంతో గేట్ మనీ రూపంలో 5 నుంచి 10 శాతం ఆదాయం కోల్పోక తప్పదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
ఇదీ చదవండి: భారత్ కు ఇంగ్లండ్ పేస్ సవాల్