Tuesday, January 21, 2025

నేలవిడిచి సాములో భారత్ సరికొత్త రికార్డు

  • సిడ్నీటెస్ట్ డ్రాతో సత్తాచాటిన రహానే సేన
  • టెస్ట్ క్రికెట్ రికార్డుల్లో మరో అసాధారణ డ్రా

టెస్ట్ క్రికెట్ మాజీ నంబర్ వన్ భారత్ మరోసారి తన సత్తా చాటుకొంది. తీవ్రప్రతికూల పరిస్థితుల నడుమ నేలవిడిచి సాము చేయటంలో తనకుతానే సాటిగా నిలిచింది. కంగారూగడ్డపై…అదీ సిడ్నీ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్ర్రేలియాతో సిడ్నీ వేదికగా ముగిసిన మూడోటెస్ట్ ను ఫైటింగ్ డ్రాగా ముగించడం ద్వారా సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది.

 వారేవ్వా!…ఏమి డ్రా:

సిడ్నీటెస్ట్ లో భారత్ విజయం సాధించాలంటే నాలుగో ఇన్నింగ్స్ల్ లో 407 పరుగుల రికార్డు లక్ష్యం సాధించాలి. అయితే… స్టార్ ఆటగాడు విరాట్ కొహ్లీ పితృత్వపు సెలవుతో అందుబాటులో లేడు. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బొటనవేలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితిలో నాలుగోరోజుఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 98 పరుగుల స్కోరు సాధించిన భారత్…బ్యాటింగ్ కు అంతగా అనువుకాని సిడ్నీఆఖరిరోజు పిచ్ పైన 307 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగింది.

రిషభ్ పంత్ 118 నిముషాల విధ్వంసం:

చతేశ్వర్ పూజారా- అజింక్యా రహానేల జోడీతో ఆఖరిరోజు ఆటను కొనసాగించిన భారత్ కు ప్రారంభఓవర్లలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రహానేను స్పిన్నర్ నేథన్ లయన్ పడగొట్టాడు. దీంతో ఆస్ట్ర్రేలియా విజయం, భారత్ పరాజయం కేవలం లాంఛనం మాత్రమేనని అందరూ భావించారు. క్రికెట్ పండితులు సైతం కంగారూలదే గెలుపన్న అంచనాకు వచ్చారు. దానికి తోడు భారత్ 200 పరుగుల స్కోరు సాధిస్తే గొప్పంటూ ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు.

అయితే…భారత యువఆటగాడు రిషభ్ పంత్, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా మాత్రం…అందరి అంచనాలు తలకిందులు చేసేలా పోరాడారు. రిషభ్ పంత్-పూజారా జోడీ ఓ వ్యూహం ప్రకారం కంగారూ బౌలింగ్ ఎటాక్ ను దీటుగా ఎదుర్కొన్నారు. పంత్ తనదైన శైలిలో బ్యాట్ కు పనిచెప్పి దూకుడుగా ఆడితే…పూజారా చెక్కుచెదరని డిఫెన్స్ తో అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు సెంచరీభాగస్వామ్యంతో భారత గెలుపు ఆశలు చిగురింపచేశారు. తన టెస్ట్ జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడుతున్నానని రిషభ్ పంత్ భారీషాట్లతో చెప్పకనే చెప్పాడు. కంగారూ తురుపుముక్క, ఆఫ్ స్పిన్నర్ లయన్ బౌలింగ్ లో సిక్సర్లు, బౌండ్రీల మోత మోగించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. 118 నిముషాల సమయం మాత్రమే క్రీజులో ఉన్న రిషభ్ 118 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 12 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 97 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

 పూజారా మరో సూపర్ నాక్:

భారత బ్యాటింగ్ ఆర్డర్ కు వెన్నెముకలాంటి చతేశ్వర్ పూజారా తొలి ఇన్నింగ్స్ లో హాప్ సెంచరీ స్కోరుకు తోడు…రెండో ఇన్నింగ్స్ లో సైతం బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 205 నిముషాలపాటు ఎనలేని ఏకాగ్రతతో ఆడి 205 బాల్స్ ఎదుర్కొని 12 బౌండ్రీలతో 77 పరుగుల స్కోరుకు వెనుదిరగడంతో…భారత్ 5వ వికెట్ నష్టపోయింది. దీంతో విజయలక్ష్యాన్ని పక్కనపెట్టి మ్యాచ్ ను డ్రాగా ముగించడం పై దృష్టి పెట్టింది. మిడిలార్డర్ ఆటగాడు హనుమ విహారి- అశ్విన్ 6వ వికెట్ కు అజేయ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ ను డ్రాగా ముగించారు. తొడకండరాలు పట్టేసి విపరీతమైన బాధను కలిగించినా విహారీ ఓర్చుకొని ఆడి 161 బాల్స్ ఎదుర్కొని 4 బౌండ్రీలతో 23 పరుగులు, అశ్విన్ 128 బాల్స్ లో 7 బౌండ్రీలతో 39 పరుగుల స్కోర్లతో అజేయంగా నిలవడంతో భారత్ 131 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగుల స్కోరుతో మ్యాచ్ ను డ్రాగా ముగించగలిగింది. సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ ల చరిత్రలోనే నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు సాదించిన జట్టుగా భారత్ రికార్డుల్లో చేరింది.

 నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక ఓవర్లు:

నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక ఓవర్లు ఎదుర్కొన్న జట్టుగా భారత్ తన రికార్డును తానే తిరగరాస్తూ వస్తోంది. 2014-15 సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్ లో 89.5 ఓవర్లు ఎదుర్కొని మ్యాచ్ ను డ్రాగా ముగించిన భారత్ …ప్రస్తుత 2020-21 సిరీస్ లో 131 ఓవర్లు ఎదుర్కొని అదే ఫలితాన్ని సాధించడం అరుదైన ఘనతగా మిగిలిపోతుంది. అంతేకాదు…1979లో ఓవల్ వేదికగా ఇంగ్లండ్ జరిగిన మ్యాచ్ లో 150.5 ఓవర్లు ఎదుర్కొన్న భారతజట్టు ఆ తర్వాత అత్యధికంగా 131 ఓవర్లు ఎదుర్కొనడం ఇదే మొదటిసారి.     

 భళా పంత్…హ్యాట్సాఫ్ టు విహారి, అశ్విన్:

సిడ్నీటెస్ట్ తుదివరకూ పోరాడి మ్యాచ్ ను డ్రాగా ముగించడం పట్ల భారత కెప్టెన్ అజింక్యా రహానే సంతృప్తి వ్యక్తం చేశాడు. పంత్ క్రీజులో ఉన్నంతసేపు తాము విజయమే లక్ష్యమని అనుకొన్నామని, పంత్, పూజారా ఒకరి తర్వాత ఒకరుగా అవుటైన వెంటనే మ్యాచ్ ను డ్రాగా ముగించాలని భావించామని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ చెప్పాడు. హనుమ విహారీ- అశ్విన్ లు పోరాడిన తీరూ అపూర్వమని కొనియాడాడు.

విజయం చేజారింది- పెయిన్:

ఆఖరి రెండురోజుల ఆటలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన తమజట్టు విజయం అంచుల వరకూ వచ్చి డ్రాతో సరిపెట్టుకోవాల్సి రావడం దురదృష్టమని ఆస్ట్ర్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ వాపోయాడు. తమ బౌలర్లు గెలుపు కోసం చేయాల్సిదంతా చేశారని, వికెట్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారటం తమను దెబ్బతీసిందని చెప్పాడు. మొత్తం మీద…ఫుల్ టైమ్ కెప్టెన్ విరాట్ కొహ్లీ లేకుండానే రహానే నాయకత్వంలో భారత్ వరుసగా సాధించిన రెండో అత్యుత్తమ టెస్ట్ పలితంగా ఈ సిడ్నీటెస్ట్ డ్రా నిలిచిపోతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles