- జర్మనీపైన ఘనవిజయం, కాంస్యం సొంతం
- 41 ఏళ్ళ నిరీక్షణకు తెర
- సిమ్రాన్ జిత్ సింగ్ రెండు గోల్స్
టోక్యో: భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. జర్మనీ జట్టుపైన 5-4 ఆధిక్యంతో విజయం సాధించి 41 ఏళ్ళ అప్రతిష్టను అధిగమించింది. భారత హాకీ జట్టు ఒలింపిక్స్ లో చివరిసారిగా ఒక పతకం సాధించింది 1980 మాస్కో ఒలింపిక్స్ లో. ఈ సారి లీగ్ మ్యాచ్ లలో ఏ లీగ్ లో రెండో స్థానంలో నిలిచి, బీ లీగ్ లో మూడో స్థానంలో ఉన్న గ్రేట్ బ్రిటన్ పైన క్వార్టర్ ఫైనల్ కు చేరుకొని భారత జట్టు చరిత్ర సృష్టించింది. కానీ సెమీఫైనల్ లో బ్రెజిల్ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా మరో సెమీ ఫైనల్ లో ఓడిన జర్మనీతో గురువారం ఉదయం తలబడింది. 5-4 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
జర్మనీ ఆటగాడు టైమూర్ ఓరుజ్ ఆట ప్రారంభమైన రెండో నిమిషంలోనే గోల్ చేయడంతో జర్మనీ ఆధిక్యంతో ఆట సాగింది. కానీ సిమ్రాంజీత్ సింగ్ 17వ నిమిషంలో గోల్ సాధించి స్కోర్ ను 1-1 దగ్గర సమం చేశాడు. అయితే, ఈ దశలో జర్మనీ విజృంభించింది. వరుసగా రెండు గోల్స్ సాధించి 3-1 స్కోర్ కు ఎగబాకింది. హార్దిక్ సింగ్ భారత్ కు ఒక గోలు సంపాదించి 2-3 స్కొరు చేశాడు. హర్మన్ ప్రీత్ సింగ్ మరో గోలు చేసి జర్మనీతో ఇండియాను 3-3 స్కోర్ దగ్గర సమం చేశాడు. ఇదంతా రెండో క్వార్టర్లో జరిగిపోయింది.
అభేద్యమైన రక్షణ వలయం
మూడో క్వార్టర్లో ఇండియా సఫలమైంది. రూపిందర్ పాల్ సింగ్ పెనాల్టీ కార్నర్ ను గోలుగా మాలచడంలో సఫలీకృతుడైనాడు. ఇండియా 4-3 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆ తర్వాత సిమ్రాన్ జీతీ సింగ్ రెండో గోలు సాధించి 5-3 గోల్స్ ఆధిక్యానికి పెంచాడు. అంటే మూడో క్వార్టర్లొ ఇండియా రెండు గోల్స్ సాధించగా జర్మనీ ఒక్క గోలు కూడా చేయలేకపోయింది. చివరి క్వార్టర్లో జర్మనీ జట్టు రెచ్చిపోయి ఆడింది. పెనాల్టీ కార్నర్లు చాలానే వచ్చినప్పటికీ ఒకే ఒక పెనాల్టీ కార్నర్ ను గోలుగా మలచగలిగింది. నాలుగో క్వార్టర్ ముగియడానికి కొన్ని క్షణాల ముందు జర్మనీకి పెనాల్టీకార్నర్ దక్కింది. కానీ దానిని పీఆర్ రంజీష్ నిష్ఫలం చేశాడు. భారత క్రీడాకారులు రక్షణ వలయాన్ని దుర్భేద్యంగా రక్షించుకొని మ్యాచ్ గెలుగుకొన కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఒలింపిక్స్ హాకీలో పతకం కోసం 41 సంవత్సరాల నిరీక్షణకు తెరదింపారు.
చిరకాలం ఈ రోజు జ్ఞాపకం ఉంటుంది: ప్రధాని
ఈ రోజు, గురువారం, 5 ఆగస్టు 2021,ప్రతి భారతీయుడి హృదయంలో పదిలంగా ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ ఒక ట్వీట్ లో అభినందించారు. నలభై ఒక సంవత్సరాలలో భారత్ తొలి పతకాన్ని సాధించిన క్షణాలను భారతీయులు ఎన్నటికీ మరిచిపోలేరని ఆయన అన్నారు. ‘‘ఈ ఘనకార్యంతో దేశ ప్రజల, ముఖ్యంగా యువజనులకు, స్ఫూర్తినిచ్చారు,’’ అంటూ ప్రధాని ప్రశంసించారు. మోదీ ఈ రోజు యోగా క్లాస్ కు డుమ్మాకొట్టి హాకీ మ్యాచ్ వీక్షించారని అభిజ్ఞవర్గాలు తెలియజేశాయి. దేశం మొత్తాన్ని గర్వించేటట్టు చేశారంటూ దేశీయాంగమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘‘పిల్లలూ మీరు ఘనకార్యం సాధించారు. మేము మౌనంగా ఉండజాలము,’’అని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మంచి విజయం (వెల్ డిజర్వుడ్ విక్టరీ) సాధించినందుకు భారత హాకీ క్రీడాకారులను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అభినందించారు.